iDreamPost
iDreamPost
ఏపీలో ఇప్పటికే ఓ మంత్రికి కరోనా వ్యాపించిందంటూ సాగిన ప్రచారం దుమారం రేపుతోంది. స్వయగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించాల్సి వచ్చింది. దానికి కొనసాగింపుగా ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్ జోన్ పరిధిలో ఉందంటూ మరో ప్రచారం మొదలుపెట్టారు. తాడేపల్లిలో ఓ పాజిటివ్ కేసు రావడంతో ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్ జోన్ అంటూ కథనాలు ప్రసారం చేయడం విస్మయకరంగా మారింది.
తాడేపల్లి పరిధిలో ఓ పాజిటివ్ కేసు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. అయితే కేసు నమోదయిన ఇంటికి, సీఎం క్యాంప్ ఆఫీస్ సుమారుగా 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాంతో సీఎం నివాసాన్ని బఫర్ జోన్ గా అధికారులు ప్రకటించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థల్లో మాత్రం అధికారుల నుంచి నిర్ధారణ లేకుండా రెడ్ జోన్ లో సీఎం ఇల్లు అంటూ ప్రసారం చేయడం అలజడి రేపింది.
మీడియా కథనాలపై అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ స్పందించారు. తాడేపల్లి లోని సీఎం నివాసం రెడ్ జోన్ లో లేదని ఆయన ప్రకటించారు. ఏదయినా ఒక ప్రాంతంలో 4 పాజిటివ్ కేసులు ఉంటే దానిని రెడ్ జోన్ గా పరిగణిస్తామని ఆయన తెలిపారు. తాడేపల్లి లో ఒక పాజిటివ్ కేసు మాత్రమే నమోదయిందని వివరించారు. అయినప్పటికీ సీఎం నివాసం గురించి వార్తలు రావడం విచారకరం అన్నారు సీఎం క్యాంప్ ఆఫీస్ రెడ్ జోన్ లో లేదని స్పష్టం చేశారు.