Venkateswarlu
Venkateswarlu
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ నితిన్ చంద్రకాంత్ దేశాయ్ కన్నుమూశారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక సొంత స్టూడియోలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు చంద్రకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నితిన్ చంద్రకాంత్ దేశాయ్ అలియాస్ నితిన్ దేశాయ్‌కి ఆర్ట్ డైరెక్టర్‌గా హిందీ, మరాఠీ భాషల్లో మంచి పేరుంది. ఆయన దేవ్‌దాస్, హమ్ దిల్ దే చుకే సోనమ్, జోదా అక్బర్, లగాన్ వంటి ఎన్నో హిట్ సినిమాలకు పని చేశారు. ఆయనకంటూ సొంతంగా ఓ స్టూడియో ఉంది.
అంతేకాదు! ఆయనకు ఆర్ట్ డైరెక్షన్ విభాగంలో నాలుగు జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే, ఒకప్పుడు చేతినిండా పనితో నలుగురికి అన్నం పెట్టిన నితిన్ పరిస్థితి ఇప్పుడు తారుమారైంది. గత ఐదేళ్లనుంచి ఆయనకు సరిగా పని లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టాయి. అంతేకాదు! తన దగ్గర పని చేసే వారికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నితిన్ దేశాయ్ మనస్తాపానికి గురయ్యారు. ప్రాణాలు తీసుకోవటమే ఏకైక మార్గంగా భావించారు. బుధవారం ఉదయం తన స్టూడియోలో ఉరి వేసుకుని చనిపోయారు.
ఉదయం స్టూడియోకు వచ్చిన ఆయన శిష్యులు.. ఉరికి వేలాడుతున్న నితిన్ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు స్టూడియోకు చేరుకున్నారు. నితిన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా, నితిన్ 1999లో ‘దాదా సాహెబ్ అంబేద్కర్’.. 2000లో ‘హమ్ దిల్ దే చుకే సోనమ్’.. 2002లో ‘లగాన్’.. 2003లో ‘దేవ్‌దాస్’ సినిమాలకు జాతీయ అవార్డులు అందుకున్నారు. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం అందుకున్నారు. ఇక, నితిన్ దేశాయ్ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.