Idream media
Idream media
దేశంలో ప్రతి ఆరు రోజులకు కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి 24 మందిలో ఒకరికి పాజిటివ్ వస్తోందని చెప్పారు. నిర్ధారణ పరీక్షలు వీలైనంత ఎక్కువగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న ఒక రోజే 28వేల మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రాలకు ఇప్పటికే ఐదు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మే నాటికి మరో పది లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు.
దేశంలో కరోనా వైరస్ సోకిన వారిలో 80 శాతం మంది వేగంగా కోలుకుంటున్నారని అగర్వాల్ తెలిపారు. గడచిన 24 గంటల్లో 1000 కేసులకు పైగా నమోదయ్యాయని వెల్లడించారు. దీంతో దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 13802 కు చేరింది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటి 453 మంది ప్రాణాలు కోల్పోయారు. 1749 మంది కోలుకున్నారు. మొత్తం మీద కరోనా వైరస్ సోకిన వారిలో 13 శాతం మంది కోలుకున్నారు.
కరోనా నియంత్రణకు సాంప్రదాయ ఔషధాలు వాడేలా ప్రోత్సహిస్తున్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. దేశవ్యాప్తంగా కొత్తగా ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దేశీయంగా కరోనా వ్యాక్సిన్ తయారు చేసేందుకు నాలుగు సంస్థలు నిరంతరం పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందుకోసం విదేశీ సంస్థల సహాయం కూడా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21.92 లక్షలకు చేరింది. ఈ మహమ్మారి వల్ల 1.47 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 5.54 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు.