శార‌దాపీఠంలో ఏం జ‌రిగింది.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న వ్య‌వ‌హారం

శార‌దాపీఠంలో ఏం జ‌రిగింది.. టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్న వ్య‌వ‌హారం

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తో విశాఖ శార‌దాపీఠాధిప‌తికి ఉన్న అనుబంధం అంద‌రికీ తెలిసిందే. గ‌త కొన్నేళ్ళుగా ఇరువురు మ‌ధ్య మంచి సంబంధం సాగుతోంది. విప‌క్షంలో ఉన్న కాలంలో కూడా జగ‌న్ తో ప‌లు యాగాలు చేయించిన పీఠాధిప‌తిగా స్వ‌రూపానంద‌కి పేరుంది. జ‌గ‌న్ పై క్రైస్త‌వ ముద్ర ఉన్న కాలంలో కూడా ఆయ‌న ముందుకొచ్చారు. చంద్ర‌బాబు విధానాల‌ను బాహాటంగానే త‌ప్పుబ‌డుతూ జ‌గ‌న్ కి మ‌ద్ధ‌తు ప‌లికారు. అనుకున్న‌ట్టుగానే ప్ర‌జాభిప్రాయం కూడా జ‌గ‌న్ కి ప‌ట్ట‌కట్ట‌డంతో ముఖ్య‌మంత్రికి స‌న్నిహితుడైన పీఠాధిప‌తిగా స్వ‌రూపానందకు గుర్తింపు ద‌క్కింది.

తాజాగా విశాఖ స‌మీపంలోని పెందుర్తిలో ఉన్న శార‌దాపీఠానికి సీఎం జ‌గ‌న్ వెళ్లారు. స్వ‌రూపానంద ఆహ్వానంతో అక్క‌డికి వెళ్లిన జ‌గ‌న్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. పార్టీకి చెందిన కీల‌క నేత‌లను వెంట‌బెట్టుకుని అక్క‌డికి వెళ్లిన ముఖ్య‌మంత్రి పీఠాధిప‌తితో క‌లిసి ప్ర‌త్యేకంగా మంత‌నాలు జ‌రిపారు. స‌రిగ్గా అదే రోజు అక్క‌డికి బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కూడా వ‌చ్చారు. జ‌గ‌న్ అక్క‌డ ఉన్న స‌మ‌యంలోనే సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి పీఠానికి చేరుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన చ‌ర్చ‌ల్లో సీఎం, పీఠాధిప‌తితో పాటుగా సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి కూడా పాల్గొన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దాంతో ఏం చ‌ర్చించార‌నే విష‌యంపై ఆస‌క్తి రేగుతోంది.

ఈ ప‌రిణామాలు టీడీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. బీజేపీ, వైసీపీ మ‌ధ్య విబేధాలు పెర‌గాల‌ని టీడీపీ ఆశిస్తోంది. అది జ‌రిగితే జ‌గ‌న్ కి వ్య‌క్తిగ‌త అంశాల్లో చిక్కులు త‌ప్ప‌వ‌ని భావిస్తోంది. ముఖ్యంగా సీబీఐ, ఈడీ కేసుల్లో జ‌గ‌న్ కి స‌మ‌స్య‌లు సృష్టించేలా కేంద్రం అడుగులు వేస్తుంద‌నే ప్ర‌చారం టీడీపీ శ్రేణుల్లో విస్తృతంగా సాగిస్తున్నారు. త‌ద్వారా జ‌గ‌న్ కి బ్రేకులు ఖాయ‌మ‌ని కార్య‌క‌ర్త‌ల‌కు టీడీపీ నేత‌లు భ‌రోసా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ప‌రిస్థితి అందుకు భిన్నంగా సాగుతుండ‌డంతో వారిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. బీజేపీ కీల‌క‌నేత‌లు నేరుగా జ‌గ‌న్ తో చ‌ర్చ‌లు జ‌రిపి ఉంటార‌ని భావిస్తున్న త‌రుణంలో త‌మ ఆశ‌ల‌కు గండికొట్టే ప‌రిణామంగా అంచ‌నా వేస్తోంది. ముఖ్యంగా సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి వంటి వారు జ‌గ‌న్ కి ఇప్ప‌టికే సానుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. టీటీడీ విష‌యంలో ఆయ‌న తీరు అందుకు సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు నేరుగా సీఎంతో భేటీ అయ్యార‌నే ప్ర‌చారం వారి మ‌ధ్య బంధాన్ని బ‌ల‌ప‌రుస్తుందేమోన‌నే అనుమానం టీడీపీ నేత‌ల్లో మొద‌లయ్యింది.

ఈవిష‌యంపై ఇప్ప‌టికే మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. సీఎం నాలుగు గంట‌ల పాటు శార‌దాపీఠంలో ఉన్నార‌ని, బీజేపీ నేత‌లు కూడా అదే స‌మ‌యంలో అక్క‌డ ఉన్నార‌ని ప్ర‌క‌టించారు. వారి మ‌ధ్య ఏం జ‌రిగింద‌న్న‌ది అంద‌రికీ తెలియాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. త‌ద్వారా త‌మ పార్టీకి ఈ ప‌రిణామం మింగుడుప‌డ‌డం లేద‌నే విష‌యాన్ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదే స‌మ‌యంలో వాస్త‌వానికి పీఠంలో అస‌లేం జ‌రిగి ఉంటుంద‌నే విష‌యం కూడా కొంత చ‌ర్చ‌నీయాంశంగా తయారవుతోంది.

Show comments