Revanth Reddy: అన్నదాతలకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఆగస్టు కల్లా రుణమాఫీ అమలు

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పి.. అన్నదాతలకు శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పి.. అన్నదాతలకు శుభవార్త చెప్పారు. ఆ వివరాలు..

తెలంగాణలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఎలక్షన్ సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా ఆరు గ్యారెంటీల్లో అధికశాతం హామీలు నెరవేర్చి ప్రజల్లో నమ్మకం చూరగొన్నది. ఇక ఆరు గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ మాత్రం ఇంకా అమలు కాలేదు. దీని కోసం అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ ఏడాది సరైన వర్షాలు లేక.. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారు. రానున్న కాలంలో సాగు చేయాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి. రైతు రుణమాఫీ పూర్తైతే తప్ప.. బ్యాంకుల్లో మళ్లీ అప్పు పుట్టదు. దాంతో అన్నదాతలు రుణమాఫీ అమలు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రుణమాఫీకి ఆగస్టులో ముహుర్తం ఫిక్స్ చేసింది. ఆ వివారలు..

సాగునీరు లేక పంటలు ఎండిపోయి.. రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉన్న వేళ.. రేవంత్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల రూపాయల రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోమవారం నారాయణపేటలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని తెలిపారు. ఏకకాలంలో రూ.2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని.. ఈ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రుణమాఫీ హామీని అమలు చేయలేదన్నారు. వడ్లకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు.

ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా, పంటల బీమాతో పాటు రుణమాఫీ పథకం విధివిధానాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారని తుమ్మల వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా, పంటల బీమా అమలుకు కావాల్సిన నిధుల సమీకరణపై చర్చించేందుకుగాను సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు భేటీ అయ్యారు. వ్యవసాయ పరపతి సంఘాలు, బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకున్నా రైతులను.. డబ్బు రికవరీ కోసం ఇబ్బందులు పెట్టకూడదంటూ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాక రానున్న వర్షాకాలం రైతుల అవసరాలను పరిగణలోకి తీసుకుని.. వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి తుమ్మల.. వ్యవసాయ అధికారులకుసూచించారు. మార్క్‌ఫెడ్‌ కేంద్రంగా రైతులకు తీసుకొచ్చే అన్ని రకాల పంటల కొనుగోలు సక్రమంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ యార్డులకు తీసుకువచ్చే ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Show comments