నిద్రలో నడుస్తూ ఏకంగా 160 కి.మీ ప్రయాణించాడు!

కొంతమందికి నిద్రలో నడిచే సమస్య ఉంటుంది. దీన్నే ఇంగ్లీష్‌లో ‘స్లీప్‌ వాక్‌’ అంటారు. ఈ స్లీప్‌ వాక్‌ చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఇక, ఈ స్లీప్‌ వాక్‌ సమస్య ఉన్నవారు తమకు తెలియకుండానే ఒక చోటు నుంచి మరో చోటుకు నడుచుకుంటూ వెళ్లిపోతుంటారు. ఇలా ఇంట్లోనే  అటు,ఇటు తిరగటం లేదా బయటకు వెళ్లి కొన్ని వీధుల్లో తిరగటం వంటివి సాధారణం. అయితే, ఓ వ్యక్తి మాత్రం నిద్రలో ఏకంగా 160 కిలోమీటర్లు ప్రయాణించాడు. అలా ప్రయాణించి ఏకంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించాడు.

ఆ వివరాల్లోకి వెళితే.. 1987, ఏప్రిల్‌ 6వ తేదీన అమెరికాకు చెందిన మైకెల్‌ డిక్షన్‌ అనే 11 ఏళ్ల కుర్రాడు ఇండియానాలోని రైల్వే ట్రాక్‌ పక్కన నడుస్తూ ఉన్నాడు. అతడ్ని చూసిన రైల్వే సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించారు. డిక్షన్‌ తనది ఇల్లినాయిస్‌లోని డాన్‌విల్లే అని చెప్పాడు. తాను అక్కడికి ఎలా వచ్చానో తెలీదన్నాడు. అసలు ఏం జరిగిందో కూడా తనకు గుర్తులేదన్నాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. డిక్షన్‌ కుటుంసభ్యులకు ఫోన్‌ చేశారు. ఆమె తల్లి ఫోన్‌ తీసి మాట్లాడింది.

తన కుమారుడికి నిద్రలో నడిచే అలవాటు ఉందని చెప్పింది. రాత్రి 10 గంటల సమయంలో తాను అతడ్ని బెడ్‌పై నిద్రపోతుండగా చూశానని చెప్పింది. ఇప్పటి వరకు ఎప్పుడూ అతడు నిద్రలో నడుస్తూ ఇళ్లు విడిచి వెళ్లలేదని అంది. డిక్షన్‌ పరిస్థితి తెలుసుకున్న పోలీసులు అతడ్ని క్షేమంగా ఇంటికి పంపారు. అయితే.. డిక్షన్‌ నిద్రలో నడుస్తూ 160 కిలోమీటర్లు ప్రయాణించడం అధికారికంగా ధ్రువీకరణ కావటంతో.. కుటుంబసభ్యులు గిన్నిస్‌ రికార్డుకు అప్లై చేశారు. ఇంతకు ముందు ఇలాంటి సంఘటన జరగలేదు కాబట్టి.. డిక్షన్‌ను గిన్నిస్‌ రికార్డు వరించింది. మరి, నిద్రలో 160 కిలోమీటర్లు నడిచి గిన్నిస్‌ రికార్డు సంపాదించిన డిక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments