నాంది రివ్యూ

మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకుని చాలా కాలం పాటు కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అల్లరి నరేష్ ఫామ్ ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయింది. ఆ మధ్య థియేటర్లు తెరిచాక బంగారు బుల్లోడు రూపంలో ఏమైనా అలరిస్తాడనుకుంటే అది కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో ఇవాళ విడుదలైన నాంది మీద ప్రేక్షకులకు ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. కారణం రొటీన్ ఫార్ములా జోలికి వెళ్లకుండా నరేష్ చాలా సీరియస్ సబ్జెక్టును ఎంచుకోవడం. అందులోనూ ప్రమోషన్ టైంలో చూసిన ట్రైలర్లు, విజువల్స్ దీని మీద ప్రత్యేకమైన ఆసక్తి కలిగించాయి. మరి ఈ నాంది నరేష్ పునఃవిజయాలకు పునాది వేసిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

మధ్యతరగతికి చెందిన సూర్యప్రకాష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అమ్మానాన్నలతో చక్కని జీవితం గడుపుతున్న తనకు ప్రేమించిన మీనాక్షి(నవమి గాయక్)తో నిశ్చితార్థం కూడా అవుతుంది. అయితే అనుకోకుండా పౌర హక్కుల నేత రాజగోపాల్ హత్య కేసు మీద పడి ప్రకాష్ జైలు పాలవుతాడు. సిఐ కిషోర్(హరీష్ ఉత్తమన్)వల్ల సాక్ష్యాలు తనకు వ్యతిరేకంగా ఉండి ఐదేళ్ల పాటు జైల్లోనే మగ్గుతూ ఉంటాడు. ఈ క్రమంలో తన కోసం వాదించేందుకు ముందుకు వస్తుంది లాయర్ ఆద్య(వరలక్ష్మి శరత్ కుమార్). అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, అందులో ప్రకాష్ ఎలా ఇరుక్కున్నాడు, బయటికి వచ్చాక ఏం చేశాడు లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలి

నటీనటులు

ఏ నటుడికైనా ఒక ఇమేజ్ వచ్చి ఫలానా సినిమాలే చేస్తాడని ముద్రపడ్డాక అందులో నుంచి బయటికి రావడం కష్టం. అల్లరి నరేష్ ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డాడు. తనలో మంచి ఆర్టిస్ట్ ని కామెడీ హీరో అనే స్టాంప్ బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా దాచేసింది. అప్పుడప్పుడు నేను, గమ్యం రూపంలో కొందరు బయటికి తెచ్చారు కానీ ఎక్కువ శాతం తనను మూసకు పరిమితం చేశారు. చాలా ఏళ్ళకు నాంది రూపంలో అల్లరి నరేష్ తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి అవకాశం దక్కింది. దాన్ని పూర్తిగా వాడుకున్నాడు కూడా. ఎంతమోతాదు అవసరమో అంతే ఇస్తూ మరో కెరీర్ బెస్ట్ అందుకున్నాడు. ఇలాంటి కథల్లో హీరోయిన్ కు దక్కే ప్రాధాన్యం తక్కువే కాబట్టి నవమి గాయక్ కు చేయడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు. చాలా సేపు మాయమయ్యాక ఎక్కడో కనిపిస్తుంది.

అల్లరి నరేష్ తర్వాత అంతగా స్క్రీన్ మీద ప్రభావం చూపించింది వరలక్ష్మి శరత్ కుమార్. పరీక్ష పెట్టే పాత్రలు దొరకాలే కానీ తను ఏ స్థాయిలో చెలరేగిపోతుందో ఇందులో మరోసారి రుజువు చేసింది. స్వంతంగా డబ్బింగ్ చెప్పాలన్న ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కొన్ని కీలక సన్నివేశాల్లో సంభాషణల ఒత్తిడిని మేనేజ్ చేయడంలో తడబడింది. ఆ ఒక్కటి మినహాయిస్తే తెలుగులో చేసిన బెస్ట్ రోల్ ఇదేనని చెప్పొచ్చు. దేవి ప్రసాద్, ప్రవీణ్ లకు కూడా మంచి ఎమోషనల్ సీన్లు పడ్డాయి. హరీష్ ఉత్తమన్ కన్నింగ్ పోలీస్ గా నరేష్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్నాడు. ప్రియదర్శి, ప్రమోదిని, మణిచందన, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ తదితరులు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ పోయారు. నాందికి దన్నుగా నిలిచిన బలాల్లో క్యాస్టింగ్ కూడా ఒకటి.

