చిలకమ్మ పలకవే పలుకు – రేపటి పలుకులు

  • Published - 02:06 PM, Sat - 1 February 20
చిలకమ్మ పలకవే పలుకు – రేపటి పలుకులు

మనమందరం చిన్నప్పుడు ఆవు వ్యాసం చదివాము కదా – చదువుకునే పిల్లాడు ఒకడు ప్రపంచంలో దేని గురించి వ్యాసం రాయమన్నా ఆ అంశం గురించి రాస్తూ ముప్పతిప్పలు పడి ఎలాగోలా అందులో ఆవు ప్రస్థావన తీసుకొచ్చి అక్కడి నుంచి ఆవు గురించి రాస్తూంటాడు. అలా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా ఎక్కడ ఏం జరిగినా ఆ విషయాల్లో అటు చేసి ఇటు చేసి చంద్రబాబును ఏదో ఒక రకంగా పొగడటానికో, వైఎస్ జగన్ మీద విష ప్రచారం చేయడానికో మారుస్తారు. మరీ ముఖ్యంగా ప్రతీ ఆదివారం వచ్చే ‘పలుకు’లైతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే అధికారపక్షాన్ని ఆకాశానికెత్తేయడానికి, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేయడానికి చేసే విశ్వప్రయత్నాలు అంతా ఇంతా కావు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అయితే బాబు అనుకూల మీడియాలోని విశ్లేషణలు – గత ఎన్నికల్లో ప్రజల నిర్ణయాన్ని తప్పుబట్టడం, జగన్ బెయిల్ రద్దు అవ్వాలని కోరుకోవడం; జగన్ మీద కుల ముద్ర, మత ముద్ర వేయడం; “చంద్రబాబును ఓడించకపోయుంటే..” అనే విషయాల చుట్టూనే ఉంటాయి… ఆ విశ్లేషణలు ఏ విషయాల దగ్గర ప్రారంభమైనా సరే ఎక్కువ సేపు ఆట్టే తిరగకుండా ఈ విషయాల దగ్గరికే వచ్చేస్తాయి.

అలా – ఈ వారం పలుకులు ఇలా ఉండచ్చు అనే ఊహతో …

అనుకున్నదే అయింది – గత వారం నేను చెప్పినట్లు శాసనమండలి రద్దుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొగ్గు చూపింది. కేవలం తన మాట నెగ్గించుకోవాలనే పంతానికి పోయి ఏకంగా శాసనమండలినే రద్దు చేసేందుకు సిద్ధమయ్యాడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అక్రమకట్టడమనే నెపంతో కరకట్ట మీద ఉన్న ‘ప్రజావేదిక’ను కూల్చేసి పాలన ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జనం దృష్టిలో ‘రద్దుల ప్రభుత్వం’గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. మూడు రాజధానుల బిల్లును ప్రజాశ్రేయస్సు కోసం తెలుగుదేశం పార్టీ శాసనమండలిలో అడ్డుకున్న విషయం తెలిసిందే.

ఇది ఒక రకంగా అధికార పార్టీకి తలవంపులు తెచ్చే విషయం కావడంతో, ఓర్వలేకపోయిన జగన్ శాసనమండలిని ఏకంగా రద్దు చేసేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత నియంతృత్వధోరణితో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము ఎలాంటి నాయకుణ్ణి ఎన్నుకున్నారో ఇప్పటికైనా అర్ధం చేసుకోవాలి. ఈ వ్యవహారమంతా చూస్తుంటే హైదరాబాద్ వంటి మహానగరాన్ని నిర్మించిన చంద్రబాబు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అలాంటి మహానగరం ఉండాలనే అత్యాశకు పోవడమే ఆయన తప్పు లాగా కనిపిస్తోంది. భాగ్యనగరానికి ధీటుగా రాష్ట్ర ప్రజలందరి కోసం మరో నగరాన్ని నిర్మించగలిగేది చంద్రబాబు మాత్రమే అని నమ్మి కొన్ని వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులకు ఇంత అన్యాయం జరుగుతుంటే అమరావతి ప్రాంత రైతులతరహాలో మిగతా ప్రాంతాల రైతులు ఉద్యమించకపోవడాన్ని భావితరాలు హర్షిస్తాయా ?

ప్రతి సంవత్సరం జరిగే గణతంత్రదినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రజలనుద్దేశించి గవర్నర్ ఉపన్యాసం ఇవ్వడం ఆనవాయితి. సాధారణంగా ప్రభుత్వానికి అనుకూలంగానే ఆ ఉపన్యాసం ఉంటుందన్నది నిస్సందేహం. ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చే అధికారం కూడా గవర్నర్ కు ఉన్నప్పటికీ మూడు రాజధానుల వల్లనే అభివృద్ధి వికేంద్రీకరణ సాద్యమనే విధంగా మాట్లాడటంతో ఆంతర్జాతీయ సమాజం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసిందని పలువురి అభిప్రాయం. క్రైస్తవ మత ప్రచారానికి, మత మార్పిళ్లకు వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర భాజపా నాయకులు కేంద్రానికి ఉప్పందించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిందని; ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం ద్వారా క్రైస్తవ మత వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హిందూ ధార్మిక సంస్థలు బలంగా నమ్ముతున్నాయని; అదే విషయం జనంలోకి వెళితే ప్రభుత్వానికి, తన వ్యక్తిగత ప్రతిష్టకు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని వైసీపీ సీనియర్ నేత ఒకరు సన్నిహితులతో అన్నట్టు తెలుస్తోంది. దేశ రాజధానిలో జరిగిన ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పంపిన శకటాన్ని చూస్తే ఆ విషయం నిజమేననిపిస్తోంది.

