సినిమాలు చూసి నిధివేట‌ – Nostalgia

సినిమాలు చూస్తే చెడిపోతావ్‌, స్కూల్లో ట్యూష‌న్‌లో ప్ర‌తి అయ్య‌వారు ఇదే పాట పాడేవాడు. కానీ సినిమాలు చూసి కోటీశ్వ‌రులు కావ‌చ్చ‌నే విష‌యాన్ని ప‌దేళ్ల వ‌య‌స్సులో క‌నిపెట్టాను. మాలాంటి వాళ్ల క‌ల‌లు నెర‌వేర్చ‌డానికి కృష్ణ మోస‌గాళ్ల‌కు మోస‌గాడు సినిమా తీశాడు. ఒక నిధి కోసం వెతికి , దాన్ని సాధిస్తాడు.

స్కూల్లో చెత్త పాఠాలు విని, ట్యూష‌న్లు భ‌రించి , ఇంటికొచ్చిన ప్ర‌తి వాడు చ‌దువు గురించి నీతి వాక్యాలు , సుభాషితాలు చెబుతుంటే విని, చ‌చ్చీ చెడి ఉద్యోగం సంపాదించి , జీతాన్ని ఫ‌స్ట్ తారీఖు సాయంత్రం ఖ‌ర్చు పెట్టి మిగిలిన 29 రోజులు వ‌ర్షం కోసం క‌ప్ప‌లా ఎదురు చూసి- అర్రె ఈ గ‌లీజ్ మ‌న‌కు అవ‌స‌ర‌మా? హాయిగా నిధిని సాధించి లైఫ్ ఎంజాయ్ చేయ‌కుండా! కానీ నిధి ఎక్క‌డుంటుంది?

కృష్ణ కైతే , ఎవ‌డో పోతూ పోతూ చెవిలో చెప్పాడు, లేక‌పోతే సోష‌ల్‌లో ఫెయిలైన వాడు ఏదో మ్యాప్ గీసి, ఎక్క‌డో దాస్తాడు కానీ, దీన్ని మ‌నం సాధించ‌డం ఎట్లా?

మ‌న ద‌గ్గ‌ర ఎంత ప‌నికి మాలిన ఐడియా ఉన్నా, దాన్ని షేర్ చేసుకునే ప‌నికిమాలినోడు , మ‌న వేవ్ లెంగ్త్‌కి సూట్ అయ్యేవాడు ఎక్క‌డో ఒక‌చోట దొరుకుతాడు. నాకూ శేఖ‌ర్ అనేవాడు దొరికాడు. వాడి ప్ర‌త్యేక‌త ఏమంటే స్కూల్‌కి వెళ్లే టైంకి స‌రిగ్గా జ్వ‌రం తెచ్చుకోగ‌ల‌డు. ట్యూష‌న్‌లో క‌ళ్లు తిరిగి ప‌డిపోగ‌ల‌డు. ఫిట్స్ కూడా ప్ర‌య‌త్నించాడు కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

క‌ష్టాలు తీరాలంటే నిధి సాధించ‌డం త‌ప్ప వేరే దారిలేద‌ని తీర్మానించుకున్నాం. దీనికి బేసిక్‌గా రెండు కావాలి. నిధి ర‌హ‌స్యం, గుర్రాలు , ఇద్ద‌రం చిన్న‌వాళ్ల‌మే కాబ‌ట్టి ఒక గుర్రంతో అడ్జెస్ట్ కావ‌చ్చు. సినిమాల్లో అయితే కృష్ణ‌కి సొంత గుర్రం ఉంటుంది. మ‌నికి ఇంట్లో చెక్క గుర్రం కొనిపెట్టేవారు లేరు. ఇక రియ‌ల్ గుర్రాన్ని అడిగితే కుక్క‌ని కొట్టిన‌ట్టు కొడ‌తారు.

ఒక జ‌ట్కా సాయిబు గుర్రాన్ని దొంగ‌లించాల‌ని చూశాం. కానీ దాని క‌ళ్లెం విప్పాల‌న్నా, ఒక‌వేళ విప్పినా దాన్ని ఎక్కాల‌న్నా మ‌న హైట్‌కి స్టూలో , నిచ్చెనో కావాలి. స్టూల్ తీసుకుని దొంగ‌త‌నానికి పోవ‌డం ప్రాక్టిక‌ల్‌గా సాధ్యం కాదు. తాత్కాలికంగా నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకున్నాం. అయినా నిధి ర‌హ‌స్యం తెలిసిన త‌ర్వాత క‌దా గుర్రాల‌తో ప‌ని.

అప్ప‌టికి కావాలంటే ఒక ముఠాని ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ముఠా నాయ‌కుడిగా నేనే ఉంటాన‌ని స్ప‌ష్టంగా చెబితే , తాను రెండో నాయ‌కుడ‌ని శేఖ‌ర్ చెప్పాడు. ఫ‌స్ట్‌, సెకండ్ నేనే ఉండ‌లేను కాబ‌ట్టి, ఆ హోదా ఇవ్వ‌క త‌ప్ప‌లేదు.

