బ్రదర్స్ కు తగ్గ కథలు లేవా

మన దగ్గర సృజనాత్మకత కలిగిన రచయితల కరువో లేక పక్క బాషల రైటర్లు గొప్పగా ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు కానీ టాలీవుడ్ హీరోలు రీమేకుల మీద విపరీతంగా మనసు పారేసుకుంటున్నారు. అక్కడ హిట్ అయ్యిందన్న టాక్ వస్తే చాలు హక్కులు కొనేసుకోవడం తక్కువ బడ్జెట్ లో ఎక్కువ టైం తీసుకోకుండా చకచకా చుట్టేసి ఓ వంద కోట్ల బిజినెస్ తో సేఫ్ గేమ్ ఆడేయడం పరిపాటిగా మారింది, ముఖ్యంగా మెగా అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు వీటిని ఓ పట్టాన వదిలేలా కనిపించడం లేదు. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్, భోళా శంకర్, పవన్ ఆల్రెడీ చేసిన వకీల్ సాబ్ ఇప్పుడు నిర్మాణంలో ఉన్న భీమ్లా నాయక్ అన్నీ రీమేకులే

తాజాగా రామ్ చరణ్ అజిత్ చేసిన ఎన్నై అరిందాల్ హక్కులు కొన్నాడనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. బాబాయ్ పవన్ తో దీన్ని తీయాలని అతని ఆలోచనట. ఇది ఆల్రెడీ తెలుగులో ఎంతవాడు గాని పేరుతో డబ్బింగ్ అయ్యి థియేటర్లో ఆడి శాటిలైట్ ఛానల్స్ లో కూడా చాలా సార్లు వచ్చింది. మళ్ళీ దీన్నే తీయడమనే ఎంతమాత్రం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఇదే తరహాలో పవన్ గతంలో కాటమరాయుడు తీసి ఎలాంటి ఫలితం అందుకున్నాడో చూశాం. ఇప్పటికీ లూసిఫర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రైమ్ లోనే ఉంది. కనీసం దాన్ని తీసేయించే పని చేయకుండా అలాగే వదిలేశారు కూడా. మరి ఇంత నమ్మకం పనికిరాదేమో.

చిరు పవన్ లు రీమేకులు చేయడం కొత్తేమి కాదు కానీ ఇంత షార్ట్ గ్యాప్ లో మాత్రం చాలా అరుదు. ఘరానా మొగుడు, హిట్లర్, సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్, ఠాగూర్ ఇవన్నీ ఇతర బాషల నుంచి తీసుకుని హిట్లు బ్లాక్ బస్టర్లు కొట్టినవే. ఇంకా చాలా ఉన్నాయి. కానీ అప్పుడు టెక్నాలజీ అంతగా లేని కాలం కాబట్టి ఒరిజినల్ వెర్షన్లు చూసే అవకాశం లేదు కానీ ఇప్పుడలా కాదు. అయ్యప్పనుం కోషియం ఇక్కడ అఫీషియల్ ప్రకటన రాకముందే చూసినవాళ్లు వేలల్లో ఉన్నారు. వీళ్ళనే కాదు హీరోలందరూ సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమిది. మహేష్ బాబు లాగా అందరూ కమిట్ అయితే ఇక్కడివాళ్లకే కొత్త అవకాశాలు వస్తాయిగా

Also Read : భారం నాగ్ మీద కాదు సభ్యుల మీదే

Show comments