Follow Us:

రాజేంద్రుడి విలక్షణ పాత్రలు

రాజేంద్రప్రసాద్ మనకు నవ్వులరాజు గానే సుపరిచితం.మనసు కాస్త కలత పడినప్పుడు ఆహ్లాదకరమైన హాస్య చిత్రాలు చూడాలంటే రాజేంద్రుడి సినిమాలే చక్కని టానిక్.ఈ మాట మనమే కాదు సాక్షాత్తు మాజీ ప్రధానమంత్రి పి. వి.నరసింహరావు గారు కూడా ఒక సందర్భంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకు ఉదాహరణగా చెప్పడానికి అలిసిపోయేటన్ని ఉన్నాయ్ మరి. కాని నటకిరీటీ హాస్య ప్రధాన పాత్రలే కాకుండా విభిన్నమైన కోణాలు కలిగి నటుడిగా ఆయనకు ఛాలెంజ్ విసిరిన పాత్రలు కూడా ఎన్నో చేశారు. వాటిలో మేలిముత్యాలు అనదగ్గ కొన్ని ఉదాహరణలు చూద్దాం

ఛాలెంజ్(1984)

ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగిగా మారిన తాగుబోతు పాత్రలో రాజా నటన చాలా విలక్షణం. చిరంజీవి అండతో జీవితంలో మారి తాను ఏంటో ఋజువు చేసుకునే భూమికలో మనకు గుర్తుండిపోతాడు. కోదండరామిరెడ్డి దర్శకుడు. ప్రత్యేకంగా పాటలు గట్రా ఏమి ఉండవు కానీ సుప్రీమ్ హీరో సినిమాలో తన ఉనికిని చాటుకునే రేంజ్ లో విద్యార్థి పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు రాజేంద్రప్రసాద్.

రాక్షసుడు(1986)

అసాంఘిక శక్తులని ఎలాగైనా రూపుమాపాలని పోరాడే ఇన్స్పెక్టర్ విజయ్ పాత్రలో నటకిరీటి చక్కని నటనతో ఆకట్టుకుంటాడు. డ్యూటీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కీలకమైన మలుపుకు కారణం అవుతాడు. ఫస్ట్ హాఫ్ కే పరిమితమైనప్పటికీ ఉన్నకాసేపు తన ఉనికిని చాటుకున్నాడు. దర్శకుడు కోదండరామిరెడ్డి.

కాష్మోరా(1986)

చేతబడులు చేసే భీకర మాంత్రికుడు కాద్రాగా నటకిరీటి ఇందులో చూసేవాళ్ల ఒళ్ళు  జలదరించేలా భయపెడతాడు. ఏ స్థాయిలో అంటే ప్రతీకారంతో రగిలిపోయే పాత్రలో మనం చూస్తోంది రాజేంద్రప్రసాద్ నేనా అనేంతగా.యండమూరి సంచలన నవల తులసి దీనికి ఆధారం.రాజశేఖర్,భాను ప్రియ, శుభలేఖ సుధాకర్ ఇతర ముఖ్య తారాగణం. గొప్ప విజయం సాధించకపోయినా రాజేంద్రప్రసాద్ నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది


అరణ్యకాండ(1987)

ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నాగార్జున కెరీర్ మొదట్లో చేసిన చిత్రం. ఇందులో రాజేంద్ర ప్రసాద్ కోయ యువకుడి పాత్రలో కొత్త తరహా వేషధారణ, ఆహార్యంతో కనిపించటం వింత అనుభూతి కలిగిస్తుంది.

ఝాన్సీరాణి(1988)

అమ్మాయిల జీవితాలతో ఆడుకుని వాళ్ళను నాశనం చేసే దుర్మార్గ పాత్రలో రాజేంద్రుడి నటన చూసి తీరాల్సిందే.సుప్రసిద్ధ సంభాషణల రచయిత సత్యానంద్ దర్శకుడు. మల్లాది నవల మిస్టర్ V ఆధారం.టైటిల్ రోల్ భానుప్రియ చేశారు. కామెడీ రోల్స్ లో తమను మనసారా నవ్వించే రాజేంద్రప్రసాద్ ని ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు చూడలేకపోయారు. అందుకే నవల హిట్టైనా సినిమా ఫ్లాపయ్యింది.