డైరెక్టర్ అండ్ టీమ్

సాధారణ పబ్లిక్ కి అంతగా అవగాహన లేని సెక్షన్ 211ని తీసుకోవాలన్న దర్శకుడు విజయ్ కనకమేడల ఆలోచన నిజంగా ప్రశంసనీయం. మూస కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే తెలుగు సినిమా విభిన్నత వైపు వేగంగా కాకపోయినా కనీసం బలంగానైనా అడుగులు వేస్తుంది. లీడ్ రోల్ కి నరేష్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే ఇతను సగం విజయం సాధించాడు. అనవసరమైన డీవియేషన్లకు పోకుండా స్ట్రెయిట్ గా పాయింట్ మీదే నిలబడిన తీరు బాగుంది. ఫస్ట్ హాఫ్ ని హ్యాండిల్ చేసిన విధానం భవిష్యత్తులో ఇతను ఇలాంటి సినిమాలే తీయాలని కోరుకునేలా చేయడం అత్యాశ కాదు.

ఒకే టోన్ లో చాలా సీరియస్ గా మొదటి సగం మొత్తం చాలా బాగా తీసుకెళ్లిన విజయ్ సెకండ్ హాఫ్ లో సూర్యప్రకాష్ బయటికి వచ్చాక ఒకరకమైన రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్ళిపోయాడు. దృష్టి మొత్తం హీరో పాత్రకు సానుభూతి తేవడం పైనే పెట్టడంతో కొన్ని బేసిక్ లాజిక్స్ మిస్ అయ్యాయి. తనకు సంబంధం లేని వ్యక్తి అండర్ ట్రయిల్ గా జైల్లో ఉన్నందుకు అంతగా తపించిపోయినా ఆద్య అసలు తన తండ్రిని ఎందుకు హత్య చేశారు, ఎవరు చేశారు అనే దిశగా ఆలోచించాలని సూర్య ప్రకాష్ చెప్పే దాకా ఫ్లాష్ కాకపోవడం విచిత్రమే. అంత తెలివైన లాయర్ కు ఆ విషయం ఎవరో ఒకరు చెప్పేదాకా గుర్తు రాకపోవడం వింతే.

విజయ్ కనకమేడల ముప్పాతిక భాగం వరకు కంటెంట్ ని బలంగా ప్రెజెంట్ చేసినప్పటికీ ప్రీ క్లైమాక్స్ వచ్చేటప్పటికి సగటు సినిమా ఫార్ములా వైపే వెళ్లిపోవడం కొంత మేర దెబ్బ తీసింది. మాజీ హోమ్ మినిస్టర్ ని ఎలా పట్టించాలనే తీరుని డిఫరెంట్ గా చూపించే అవకాశం లేదని భావించాడు కాబోలు అక్కడ ఇంటలిజెన్స్ కి పెద్దగా స్కోప్ ఇవ్వకుండా ఈజీగా గెస్ చేయగలిగేలా కథనాన్ని నడిపించడం ఇంప్రెషన్ ని తగ్గించేసింది. ఇక్కడ రివీల్ చేయడం బాగోదు కాబట్టి ఆగాల్సి వస్తోంది కానీ కొన్ని సన్నివేశాల్లో ఇలా చేసి ఉండొచ్చు కదాని సామాన్యుడికి సైతం ప్రశ్నలు తలెత్తేలా విజయ్ తడబడ్డాడు.

