Idream media
Idream media
వైసీపీ ప్రభుత్వం తమపార్టీ కార్యకర్తలు, నేతలపై బోగస్ కేసులు పెడుతోందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిల కుటుంబాన్ని పరామర్శించేందుకు అనంతపురం వెళ్లిన నారా లోకేష్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో కలసి స్థానికంగా మీడియాతో మాట్లాడారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై బోగస్ కేసులు పెట్టారని లోకేష్ మండిపడ్డారు. మొన్నం అచ్చెం నాయుడు, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేసినట్లే రేపు తనను కూడా అరెస్ట్ చేయొచ్చని లోకేష్ జోస్యం చెప్పారు. తమ పార్టీ నేతలపై బోగస్ కేసులు పెడుతున్నారన్నారు. అరెస్ట్ చేసి ఏమి చేస్తారని ప్రశ్నించిన లోకేష్ మహా అయితే కొన్ని రోజులు జైల్లో పెట్టడం తప్పా ఇంకేమి చేయగలరని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలు, నేతలపై చేస్తున్న దాడులు, పెడుతున్న కేసులు అన్నీ రాసుకుంటున్నామని, అధికారంలోకి వచ్చాక అంతకు అంత తిరిగి చెల్లిస్తామని లోకేష్ హెచ్చరించారు.
రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా లేదా..తమ పార్టీ నాయకుడు నిర్ణయిస్తారనిచెప్పారు. తమ పార్టీ నేతలపై కేసులు పెడుతున్న వైసీపీ ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని లోకేష్ చెప్పారు. కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. త్వరలో అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తామని చెప్పారు. ఆయా పార్టీల నాయకులను వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులపై చైతన్యవంతులను చేస్తామని తెలిపారు.