సీఎస్‌ వినతిని పట్టించుకోని ఎస్‌ఈసీ.. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని ఉన్నతాధికారులు..

కరోనా వైరస్, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతో, ఉద్యోగుల ఆందోళనతో తనకు సంబంధం లేదన్నట్లుగా.. ఈ రోజు పంచాయతీ తొలి దశ ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీలు, కలెక్టర్లతో వీడియా కాన్ఫరెన్స్‌కు సిద్ధమయ్యారు. సుప్రింలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ సోమవారం విచారణకు వస్తున్న నేపథ్యంలో అప్పటి వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) అదిత్యానాథ్‌ చేసిన వినతిని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరస్కరించారు. ఇప్పటికే ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేశామని, నిర్వహణపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌ సరైన వేదికంటూ సీఎస్‌కు లేఖ రాశారు.

తానుపట్టిన కుందేలుకు మూడేకాళ్లన్నట్లుగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పంచాయతీ ఎన్నికలపై ముందుకు వెళుతున్నారు. సీఎస్‌ వినతిని పట్టించుకోని నిమ్మగడ్డ.. వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి సీఎస్‌ అదిత్యానాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పంచాయతీ రాజ్‌ శాఖ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్, ఇతర ఉన్నతాధికారులు, పలువురు జిల్లా అధికారులు గౌర్హాజరయ్యారు.

పంచాయతీ ఎన్నికలపై రెండున్నరేళ్లుగా లేని తొందర ఇప్పుడే ఎందుకని ప్రశ్నిస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తీరును తప్పుబడుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వ్యాక్సిన్‌ వేస్తున్న సమయంలో ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రెండున్నరేళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పంచాయతీలు మరో 45 రోజులపాటు ఉండడం వల్ల వచ్చే నష్టం ఏమిటి..? ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే కలిగే లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో పాలనా సమయం ముగుస్తుంది. ఆదివారం సెలవు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం ఉదయం పది గంటల వరకు నిమ్మగడ్డ హడావుడి సొంతంగా చేసుకోవడం తప్పా.. అధికారుల జోలికి వచ్చే అవకాశం లేదు. సోమవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం సుప్రింలో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే అవకాశం ఉంది. సుప్రిం తీర్పు తర్వాతనే.. పంచాయతీ ఎన్నికల భవితవ్యం తేలుతుంది.

Show comments