ముత్యమంత ముద్దు(1989)

అపురూపమైన, అరుదైన ఒక గొప్ప ప్రేమికుడు అనుదీప్ పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించిన చిత్రం. సినిమా ఆసాంతం హాస్య రసం లేకుండా ప్రసన్నంగా,గంభీరంగా తన ప్రేమను నిజాయితీగా వ్యక్తపరిచే యండమూరి సృష్టించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు రాజేంద్రుడు.రవిరాజా పినిశెట్టి(విలన్ ఆది పినిశెట్టి తండ్రి)దర్శకుడు. ఒకవేళ ఇప్పటిదాకా చూడకపోతే ఇప్పుడైనా మిస్ కాకుండా చూడాల్సిన చిత్రం. కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ సంగీతం మరో ఆకర్షణ


ఎర్ర మందారం(1991)

అమాయకమైన పల్లెటూరి బంటు పాత్రలో దొర దగ్గర ఊడిగం చేస్తూ బతుకు బండి నడిపే పేదవాడి పాత్రలో జీవించేశారు నటకిరీటి. మొదట అమాయకత్వం,తర్వాత తెగించి ప్రాణాలు సైతం కోల్పోయే పాత్రలో మనసులు గెలిచేస్తాడు.ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. దీనికి ఎన్ని ప్రశంసలు దక్కాయో అంతకు రెట్టింపు అవార్డులు వచ్చాయి

నవయుగం(1991)

న్యాయ స్థానాల్లో జరిగే అన్యాయాలు సహించలేని లాయర్ పాత్ర ఇందులో పోషించారు. కామెడీ లేకుండా పూర్తి సామజిక స్పృహ కూడిన అంశాలు మాత్రమే ఈ సినిమాలో ఉంటాయి. మీనా కూడా ఇందులో జంటగా ఒక టిపికల్ రోల్ చేసింది. ముత్యాల సుబ్బయ్య దర్శకుడు.


శ్రీనాథ కవి సార్వభౌమ(1993)

రాజా వల్లభ దేవుడిగా ఒక చారిత్రాత్మక చిత్రంలో ఎన్టీఆర్ లాంటి సినీ దిగ్గజం ముందు భేషజం లేకుండా నటించి అభినందనలు అందుకున్నారు. బాపు దర్శకుడు. సినిమా ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ తన శైలికి భిన్నమైన పాత్ర పోషించి రాజేంద్రపసాద్ మంచి మార్కులు సాదించారు

ఆ నలుగురు(2004)

20వ దశకంలో వచ్చిన ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రస్తావించాలి.రఘురాంగా మంచికి మారుపేరుగా కుటుంబం కోసం సర్వం త్యాగం చేసి సంఘ శ్రేయస్సు కోసం పాటుపడి నలుగురి అభిమానాన్ని సంపాదించే వాడిగా రాజేంద్రుడి నటనకి చెమర్చని కళ్లు లేవు. కెరీర్ బెస్ట్ గా దీన్నే చెప్పుకుంటారు రాజేంద్ర ప్రసాద్. దర్శకుడు చంద్ర మహేష్.

రాజేంద్రప్రసాద్ ఏనాడు ఒకే రకమైన పాత్రలకు కట్టుబడలేదు.అలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి ఈ చరిత్ర ఏ సిరాతో, గుడిగంటలు మ్రోగాయి, ఇది కాదు ముగింపు, సాక్షి, పుణ్యస్త్రీ, పవిత్ర, ధర్మపత్ని, డబ్బెవరికి చేదు, జీవన గంగ, ప్రేమ తపస్సు, రాంబంటు, ఈ చదువులు మాకొద్దు, అనాదిగా ఆడది, ఆడపిల్లలే నయం, మీ శ్రేయోభిలాషి, ఓనమాలు, యమజాతకుడు లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. ఒకదశలో కామెడీసినిమాలకే ఎక్కువ పరిమితం కావడంతో తనలోని వర్సటైల్ యాక్టర్ ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేకపోయారు.

సేద తీరే హృదయాలకు పన్నీటి జల్లు నటకిరీటి నటన….