జానపద కథానాయకుడిగా సూపర్ స్టార్..

  • Published - 03:38 PM, Tue - 15 November 22
జానపద కథానాయకుడిగా సూపర్ స్టార్..

జేమ్స్ బాండ్ గా, కౌబాయ్ గా ఎక్కువగా మనకు కనిపించే సూపర్ స్టార్ కృష్ణ పలు జానపద సినిమాలు కూడా చేశారన్న సంగతి ఇప్పటి తరానికి ప్రత్యేకంగా గుర్తు చేయాల్సి ఉంటుంది. ఆ విశేషాలేంటో చూద్దాం. గూఢచారి 116 సూపర్ హిట్ అయ్యాక కృష్ణ వద్దకు ‘ఇద్దరు మొనగాళ్లు’ ప్రతిపాదన వచ్చింది. అప్పట్లో టార్జాన్ క్యారెక్టర్ అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. దాని ఆధారంగా ఎస్ఎస్ నాగరాజన్ ఇచ్చిన కథను తెరకెక్కించాలనే ఉద్దేశంతో బి విట్టలాచార్య దర్శకత్వంలో నిర్మాత సి మల్లికార్జునరావు సిద్ధమయ్యారు. ఫస్ట్ హాఫ్ మాటలే ఉండని పాత్ర ఎలా ఉంటుందోననే టెన్షన్ ని ఛాలెంజ్ గా తీసుకుని కృష్ణ ఆ చిత్రం చేశారు. కాంతారావుతో కలిసి టైటిల్ రోల్ పోషించారు 1967లో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది.

 

డి రామానాయుడు నిర్మాతగా 1969లో వచ్చిన ‘బొమ్మలు చెప్పిన కథ’ రెండోది. ఇందులో కృష్ణగారికి విజయనిర్మల చెల్లెలిగా నటించడం విశేషం. ఇదే ఈ సినిమాకు మైనస్ అయ్యింది. రెండు పాటలు కలర్ లో తీసిన ఈ చిత్రం ఫెయిలయ్యింది. 1969లో రవికాంత్ నగాయచ్ తీసిన ‘మహాబలుడు’ ఈ సిరీస్ లోకే వస్తుంది. వాణిశ్రీ హీరోయిన్ గా రూపొందిన ఈ బాహుబలి టైపు రాజ్యాధికార డ్రామాలో బోలెడు రాజకీయాలు, రాజప్రాసాదపు కుట్రలు అన్నీ ఉంటాయి. గ్రాఫిక్స్ లేకుండా కేవలం ట్రిక్ ఫోటోగ్రఫీతో అద్భుతాలు చేశారు. 1978కి కొమ్మినేని శేషగిరిరావు డైరెక్షన్ లో గిరిబాబు నిర్మాతగా చేసిన ‘సింహగర్జన’ అదే సమయంలో వచ్చిన ఎన్టీఆర్ సింహబలుడు పోటీని తట్టుకుని మరీ విజయం సాధించింది.

1986లో తనే దర్శకుడిగా మారి కృష్ణ ఆవిష్కరించిన తొలి 70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ గ్రాండియర్ ‘సింహాసనం’ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న టైంలో కోట్ల రూపాయల బడ్జెట్ తో ఇంత సాహసానికి ఒడిగట్టిన కృష్ణ ధైర్యానికి హాట్స్ అఫ్ చెప్పని వాళ్ళు లేరు. బప్పీలహరి సంగీతానికి ఇప్పటికీ అభిమానులు పరవశించి పోతుంటారు. జానపద జానర్ లో సూపర్ స్టార్ చేసిన సినిమాలివే. అన్నీ కూడా ట్రెండ్ కు ఎదురీది రూపొందినవి. కాకపోతే ఎన్టీఆర్, కాంతారావులు ఈ విభాగంలో ఆధిపత్యంలో ఉండేవారు కాబట్టి కృష్ణ ఎక్కువ వీటిని టచ్ చేయకుండా తనదైన స్కూల్ ని ఫాలో అయిపోయేవారు.

Show comments