ప్రేమనగర్ కాంబోలో మరో క్లాసిక్ – Nostalgia

ANR-Secretary: రెండు మూడు వందల పేజీలున్న నవలను తెరకెక్కించడం చాలా కష్టం. అందులోనూ స్టార్ హీరోతో చేస్తున్నప్పుడు కమర్షియల్ ఫార్ములాను అనుసరించి మార్పులు చేయాల్సి ఉంటుంది. పాటలను జోడించాల్సి వస్తుంది. ఏ మాత్రం అటుఇటు అయినా సరే నిర్మాతకు నష్టం తప్పదు. ఈ లెక్కలను సరిగ్గా వేసుకోగలరు కాబట్టే నిర్మాత డాక్టర్ డి రామానాయుడు అద్భుత విజయాలు సొంతం చేసుకోగలిగారు. 1971 ప్రేమనగర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత నాయుడు గారికి మరోసారి ఆ కాంబినేషన్ ని రిపీట్ చేయాలన్న కోరిక కలిగింది. సరిగ్గా అదే సమయంలో యద్దనపూడి సులోచనారాణి రాసిన సెక్రటరీ నవల తెలుగు రాష్ట్రాన్ని ఊపేస్తోంది.

1976లో వచ్చిన ఈ పుస్తకాన్ని సినిమాగా తీయాలని కొందరు ప్రయత్నించారు కానీ ఆఖరికి అది నాయుడు గారికే దక్కింది. అప్పుడే హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం జరుగుతోంది. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ హీరో హీరోయిన్లుగా కేఎస్ ప్రకాష్ రావు దర్శకత్వంలో కెవి మహదేవన్ సంగీతం సమకూర్చగా ఆత్రేయ సాహిత్యంతో మరోసారి ప్రేమనగర్ బృందాన్ని సిద్ధం చేశారు. కొంత భాగం చెన్నైలో తీసి మిగిలినదంతా భాగ్యనగరంలోనే చిత్రీకరణ జరపడం అప్పట్లో సంచలనం. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడ సౌకర్యాలు ఉండేవి కావు. అప్పటి ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంది.

రెండు నెలల లోపే షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. మనసు లేని బ్రతుకొక నరకం లాంటి పాటలు ఆడియో పరంగా జనానికి బాగా రీచ్ అయ్యాయి. 1978 ఏప్రిల్ 28న మంచి అంచనాలతో సెక్రటరీ థియేటర్లలో అడుగు పెట్టింది. నవలను విపరీతంగా ప్రేమించిన రీడర్స్ కు పూర్తి సంతృప్తి కలగలేదు కానీ మెల్లగా జనం ఆదరించడం మొదలుపెట్టారు. సెకండ్ రిలీజ్ లో మంచి వసూళ్లు వచ్చాయి. శివాజీ గణేష్ అతిధిగా వంద రోజుల వేడుక ఘనంగా నిర్వహించారు రామానాయుడు గారు. రెండు రోజుల గ్యాప్ తో వచ్చి పెద్దగా అంచనాలు లేని నా పేరే భగవాన్ కమర్షియల్ గా సక్సెస్ కావడం గమనించాల్సిన అంశం.

ALSO READ – అనన్య కోసం లైగర్ పరుగులు

Show comments