Follow Us:

swarnakamalam సినీవనంలో విరబూసిన అద్భుత’కమలం’

కమర్షియల్ సూత్రాలకు కట్టుబడకుండా తాము నమ్మిన పంథాలో గొప్ప చిత్రాలు తీసే దర్శకులను వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. అందులో ముందువరసలో ఉండే వ్యక్తి కళాతపస్వి కె విశ్వనాథ్(K Vishwanath). ఆరు పాటలు నాలుగు ఫైట్లు రాజ్యమేలుతున్న కాలంలో ముసలివాడిని హీరోగా పెట్టి సంగీత భరిత కళాఖండం శంకరాభరణం తీసి పండిత పామరులను ఏకాకాలంలో మెప్పించడం ఆయనకే చెల్లింది. స్టార్లు సైతం నివ్వెరపోయే ఆ విజయం టాలీవుడ్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. అయితే స్టార్ హీరోతో కళాత్మక సినిమా చేయడం ఎవరికైనా కత్తి మీద సామే. దాన్ని కూడా జనరంజకంగా తీసి చూపగలనని విశ్వనాథుడు ఆవిష్కరించిన అద్భుతమే స్వర్ణకమలం(Swarnakamalam ).


1988వ సంవత్సరం. అప్పటికి వెంకటేష్(Venkatesh Daggubati) ఇంకా స్టార్ గా కుదురుకోలేదు. డెబ్యూ మూవీ కలియుగ పాండవులు, శ్రీనివాస కళ్యాణం, రక్తతిలకం తప్ప మిగిలినవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందుకే ముందు తనలో నటనా ప్రతిభను ఆవిష్కరించే దర్శకుడితో జట్టు కట్టాలని నిర్ణయించుకున్న వెంకీకి విశ్వనాథ్ గారు చెప్పిన లైన్ విపరీతంగా నచ్చేసింది. నిజానికి ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ అనిపించే సబ్జెక్టు. టైటిల్ కూడా అమ్మాయిని ఉద్దేశించే పెట్టారు. అయినా కూడా వెంకటేష్ ఆ లెక్కలేవి వేసుకోలేదు. కళను ప్రపంచానికి పరిచయం చేసి దాన్నో గొప్ప స్థాయికి చేరుకోగల కమలంగా విరబూయించిన తోటమాలి పాత్రకు ఆనందంగా ఒప్పుకున్నాడు.


అప్పటికే కళ్ళతో, నాట్యంతో అభినయ పరంగా మంచి పేరు తెచ్చుకున్న భానుప్రియ(Bhanupriya)ను టైటిల్ రోల్ కు ఎంచుకున్నారు. సాయి నాధ్ సంభాషణలు సమకూర్చారు. ఇళయరాజా పదే పదే వినాలనిపించే మర్చిపోలేని స్వరాలను సంగీత ప్రియులకు కానుకగా ఇచ్చారు. వాటికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సొబగులు అద్దింది. తండ్రి నుంచి వచ్చిన గొప్ప సాంప్రదాయక నృత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బులు సంపాదించడం కోసం గాలి మెడలు కడుతున్న ఓ అమ్మాయిని సరైన లక్ష్యం వైపు నడిపిస్తాడు పెయింటింగులు వేసుకుని పబ్బం గడుపుకునే ఓ మాములు కుర్రాడు. సింపుల్ గా ఇదే కథ. ప్రేక్షకులకు స్వర్ణకమలం(Swarnakamalam ) విపరీతంగా నచ్చేసింది. ఉత్తమ చిత్రంగా నిర్మాత వాకాడ అప్పారావుకు, ఉత్తమ నటిగా భానుప్రియకు, స్పెషల్ జ్యూరీగా వెంకటేష్ కు కలిపి మొత్తం మూడు నంది అవార్డులు దక్కాయి. దశాబ్దాలు దాటుతున్నా స్వర్ణకమలం తాలూకు సౌరభాలు మాత్రం ఇంకా నిత్యనూతనంగా వెదజల్లుతూనే ఉన్నాయి.