ఒక్కటి మాత్రం నిజం. విజయ్ ఆలోచనలో ఆచరణలో నిజాయితీ ఉంది. ఏదో మూసలో వెళ్ళిపోయి ప్రేమకథనో కమర్షియల్ స్టోరీనో ఎంచుకోకుండా తమిళ మలయాళంలో మాత్రమే ఎక్కువగా వచ్చే ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామాను ఎంచుకోవడాన్ని మెచ్చుకునే తీరాలి. అయితే పాత్రల రూపకల్పన, సన్నివేశాల కూర్పు విషయంలో ఇంకా హోమ్ వర్క్ చేసి ఉంటే ఇదో మైండ్ బ్లోయింగ్ మూవీగా నిలిచేది. కేవలం అల్లరి నరేష్ నటనను ప్రాతిపదికన తీసుకుని దీన్ని గొప్ప కోర్ట్ రూమ్ డ్రామా కం క్రైమ్ థ్రిల్లర్ గా చెప్పుకుంటే ఆత్మవంచన చేసుకున్నట్టే. మొత్తానికి ఒక ప్రామిసింగ్ గా అనిపించే దర్శకుడు విజయ్ కనకమేడల రూపంలో దొరికాడు

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం ఎక్కువ సౌండ్ పొల్యూషన్ లేకుండా కథకు తగ్గట్టు సాగుతుంది. పాటలు రిపీట్ వేల్యూ ఉన్నవి కావు కానీ సందర్భానుసారం వచ్చి వెళ్లే సాడ్ సాంగ్స్ కావడంతో అట్టే గుర్తుండవు. సింపతీ ఫ్యాక్టర్ కోసం వాటిని పెట్టారు కానీ అవి లేకపోయినా వచ్చిన నష్టం ఏమి లేదు. సిద్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. మంచి వర్క్ ఇచ్చారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ లో అనుభవం కనిపించింది. అబ్బూరి రవి సంభాషణలు బాగున్నాయి. భావోద్వేగాలు ఉన్న సీన్స్ లో బాగా పేలాయి. వెంకట్ యాక్షన్, బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ రెండు తమ బాధ్యతను నెరవేర్చాయి. ఇలాంటి సబ్జెక్టుని ప్రోత్సహించిన నిర్మాతలను మెచ్చుకోవాలి

ప్లస్ గా అనిపించేవి

అల్లరి నరేష్ నటన
వరలక్ష్మి శరత్ కుమార్
ఫస్ట్ హాఫ్
ఎమోషన్ల కలబోత

మైనస్ గా తోచేవి

డ్రమాటిక్ సెకండ్ హాఫ్
పాటలు
రొటీన్ గా అనిపించే క్లైమాక్స్
కోర్ట్ డ్రామాలో ఫోర్స్ తగ్గడం

కంక్లూజన్

నాంది ఖచ్చితంగా రెగ్యులర్ మూవీ కాదు. మంచి సినిమా అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎక్కువ శాతం జనానికి తెలియని చట్టంలోని ఒక సెక్షన్ తీసుకుని ఈ కథను అల్లుకోవడం సాహసమే. అయితే ఎంత సీరియస్ ప్రయోగమైనా ఫార్ములాను వాడుకునే చెప్పారు కనక ఆ కోణంలో చూస్తే నాంది ఒక గొప్ప ప్రయత్నం అనే కాంప్లిమెంట్ నుంచి చక్కని చిత్రమనే పదం దగ్గర ఆగిపోయింది. గత కొన్నేళ్లలో కమర్షియల్ లెక్కలకు భిన్నంగా ఇలాంటి సినిమాలను తీస్తూ టాలీవుడ్ స్టాండర్డ్ ని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్న దర్శకులను నిర్మాతలను అభినందించాలి. ఆ ఒక్క అర్హత ఆధారంగా నాందిని చూడాల్సిన సినిమాగా చెప్పుకోవచ్చు

నాంది – పునాది బలమైందే కానీ

Show comments