నిధి ఎక్క‌డుంటుంది? ఇద్ద‌రికీ ఒక‌టే ఆలోచ‌న‌. మిగిలిన పిల్ల‌లు ప‌ప్పుండ‌లు, చ‌క్కిలాలు తింటూ హోట‌ల్ నారాయ‌ణ‌రావు కూతురు మాల‌తి పొట్టి జ‌డ‌తో వ‌చ్చిందా, పొడ‌గు జ‌డ‌తో వ‌చ్చిందా అని మాట్లాడుతూ ఉంటే మేమిద్ద‌రం న‌వ్వుకునే వాళ్లం. ఎందుకంటే ఒక‌సారి నిధి దొరికితే మా డెన్‌లో జ్యోతిల‌క్ష్మితో డ్యాన్స్ చేయించే స్థాయి మాది. మాల‌తి, చీమిడి ముక్కు మంజుల ఇదంతా Bad And Low Taste.

ఈ అన్వేష‌ణ‌లో ఉండ‌గా ఒక‌రోజు మా ట్యూష‌న్ అయ్య‌వారు ఇంట్లో పురాత‌న కాలం నాటి ఒక పుస్త‌కం కంట‌ప‌డింది. అందులోని అక్ష‌రాలు తెలుగులాగే ఉన్నాయి కానీ, తెలుగు కాదు. గ్యారెంటీగా అది నిధి ర‌హ‌స్య‌మేన‌ని భావించి కొట్టేశా. ఆ ర‌హస్యాన్ని డీ కోడ్ చేయ‌డంలో బిజీ అయిపోయాం.

మ‌రుస‌టి రోజు అయ్య‌వారికి పుస్త‌కం పోయింద‌ని తెలిసి చింత‌బ‌రిక‌ల‌తో ఐదారుగురిని పిచ్చ కొట్టుడు కొట్టాడు. మా ఫేస్‌లు అమాయ‌కంగా ఉండ‌టం, అప్ప‌టికి బ‌రిక‌లు విరిగిపోవ‌డం, దెబ్బ‌లు తిన్న వాళ్ల ఆర్త‌నాధాలు భారీ స్థాయిలో ఉండ‌టంతో కొట్టుడు మా వ‌ర‌కు రాలేదు.

ఆ పుస్త‌కం అయ్య‌వారు తాత‌గారు రాసిన సంస్కృత కావ్య‌మ‌ట‌, టీ మ‌ర‌క‌లు ప‌డ‌డంతో ఆ ర‌కంగా నిధి ర‌హ‌స్యంలా త‌యారైంద‌ని తెలిసింది. అప్ప‌టికే రాయ‌దుర్గం కొండ‌లో, ఆంజ‌నేయ‌స్వామి విగ్ర‌హం కింద నిధి ఉన్న‌ట్టు , దానికి 7 త‌ల‌ల స‌ర్పం కాప‌లా ఉన్న‌ట్టు మా డీకోడింగ్‌లో తేలింది. శ్ర‌మంతా అయ్య‌వారు వ‌ల్ల వృథా అయిపోయింది.

త‌ర్వాత ఒక గుడి ముందు కొండ‌రాయిపైన ఏవో అక్ష‌రాలు క‌నిపిస్తే, ఆ గుండ్రాయి భాష‌ని అనువాదం చేసుకున్నాం. దుగ్గిల‌మ్మ గుడి వెనుక , స‌మాధుల్లో ఒక‌చోట ఆదివారం , అర్ధ‌రాత్రి త‌వ్వితే నిధి లభిస్తుంద‌ని డీకోడింగ్‌లో తేలింది.

ప‌గ‌టిపూట వెళ్లి ట్రైల్స్ చూస్తామ‌ని స‌మాధుల ద‌గ్గ‌రికి వెళ్లాం. అక్క‌డ నాలుగైదు పుర్రెలు క‌నిపిస్తే స్పాట్‌లో చ‌లి జ్వ‌రం వ‌చ్చింది. వ‌ణుకుతూ ఇంటికెళితే అది దొంగ జ్వ‌ర‌మ‌ని తీర్మానించి , స్కూల్‌కి వెళ్లే వ‌ర‌కు త‌న్నారు.

అయిపోయింది, నిధి లేదు, జ్యోతిల‌క్ష్మి డ్యాన్స్ లేదు. త‌ల‌కి టోపి పెట్టుకుని తుపాకీతో కాల్చే సీన్ లేదు. హిస్ట‌రీ, జాగ్ర‌ఫీ, కాలం దూరం లెక్క‌లు, పెద్దైతే ఆల్‌జీబ్రా , ట్రిగ‌నామెట్రీ బ‌తుకు నాశ‌నం. పెరిగి, పెద్దై ప‌నికిమాలిన ఉద్యోగాల్లో చేరి పెళ్లి చేసుకుని , పిల్ల‌ల్ని నారాయ‌ణ‌, చైత‌న్య‌ల్లో చేర్చి , బేరాలు ఆడి కూర‌గాయలు కొనుక్కుని, పెళ్లాం ఊరు వెళితే క్వార్ట‌ర్ మందు తాగి థూ దీనెమ్మ జీవితం!

మేము గుర్తించ‌లేదు కానీ, చిన్న‌ప్పుడు నిజంగా మాకు నిధి దొరికింది. దాని పేరు బాల్యం!

Show comments