లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. 7 నుంచి 27 శాతానికి పెరిగిన నిరుద్యోగం

కరోనా వైరస్‌ సోకి దేశంలో ఒకపక్కవందలాది మంది చనిపోతుంటే.. మరోపక్క మహమ్మారి దెబ్బకు సగటు మధ్య తరగతి జీవులు ఉద్యోగాలు కోల్పోతూ బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా సృష్టించిన కల్లోలంలో అనేక రంగాల్లోని పనిచేసే వారు తమ ఉపాధిని కోల్పోయారు. కొందరు తాత్కాలికంగా కోల్పోతే.. మరికొందరు శాశ్వతంగా ఉద్యోగాలను కోల్పోతున్నారు. లాక్‌డౌన్‌ ప్రభావం అసంఘటిత రంగంపై భారీగా పడింది. మార్చి ఒకటో తేదీ సమయంలో దేశంలో నిరుద్యోగం 7.91 శాతం ఉండగా.. మే 3వ తేదీ నాటికి 27.11 శాతానికి నిరుద్యోగం చేరుకున్నట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. అంటే మూడు రెట్లకుపైగా నిరుద్యోగం పెరిగినట్లుయింది.

పట్టణాల్లోనే ఎక్కువ నిరుద్యోగం..

లాక్‌డౌన్‌ ప్రభావం ఉపాధిపై మార్చి నెలలో పెద్దగా కనిపించలేదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తన ప్రభావాన్ని భారీగా చూపింది. కరోనా కేసులు పెరిగిపోవడంతో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయడంతో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో పోల్చుకుంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగం అధికంగా పెరిగిపోతోంది. మార్చి ఒకటో తేదీన పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.63 శాతం ఉంటే మే 3 నాటికి నాటికి 29.22 శాతానికి చేరుకుంది. ఇక‌ గ్రామీణ ప్రాంతాల్లో 7.58 శాతం నుంచి 26.69 శాతానికి పెరిగింది. ఉద్యోగాలు పోతున్నాయనే భయంతో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా లాంటి నగరాల నుంచి భారీగా స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని, దాదాపు 86 శాతం మందిలో తమ ఉద్యోగాలపై అపనమ్మకం ఏర్పడిందని ఓ సర్వేలో తేలింది. లాక్‌డౌన్‌ పొడిగింపు వల్ల మరింత నిరుద్యోగిత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

12 కోట్ల మంది ఉపాధికి ఎసరు..

సుదీర్ఘ లాక్‌డౌన్‌తో దేశంలో దినసరి వేతన కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉపాధి అవకాశాలు పూర్తిగా కోల్పోయారు. సేవా రంగంలోనూ పనులు లేకుండా పోయాయి. కార్మిక భాగస్వామ్యం రేటు 41.96 శాతం నుంచి 35.01 శాతానికి పడిపోయినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ పేర్కొంది. మార్చి 1న 39.84 కోట్ల మందికి ఉపాధి ఉంటే ఏప్రిల్‌ 19 నాటికి 27.07 కోట్ల మందికి మాత్రమే ఉపాధి ఉన్నట్లుగా పేర్కొంది. అంటే దాదాపు 12 కోట్ల మంది ఉపాధి పోయినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో ప్రభుత్వ రంగంలో మినహా.. మిగతా అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం మరింతగా ఉన్నట్లు ఈ పరిస్థితులను బట్టి అర్థం అవుతోంది.

క్షీణిస్తున్న వ్యక్తుల ఆదాయం:

లాక్‌డౌన్‌ వల్ల స్వయం ఉపాధి పొందుతున్న వారు (చిరు వ్యాపారులు, రోజు కూలీలు) కూడా భారీగా ఆదాయం కోల్పోతున్నట్లు లింక్డ్‌ ఇన్‌ సర్వేలో తేలింది. దాదాపు 62 శాతం మందికి ఆదాయం క్షీణించిందని పేర్కొంది.

వలస కూలీలకు భరోసా ఏదీ?

ఇప్పటికే వలస కూలీల వేదన హృదయ విదాకరంగా మారింది. సొంత ప్రాంతాలను వదిలి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు తమ ఆదాయాన్ని పూర్తిగా కోల్పోయి రోడ్డున పడ్డారు. ప్రస్తుతానికి వారిని స్వస్థలాలకు చేర్చే ప్రక్రియను కేంద్రం మొదలు పెట్టింది. అయితే వారు వచ్చిన తర్వాత వారికి రోజు గడవడం ఏంటనే ప్రశ్న తలెత్తకమానదు. కేంద్రప్రభుత్వంగానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ఇప్పటివరకు వారికి భరోసా ఇవ్వలేదు.

Show comments