సాధారణంగా గణతంత్రదినోత్సవ వేడుకలకు ఢిల్లీకి వెళ్లే శకటాలు ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం – కేవలం హిందువులకు ఆలయమైన తిరుమల నమూనాను పంపడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే కేంద్రం దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలకు ఎంతో విలువ ఇస్తుందని నమ్మించడానికే అనిపించకమానదు.

ఇక తెలంగాణా పురపాలక ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే తెలంగాణా సమాజం మళ్ళీ టీఆరెస్ వైపే మొగ్గు చూపింది. ఈ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ పాలనకు రిఫరెండం కాకపోయినా ఎంపీ ఎన్నికల్లో కాస్త వెనుకబడ్డట్టు కనిపించిన టీఆరెస్ తిరిగి తమ వేగాన్ని అందుకుందనే చెప్పాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే మునిసిపల్ ఎన్నికలు మాత్రం జగన్ పాలకు రిఫరెండం అనే చెప్పచ్చు, ఎందుకంటే రాజధాని అనే విషయంలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు, మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం కొత్త పాట అందుకోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొని ఉంది. తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వారికున్న ఏకైక మార్గం – మునిసిపల్ ఎన్నికల్లో ఓటు ద్వారా సమాధానం చెప్పడమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు జగన్ తీరుతో విసిగిపోయి, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరారు. “వారి చేత రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్లడానికి ధైర్యముందా ?” అని జగన్ ఎన్ని సార్లు సవాల్ విసిరినా చంద్రబాబు సంయమానంగా ఉండటానికి కారణం – జనంలోకి వెళితే ఎలా అయినా తెలుగుదేశం గెలుస్తుందని చంద్రబాబుకు తెలుసు కనుక. పేదరాష్ట్రంలో ప్రజాధనాన్ని అనవసరంగా ఎన్నికల పేర వృధా చేయకూడదని భావించి చంద్రబాబు వ్యూహాత్మకమౌనం పాటించారు. ప్రస్తుత పరిస్థితి అది కాదు – రాజధాని మార్పు అంటే తమ జీవితాలు తలకిందులయిపోయి, అగమ్యగోచరమైపోతాయని ప్రజలకు అర్ధమయ్యింది. ఆ విషయం చంద్రబాబుకూ అర్ధమయ్యింది – అందుకే మూడు రాజధానులే రిఫరెండంగా అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు వెళదామని, ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక ఓడిపోతే – తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రజలనాడి బాగా తెలిసిన చంద్రబాబే ఛాలెంజ్ చేశారంటే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను అర్ధం చేసుకోవచ్చు.

జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేయడం – ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాలను దగ్గర నుంచి గమనించిన వ్యక్తి – పార్టీ అధ్యక్షుడు సినిమాల్లోకి తిరిగి వెళ్లడాన్ని కారణంగా చూపుతూ పార్టీ నుంచి రాజీనామా చేయడాన్ని బట్టి చూస్తే దీని వెనుక కూడా కేంద్రం చాలా పెద్ద ప్రణాళికనే రచించినట్టుందని ఒక సీనియర్ రాజకీయ నాయకుడి అభిప్రాయం. జగన్ మీద ఉన్న కేసుల గురించి అందరికంటే ఎక్కువ అవగాహన ఉన్నది లక్ష్మి నారాయణకే – ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుంటే ఆ కేసుల మీద మరింత సమాచారాన్ని సేకరించి, జగన్ రెడ్డిని అన్ని వైపుల నుంచి దిగ్బంధించవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ‘భాజపా-జనసేన’ పొత్తు సమయంలోనే పవన్ కల్యాణ్ తో ముందస్తు ఒప్పందం కుదిరిందని జనసేనకు చెందిన కీలక నేత ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా విన్న కొందరు, తమ వివరాలు గోప్యంగా ఉంచమని వేడుకుని ఒక యూట్యూబ్ ఛానెల్ వారితో చెప్పారు. ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి తన సన్నిహితులకు చెప్పిన సమాచారం ప్రకారం … అన్నీ సక్రమంగా జరిగితే – భాజపాలోని కేంద్ర పెద్దలు – జగన్ రెడ్డిని ఎలా అయినా అరెస్టు చేయించి, రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చిత వాతావరణాన్ని సృష్టించి ; రాష్ట్రంలో కాపు సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉన్నందున పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల్లోకి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది. అదే గనక జరిగితే అటు వైసీపీని, తెదేపాను ఒకే సారి దెబ్బకొట్టినట్టు అవుతుంది.

తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తమకు నచ్చని వారు పాలకులుగా ఉన్నప్పుడు చేసే ప్రచారం, ప్రజల ఆలోచనావిధాన్ని మార్చడానికి తెర మీదకు తీసుకొచ్చే అర్ధం లేని వాదనలు, విషయాలు ఎలా ఉంటాయో చెప్పడానికే ఈ ప్రయత్నం. ఇందులో చెప్పిన ప్రణాళికలు సాధ్యాసాధ్యాల కాదా అనే సంగతి పక్కనపెడితే అసహనంతో ఉన్న తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పెద్దల మనస్సులో ఉన్న బలమైన కోరికలు ఆ ప్రణాళికలు. ఇవన్నీ కేవలం సరదా కోసం ఒక రోజు ముందుగా ఊహించి రాసేదే అయినా ఒక్కోసారి అవే అంశాల ప్రస్తావన మరుసటి రోజు పత్రికల్లో తారసపడటం పూర్తిగా యాదృచ్ఛికం.

Show comments