ఇక వానలుండవ్‌.. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతే

ఇక వానలుండవ్‌.. అప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోతే

ఒక వారం క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి.. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పలు ప్రాంతాల్లో వరదల వల్ల జనాలు తీవ్రంగా నష్టపోయారు. బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. వర్షాకాలమే కాబట్టి.. ఇలానే అడపాదడపా జోరు వానలు కురుస్తాయి అని భావిస్తే.. గత కొన్ని రోజులుగా ఎండలు మండుతున్నాయి. మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు సంబంధించి ఐఎండీ కీలక ప్రకటన చేసింది. మరి కొన్ని రోజుల పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని.. ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పింది.

తెలంగాణకు సంబంధించి వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపింది. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయవ్య, పశ్చిమ దిశ నుండి గాలులు తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరంలో చలి వాతావరణం నెలకొని ఉంది. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలుగా, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక ఏపీలో కూడా జూలై నెల చివరి వరకు వర్షాలు కురిసాయి. ఆ తర్వాత నుంచి వాతావరణం పూర్తిగా మారిపోయింది.. వానలు ఆగిపోయి. ప్రస్తుతం ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎంతలా పెరిగాయి అంటే.. వేసవి కాలంలో ఎంత వేడిగా ఉంటుందో.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ రేంజ్‌లో ఎండ తీవ్రత కనిపిస్తోంది. రాత్రి సమయంలో ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనపడ్డాయని.. మరో వారం వరకు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. రెండు వారాల్లో రుతుపవనాలు బలహీనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దాంతో ఆగస్ట్‌ 20 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Show comments