రాయలసీమలో బలపడాలన్న ఆశవుంటే సరిపోతుందా?

రాయలసీమలో పార్టీని బలోపేతం చేయడం ఎలా? అనే అంశంపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇందుకోసం కర్నూలులో సమావేశం కూడా నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి సహా రాష్ట్ర కీలక నేతలు, బీజేపీ జాతీయ నేత శివ ప్రకాష్, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల నేతలు పాల్గొన్నారు. సీమ జిల్లాల్లో బీజేపీని ఎలా పైకి తీసుకురావాలనే అంశంతోపాటు పలు కీలక విషయాలపై చర్చించారు. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపైనా నేతల మధ్య చర్చ జరిగింది. గణేశ్ ఉత్సవాలపై రాయలసీమలో ఆందోళనలు కూడా చేశారు బీజేపీ నేతలు.

అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. ఒక స్టాండ్ అనేది తీసుకోకుండా.. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి తగ్గట్లు మాట్లాడే బీజేపీ నేతలు రాయలసీమలో ఎలా బలపడుతారు. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లుగా ఉంటుంది వాళ్ల వ్యవహారం. ఆ పార్టీలో మూడు రాజధానులను ఒకరు వ్యతిరేకిస్తే.. ఇంకొకరు సపోర్టు చేస్తారు. ఒకవైపు జిల్లాకో రాజధాని పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెబుతారు.. మరోవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చెబుతారు.

గతంలో 2018 ఫిబ్రవరిలో రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ అంటూ బీజేపీ ఓ తీర్మానం చేసింది. రాష్ట్ర రెండో రాజధాని, హైకోర్టుల‌ను రాయ‌ల‌సీమ‌లో ఏర్పాటు చేయాలని అందులో డిమాండ్ చేసింది. ఆరు నెల‌ల‌కు ఒక‌సారి రాయ‌ల‌సీమ‌లో అసెంబ్లీ స‌మావేశాలు పెట్టాలని, 4 జిల్లాల‌ను కాస్తా 8 జిల్లాలు చేయాల‌ని, అధికార‌మంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడ‌ద‌ని పేర్కొంది.

కానీ ఇదే బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మి నారాయణ.. 2020 జులైలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించవద్దంటూ గవర్నర్‌కు లేఖ రాశారు. అప్పట్లో మరికొందరు నేతలు కూడా కన్నాకు మద్దతుగా మాట్లాడారు. మరోవైపు రాజధానుల ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నిత్యానంద రాయ్ సాక్ష్యాత్తూ పార్లమెంట్‌లోనే స్పష్టమైన ప్రకటన చేశారు. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని చెప్పారు.

Also Read : ఇక్కడ సరే.. మరి కర్ణాటకలో ఏంటి సోము సార్‌..?

ప్రత్యేక హోదా విషయంలోనూ బీజేపీది ద్వంద్వ వైఖరే. ఏపీ ప్రత్యేక హోదా ఇస్తే సమస్యలు వస్తాయని చెప్పి, ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని బీజేపీ గతంలో ప్రకటించింది. పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని మొన్న జరిగిన ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఒక రాష్ట్రానికి సాధ్యం కాని ప్రత్యేక హోదా.. ఇంకో ప్రాంతానికి ఎలా సాధ్యమవుతుంది. కేంద్రం తీరును సమర్థంచలేక వ్యతిరేకించలేక కక్కలేక మింగలేక అవస్థలు పడ్డారు రాష్ట్ర కమలం నేతలు.

ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలోనూ మొండిగా వెళ్తోంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఈ విషయంలో ఏపీ ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తామని ఖరాఖండిగా చెబుతోంది. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. అలా జరగనివ్వబోమని చెబుతారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అంటారు. కానీ హైకమాండ్ ను ఒప్పించలేరు. అన్నీ తాటాకు చప్పుళ్లు.

ఇక ఇప్పుడు సమస్యలేమీ లేవని వినాయక చవితి ఉత్సవాలను వివాదం చేయాలని చూస్తున్నారు. పండుగల సీజన్ నేపథ్యంలో కరోనా వ్యాప్తి జరగకుండా కేంద్రం రాష్ట్రాలకు ఈ మధ్యే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సీజన్లో జనం ఎక్కువగా గుమికూడే ప్రమాదం ఉందని, రాష్ట్రాలు తాము ఇచ్చిన గైడ్ లైన్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశాల్లో పేర్కొంది. దీంతో మిగతా రాష్ట్రాల తరహాలోనే ఏపీ కూడా కేంద్ర మార్గదర్శకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే గణేష్ మండపాలకు అనుమతులు నిరాకరిస్తోంది. కానీ ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్న ఏపీ బీజేపీ.. రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే అనుమతులు ఇవ్వడం లేదంటూ బిల్డప్ ఇస్తోంది. పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలనే అమలు చేస్తున్నారన్న విషయాన్ని కప్పిపెట్టి.. ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇలా ఉంది బీజేపీ డబుల్ గేమ్.

ముందు ఒక స్టాండ్ తీసుకుని, దాని మీద నిలబడితే ప్రజలు కూడా వెంట నడుస్తారు. దానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ఉదాహరణ. తాను తీసుకున్న స్టాండ్ మీద ఆయన నిలబడ్డారు.. అందుకే పద్మవ్యూహాలను ఛేదించి మరీ ఏపీ సీఎం అయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసినందుకు బీజేపీకి ఒకటీ అర సీట్లు వచ్చాయి. గత ఎన్నికల్లో అవీ లేవు. పార్టీ బలపడాలంటే ఉండాల్సింది డబుల్ స్టాండర్డ్స్ కాదు.. డబుల్ కమిట్ మెంట్. లేదు.. కాదు.. అని ఇలానే ఉంటే ఇంకో 30 ఏళ్లకు కూడా బీజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్లుగానే ఉంటుంది. తోక పార్టీ మాదిరే మిగిలిపోతుంది. ఎన్ని సమావేశాలు పెట్టినా నో యూజ్.

Also Read : రెడ్డిసుబ్రమణ్యం ఎన్నికల వరకు ఉంటాడా?తాత్కాలిక సర్దుబాటేనా ?

Show comments