అనధికార ‘బంధం’పై నాగబాబు ఏమంటారు..?

2024 ఎన్నికల్లో టీడీపీ మాత్రం అధికారంలోకి రాదు.. అని కుండబద్దలు కొట్టిన మెగా బ్రదర్స్‌ నాగబాబు సరికొత్త చర్చలకు తెరతీసారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేనలు ఎలక్షన్స్‌కు వెళ్ళాయి. కానీ 2019లో జనసేన బీజేపీతో జతకట్టడం.. ఆ తరువాత వచ్చిన ఫలితాలు తెలిసిందే. అయితే ప్రస్తుతం వాయిదా పడ్డ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌సీపీ ఎదుర్కోనేందుకు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేనలు అనధికారికంగా కలిసి పనిచేస్తున్న విషయం బహిరంగ రహస్యమే.

పార్టీల బలాబలాలను అనుసరించి ఇరు పార్టీలు చీకటి ఒప్పందంతో పోటీలో తమతమ అభ్యర్ధులను నిలిపాయి. కరుడుగట్టిన పార్టీ అభిమానులున్న కొన్ని చోట్ల మాత్రం ఇరు పార్టీలు హోరాహోరాగానే అభ్యర్ధులను బరిలోకి నిలిపాయి. అయితే అత్యధికశాతం స్థానాల్లో మాత్రం ఇరుపార్టీలు ‘అండర్‌స్టాండింగ్‌’తోనే వైసీపీనీ ఎదుర్కొనేందుకు సిద్ధమైన విషయం బహిరంగ రహస్యం. వాయిదా పడకముందు జరిగిన ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ, జనసేన జెండాలతో పలువురు ప్రచారాలు కూడా నిర్వహించారు.

అయితే ఈ విషయంపై ఇరు పార్టీల్లోని ప్రముఖ నాయకులెవరూ కనీసం నోరు కూడా మెదపలేదు. జిల్లా స్థాయి నుంచి, రాష్ట్రస్థాయి వరకు కొమ్ములు తిరిగిన వారంతా కళ్ళు మూసుకోవడంతో చీకటి ఒప్పందం మేరకు నామినేషన్ల పర్వం ముగించేసారు. అయితే తీరా ఇప్పుడు నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యల నేపథ్యంలోనైనా జనానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకులకు ఉందన్నది పలువురి విశ్లేషకుల అభిప్రాయం. అబ్బే మేం అలాగే చేస్తుంటాం.. అంటారా ఈ అసహజమైత్రికి ప్రజలే సరైన సమాధానం తప్పక చెబుతారన్నది సర్వత్రా వ్యక్తమవుతున్న నిశ్చితాభిప్రాయం.

Show comments