కరోనా కట్టడి తర్వాత డబుల్ బొనాంజాకు సిద్ధమవుతున్న బీసీసీఐ

కరోనావైరస్ మహమ్మారి ప్రభావం నుండి ప్రపంచం కోలుకున్న తర్వాత క్రీడలలో చాలా విషయాలు మారవచ్చు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు కూడా వినూత్న విధానాన్ని అవలంబించడానికి సిద్ధపడుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో క్రికెట్‌లో కోల్పోయిన సమయంతో పాటు ఆదాయాన్ని తిరిగి పొందే దిశలో బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టింది.తాజాగా బీసీసీఐ టెస్ట్ మరియు పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసి ఒకే రోజున బహుళ అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించడంపై దృష్టి సారించింది.

బ్రాడ్‌కాస్టర్ యొక్క ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడవలసి వస్తే బీసీసీఐ ఈ విధానాన్ని అవలంబించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. బీసీసీఐ తాజా ప్రతిపాదన ప్రకారము పగటిపూట టెస్ట్ మ్యాచ్‌లు నిర్వహించడం, సాయంత్రం వేళ ఫ్లడ్ లైట్ల వెలుతురులో టీ-20 మ్యాచ్ ఆడించడానికి మొగ్గు చూపుతుంది.

ఒక బీసీసీఐ అధికారి స్పోర్ట్‌స్టార్‌ ప్రతినిధితో మాట్లాడుతూ ” ప్రపంచవ్యాప్తంగా క్రీడలు ముఖ్యంగా అంతర్జాతీయ క్రికెట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో మనలో ఎవరికీ తెలియదు. స్పాన్సర్ల నుండి ప్రేక్షకుల వరకు మా వాటాదారులందరినీ మేము కాపాడుకోవలసి వస్తే వన్డే మరియు టెస్టులకు రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేయడంతో పాటు ఒకేసారి టెస్ట్ సిరీస్ మరియు టీ-20 సిరీస్‌లను ఆడటం మా ముందున్న మార్గాలలో ఒకటి ”అని వెల్లడించాడు.

ఇప్పటికే ఈ ఆలోచనను భారత జట్టు కోచింగ్ సిబ్బందికి బీసీసీఐ తెలియజేసింది. కొంతమంది బోర్డు సభ్యులు వేర్వేరు ఫార్మాట్లకు అవసరమైన రెండు జట్ల సభ్యుల ఎంపిక కోసం అందుబాటులో ఉన్న ఆటగాళ్ళ సంఖ్యను గుర్తించటం ప్రారంభించారని బీసీసీఐ వర్గాలు నుండి విశ్వసనీయ సమాచారం లభిస్తుంది. ఒకవేళ ఈ విధానాన్ని అవలంబిస్తే,ఆస్ట్రేలియా తర్వాత ఒకే సమయంలో పలు ఫార్మాట్లను ఆడే రెండవ జట్టుగా భారత్ నిలుస్తుంది.2017 ఫిబ్రవరి 22 న అడిలైడ్ ఓవల్‌లో శ్రీలంకతో టి 20 మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా మరుసటి రోజు భారత్ తో ఒక టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆడింది.

కానీ ఒకే సమయంలో పలు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహిస్తే ప్రేక్షకులు తమ సమయాభావం వలన వాటి పట్ల ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. పైగా జట్టులో నాణ్యమైన క్రికెటర్ల సంఖ్య తగ్గి ద్వితీయ శ్రేణి జట్టుగా మారే అవకాశం ఉంది. కాబట్టి బీసీసీఐ ప్రతిపాదన ఆచరణలో ఎలాంటి ప్రయోజనాన్ని నెరవేరుతుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

Show comments