Falaknuma Express Fire Accident-Threatening Letter: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విద్రోహచర్య.. 3 రోజుల క్రితమే బెదిరింపు లేఖ..

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం వెనుక విద్రోహచర్య.. 3 రోజుల క్రితమే బెదిరింపు లేఖ..!

యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ఉదయం మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై ప్రయాణికులను తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడంతోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ప్రమాదం వెనక విద్రోహచర్య ఉంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం మూడు రోజుల క్రితం దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులకు వచ్చిన ఒక లేఖ. ప్రమాదం తర్వాత లేఖ వెలుగులోకి రావడంతో.. అనుమానాలు బలపడుతున్నాయి.

ఇంతకు ఈ లేఖలో ఏం ఉంది అంటే.. హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో బాలాసోర్ తరహా రైలు ప్రమాదం జరుగుతుందని ఉంది. ప్రమాదం గురించి హెచ్చరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులకు మూడు రోజుల క్రితమే ఒక బెదిరింపు లేఖ అందింది. అంతేకాదు బాలాసోర్ తరహా ప్రమాదం జరగనుందని తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని లేఖలో పేర్కొన్నారు.

ఈ లెటర్‌ ఇంగ్లీష్‌లో ఉంది. అయితే అధికారులు ఈ లేఖను సీరియస్‌గా పట్టించుకోలేదు. ఎవరో ఆకతాయిలు కావాలని రాసి ఉంటారని భావించారు. పైగా ఈ లెటర్‌లో రైల్వే డీఎంకు కూడా లేఖ పంపిస్తున్నట్లు ఇందులో ఉంది. బెదిరింపు లెటర్‌ వచ్చిన మూడు రోజులకే.. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి నాలుగు బోగీలు అగ్నికి ఆహుతవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఓ వ్యక్తి ఛార్జింగ్ పాయింట్ దగ్గర సిగరెట్ తాగడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెబుతుండటం కూడా అనుమానాలకు బలం చేకురుస్తోంది. ఈ ప్రమాదం విద్రోహ చర్యనా.. కావాలనే ప్రమాదం సంభవించేలా చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతంఈ లేఖపై సౌత్ సెంట్రల్ అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా.. అనే కోణంలో విచారిస్తున్నారు.

పోయిన నెలలో ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు రైళ్లు ఢీకొట్టుకుని పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 300 మంది మరణించగా.. వెయ్యి మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యయి. దీని వెనుక కుట్ర కోణం ఉందని.. కావాలని ప్రమాదం చేయించారనే ప్రచారం జోరుగా జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. చివరకు సిగ్నలింగ్ లోపం వల్లే ప్రమాదం జరిగినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రమాదానికి కారణమైన  సదరు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని రైల్వేశాఖ ఈ సందర్భంగా ప్రకటించింది.

ఇక బాలాసోర్ ప్రమాదం తర్వాత దేశంలో పలుచోట్ల రైళ్లు పట్టాలు తప్పడం.. ట్రైన్లలో మంటలు చెలరేగడం వంటి ప్రమాదాలు పెరుగుతుండటంతో.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ నిమిషం ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం యాదాద్రి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగడం సంచలనంగా మారింది. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ప్రయాణికులు రైలు నుంచి కిందకు దిగేయడంతో పెను ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు.

Show comments