విజయ్ దేవరకొండ – నెక్స్ట్ ఏంటి..?

  • Published - 03:45 PM, Wed - 9 November 22
విజయ్ దేవరకొండ – నెక్స్ట్ ఏంటి..?

ఊహించని విధంగా లైగర్ దారుణంగా డిజాస్టర్ కావడంతో బాగా షాక్ లో ఉన్న విజయ్ దేవరకొండ దాన్నుంచి మెల్లగా బయటికి వస్తున్నాడు. ఈ మధ్య పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. ఆ సినిమా తనకు చాలా పాఠాలు నేర్పిందని వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎన్నో తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ తన నెక్స్ట్ స్టెప్ ఏంటనే విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సమంతా చేస్తున్న ఖుషి అనారోగ్యం వల్ల బ్రేక్ వేసుకున్న సంగతి తెలిసిందే. త్వరగా కోలుకుంటుందనే నమ్మకంతో షెడ్యూల్ ప్లాన్ చేయడం కోసం ఎదురుచూస్తున్నారు. మహా అయితే నెల రోజుల బ్యాలన్స్ ఉంది అంతే.

ఈలోగా విజయ్ తన తర్వాతి కాంబినేషన్ ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడెప్పుడో సుకుమార్ ప్రాజెక్టు అనౌన్స్ చేశారు కానీ పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. తన ముందు ఇప్పుడు మూడు ఆప్షన్స్ ఉన్నాయట. మొదటిది హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ తో భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ అయ్యే సూచనలు దగ్గర్లో లేకపోవడం ఈ గబ్బర్ సింగ్ దర్శకుడు రౌడీ హీరోని టార్గెట్ చేసినట్టుగా తెలిసింది. ఒకవేళ ఓకే అయితే దిల్ రాజు నిర్మాణంలో సెట్ కావొచ్చు. రెండో ఛాయస్ పరశురామ్. సర్కారు వారి పాట పూర్తి అంచనాలు అందుకోలేకపోవడం నాగచైతన్యది పెండింగ్ లో ఉండిపోయింది. బాలయ్యకు ఇంకా నెరేషన్ ఇవ్వలేదు.

ఈలోగా విజయ్ దేవరకొండకు లైన్ నచ్చితే తనతో పట్టాలెకొచ్చు. ఇక లిస్టులో ఉన్న మూడో వ్యక్తి గౌతమ్ తిన్ననూరి. రామ్ చరణ్ తో ప్యాన్ ఇండియా మూవీ క్యాన్సిల్ కావడంతో అర్జెంట్ గా తనకో హీరో కావాలి. హిందీ జెర్సీ రీమేక్ మరీ దారుణంగా దెబ్బ తినడంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వడం చాలా అవసరం. వీళ్ళందరికీ పెద్ద బ్యానర్లలో కమిట్ మెంట్లు పెండింగ్ ఉన్నాయి. సో బడ్జెట్ లు గట్రా పెద్ద సమస్య కాదు. పైగా ఎపుడో అడ్వాన్సులు కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఏం చేస్తాడనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే తొందరపడకుండా ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకోవడంతో ఇంకొంత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

Show comments