iDreamPost
iDreamPost
వరసగా రెండు రీమేకులు వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ ఈ క్యూ ఇంకా కొనసాగించబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే వినోదయ సితం(తమిళం)కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న విజయ్ తేరి రీమేక్ ని మరోసారి తెరముందుకు తీసుకురాబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. నిజానికిది ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. చివరికి క్యాన్సిల్ అయ్యిందనే అనుకున్నారు. కానీ తీరా చూస్తే గబ్బర్ సింగ్, భీమ్లాలో పోలీస్ పాత్రలకు వచ్చిన స్పందన చూసి మరోసారి కమర్షియల్ హిట్టు కొట్టవచ్చన్న ధీమాతో ఇలా ప్లాన్ చేశారట.
దర్శకుడిగా సుజిత్ పేరు ఫిక్స్ అయినట్టుగా చెబుతున్నారు. సాహో తర్వాత ఈ కుర్రాడికి చాలా గ్యాప్ వచ్చింది. చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేతికి దాకా వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. పెళ్లి కోసం కొంత కాలం బ్రేక్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఏదో బాలీవుడ్ మూవీ చేయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడీ తేరి రీమేక్ కోసం అతన్ని సంప్రదించినట్టు వినికిడి. దీనికి నిర్మాత ఎవరో కాదు డివివి దానయ్యట. రామ్ చరణ్, చిరంజీవిలతో వరసగా ప్రాజెక్టులు చేస్తూ ఇప్పుడు పవర్ స్టార్ తో టైఅప్ అయ్యారన్న మాట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ లీకైతే జోరుగా చక్కర్లు కొడుతోంది.
అసలు పవన్ కు ఇన్నేసి రీమేకులు ఎందుకనే ప్రశ్న తలెత్తడం సహజం. కారణం లేకపోలేదు. వీటిలో రిస్క్ తక్కువ. భారీ బడ్జెట్ లు అవసరం లేదు. నెలల తరబడి కాల్ షీట్స్ త్యాగం చేయాల్సిన పని ఉండదు. నీట్ గా ఆరేడు నెలల్లో ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ కాబట్టి ధీమాగా ఉండొచ్చు. వీటితో పాటు రిస్క్ తక్కువ ఆదాయం ఎక్కువ సూత్రం ఇందులో ఇమిడి ఉంది. హరిహరవీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ లు పూర్తయ్యాక దీని తాలూకు అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. మధ్యలో సురేందర్ రెడ్డి సినిమా కూడా ఉంది. వచ్చే ఎన్నికల లోపు పవన్ ఎన్ని సినిమాలు టార్గెట్ పెట్టుకున్నారో అంతు చిక్కడం లేదు
Also Read : The Fame Game : ది ఫేమ్ గేమ్ రిపోర్ట్