వీడియో: భర్త కావాలంటూ రోడ్డెక్కిన యువతి.. ప్లకార్డు చూపిస్తూ!

జిహ్మకో రుచి పుర్రెకో బుద్ధి అన్న చందాన.. ఒక్కోరి ఆలోచనా విధానం ఒక్కో విధంగా ఉంటుంది. ఇంటర్‌ నెట్‌ వాడకం పెరిగిపోయిన తర్వాత మనుషులా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలన్న ఉద్ధేశ్యంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. తాజాగా, ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఓ అడుగు ముందుకు వేసి, వ్యూస్‌ కోసం పిచ్చి పని చేసింది. భర్త కావాలంటూ రోడ్లపై ప్లకార్డులతో తిరిగింది. ప్లకార్డుతో ఉన్న ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

 ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కరోలినా గేయిట్స్‌కు సోషల్‌ మీడియాలో పిచ్చ పాపులారిటీ ఉంది. ఆమె నిత్యం ఏదో ఒక వింత పని చేస్తూ ఉంటుంది. తాజాగా, ఆమె ఓ ప్లకార్డుతో రోడ్డుపైకి వచ్చింది. ఆ ప్లకార్డును గాల్లోకి ఎత్తి పట్టుకుని తిరగసాగింది. ఆ ప్లకార్డును చూసిన వాళ్లు ఆశ్చర్యంతో ఆమె వైపు చూడసాగారు. ఇంతకీ ఆ ప్లకార్డులో ఏముందంటే.. ‘‘ నాకు భర్త కావాలి’’ అని రాసి ఉంది. చాలా మంది ఆ ప్లకార్డును చూసిన.. పట్టించుకోకుండా వెళ్లిపోయారు.

ఓ వ్యక్తి మాత్రం ధైర్యం చేశాడు. కరోలినాను చేతుల్తో ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘నాకు ఒకరు దొరికారని అనుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆమెను ప్రశంసిస్తుంటే.. మరికొంతమంది తిడుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments