iDreamPost
iDreamPost
ఉపాధ్యాయుడు అంటే చేతులెత్తి మొక్కుతాం. ఎందుకంటే రేపటి పౌరులను తయారు చేసే గురుతర బాధ్యతలో ఉన్నందుకు. కానీ అటువంటి ఉపాధ్యాయుడు బుద్ధి వక్రించి తన వద్ద చదువుకునే ఆడపిల్లల పాలిట కీచకుడిగా మారితే? పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాడు ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా 30 ఏళ్లపాటు ఆ కీచక ఉపాధ్యాయుడి హింసని భరించారు 60మంది చిన్నారులు. ఆ ఉపాధ్యాయుడి కీచక క్రీడ ఏడాది రెండేళ్లు కాదు 30 ఏళ్లు సాగింది. ఇప్పుడు రిటైర్ అవ్వడంతో ఆ ఉపాధ్యాయుడు బారిన పడిన విద్యార్ధినిలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ బాగోతం బయటపడింది.
కేరళలోని మలప్పురం మున్సిపాలిటీలో సీపీఎం కౌన్సిలర్ గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సేంట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా చేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు.ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసాడని శశికుమార్ పై పోలీసు కేసు నమోదైంది. 50 మంది విద్యార్ధినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడుసార్లు కౌన్సిలర్ గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడిని అతడు తనకు రక్షణగా ఉపయోగించుకున్నాడు. దాంతో అతడి అఘాయిత్యాలపై ఎవరూ ధైర్యం చేసి చెప్పలేకపోయారు. శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న మాజీ విద్యార్థిని ఒకరు అతడి అరాచకాలను బయటపెట్టింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో శశికుమార్ పరారయ్యాడు. అతడిని వారం రోజులుగా గాలించి ఎట్టకేలకు పట్టుకుని శుక్రవారం (మే 13,2022)అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. స్కూల్ యాజమాన్యం తరఫున లోపాలు ఉన్నాయేమో చూడాలని కోరారు. ఈ పరిణామాలతో శివకుమార్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది. మున్సిపల్ కౌన్సిలర్ పదవికి అతడు రాజీనామా చేశాడు.