Idream media
Idream media
వ్యవసాయం రంగంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పిలుపుమేరకు జరిగిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులకు మద్ధతుగా దేశం మొత్తం ఏకమైంది. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు బంద్‌కు సంపూర్ణ మద్ధతును ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బంద్ చేసేందుకు రైతులు పిలుపునివ్వగా.. అంతకు మించిన స్పందన ప్రజల నుంచి వచ్చింది. ఉదయం నుంచే ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. ప్రజా రవాణా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ బస్సులు రొడ్డెక్కలేదు.
రైతులకు దేశం యావత్తు అండగా నిలవడం భారత్ బంద్‌లో సరికొత్త అధ్యాయం నమోదైంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పరిస్థితి చేయిదాటక ముందే పరిష్కారం వైపు అడుగులేస్తోంది. రైతులతో తక్షణమే సమావేశం అయ్యేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సిద్ధమయ్యారు. సాయంత్రం ఏడు గంటలకు రైతులు, రైతు ప్రతినిధులతో అమిత్ సమావేశం కానున్నారు. కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతుండగా.. చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులతో అమిత్ షా జరుపుతున్న చర్చలు ఎలా సాగుతాయన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది.
ఇప్పటికే కేంద్ర మంత్రులు, రైతుల మధ్య ఐదు సార్లు చర్చలు జరిగాయి. గత నెల 26వ తేదీ నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నారు. పంజాబ్, హర్యానా నుంచి మొదలైన రైతు ఉద్యమం ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లకు పాకింది. ఐదు సార్లు చర్చలు విఫలం కావడంతో ఈ రోజు రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌తో వ్యవసాయ కొత్త చట్టాలను రద్దు చేయాలనే ఉద్యమం దేశం మొత్తం వ్యాపించింది. అసలు చట్టాల్లో ఏమంది..? రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? అనే అంశంలపై దేశ ప్రజల్లో అవగాహన పెరిగింది. రేపు బుధవారం ఆరోసారి కేంద్ర మంత్రులు, రైతుల మధ్య చర్చలు సాగబోతున్నాయి. ఈ చర్చలు కూడా విఫలమైతే.. ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.