Follow Us:

aditya 369: కాలంతో సింగీతం మాయాజాలం

ఇప్పటికీ ఓ విజువల్ వండర్. కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి ఆలోచన రావడమే ఓ సాహసమైతే దాన్ని సరిగ్గా అమలు పరిచి సక్సెస్ అందుకోవడం అంతకన్నా గొప్ప ఘనత.

ఇప్పటికీ ఓ విజువల్ వండర్. కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి ఆలోచన రావడమే ఓ సాహసమైతే దాన్ని సరిగ్గా అమలు పరిచి సక్సెస్ అందుకోవడం అంతకన్నా గొప్ప ఘనత.

అందరు దర్శకులు ప్రయోగాలు చేయరు. దానికి నిజంగానే గట్స్ కావాలి. కమర్షియల్ ఫార్ములాకి అలవాటు పడిపోయి అందులో విజయాలను చవిచూడటం మొదలెట్టాక వేరేవాటి వైపు రిస్క్ చేయాలి అనిపించదు. కానీ కొందరు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచిస్తారు. అలాంటి వారిలో సింగీతం శ్రీనివాసరావుగారి గురించి ప్రత్యేకంగా చెప్పొచ్చు. ముద్దుల మావయ్య, లారీ డ్రైవర్ లాంటి మాస్ హిట్స్ తో బాలకృష్ణ మంచి ఊపు మీదున్న టైంలో ఆయన చేసిన ఆదిత్య 369 ఇప్పటికీ ఓ విజువల్ వండర్. కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని సమయంలో ఇలాంటి ఆలోచన రావడమే ఓ సాహసమైతే దాన్ని సరిగ్గా అమలు పరిచి సక్సెస్ అందుకోవడం అంతకన్నా గొప్ప ఘనత.


1991లో విడుదలైన ఆదిత్య 369 నేటితో 31 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గా అనిపించే ఈ చిత్రరాజం నందమూరి అభిమానులకే కాదు ప్రతి మూవీ లవర్ కు ఒక స్వీట్ మెమరీ. 1985లో వచ్చిన బ్యాక్ టు ది ఫ్యూచర్ అనే హాలీవుడ్ మూవీ సింగీతం వారికి విపరీతంగా నచ్చేసింది . దాన్ని తెలుగీకరించి మనవాళ్ళకు ఓ కొత్త అనుభూతినివ్వాలన్న ఆలోచనతో ఓ సైన్స్ ఫిక్షన్ కథకు శ్రీకారం చుట్టారు. ఓ సందర్భంలో గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారికి వినిపించినప్పుడు ఆయన శివలెంకకృష్ణ ప్రసాద్ తో పాటు నిర్మాణ భాగస్వామిగా మారి సినిమా తీయడానికి రెడీ అయిపోయారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రంగం సిద్ధమయ్యింది.


వర్తమానంలో కనిపించే మెకానిక్ పాత్రకు కమల్ హాసన్, రాజుల కాలం నాటి శ్రీకృష్ణదేవరాయల వేషానికి బాలకృష్ణను అనుకుని ముందు ప్లాన్ చేసుకున్నారు. కానీ కాల్ షీట్ల సమస్య రావడంతో బాలయ్యతోనే డ్యూయల్ రోల్ చేయించాలని డిసైడ్ అయ్యారు. కెమెరామెన్ పిసి శ్రీరామ్ రికమండ్ చేసిన మోహినిని హీరొయిన్ గా పరిచయం చేస్తూ ఆఖరి పోరాటం, జగదేకవీరుడు అతిలోకసుందరి ద్వారా మనకూ దగ్గరైన అమ్రిష్ పూరిని విలన్ గా సెట్ చేసుకున్నారు. జంధ్యాల రచన, ఇళయరాజా సంగీతం, శ్రీరామ్ కు ఆరోగ్య సమస్య రావడంతో ఆయన స్థానంలో వచ్చిన కబీర్ లాల్-విఎస్ఆర్ స్వామిల ఛాయాగ్రహణం ఇలా టాప్ టెక్నీషియన్స్ తో రంగం సిద్ధమయ్యింది.


ప్రొడక్షన్ టైంలో రాజీ అన్న మాటకు తావివ్వకుండా ముందు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చవుతున్నా లెక్క చేయకుండా నిర్మాణం సాగించారు. ఓ శాస్త్రవేత్త కనిపెట్టిన టైం మెషీన్ తో ఇప్పుడున్న వాళ్ళు వందల ఏళ్ళు వెనక్కు వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనను ఇందులో అద్భుతంగా ఆవిష్కరించారు. దాన్ని ఎలాగైనా చేజేక్కించుకునే కుట్రతో ఉన్న ఓ రాజావారి పాత్ర. బోనస్ గా ఫ్యూచర్ లోకి సైతం తీసుకెళ్ళిపోయారు సింగీతం శ్రీనివాసరావు. ఫలితంగా అప్పటిదాకా తెలుగుతెర చూడని ఓ సరికొత్త ఫిక్షన్ ని కళ్ళు చెదిరే స్థాయిలో ఆవిష్కరించడంతో ప్రేక్షకులు అచ్చెరువొంది చూశారు. పిల్లలు ఎగబడ్డారు. వాళ్ళకు చూపించాలి కాబట్టి పెద్దలూ థియేటర్లకు క్యు కట్టారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది.


ఏడాది పాటు ఆడిన ఇండస్ట్రీ హిట్ కాకపోయినా ఆదిత్య 369ని తీర్చిద్దిద్దిన తీరు, జనం ఆదరించిన వైనం చిరంజీవిలాంటి ఇతర హీరోలను సైతం కదిలించి వాళ్ళుగా ముందుకు వచ్చి ప్రచారం చేసేలా ప్రేరేపించింది. అప్పటిదాకా బాలయ్యను ఎవరూ చూపించని కోణంలో ఆదిత్య 369 మెప్పించడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇళయరాజా పాటలు సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లగా టిను ఆనంద్, అన్నపూర్ణ, సుత్తివేలు, చంద్రమోహన్, మాస్టర్ తరుణ్, బాబు మోహన్, తనికెళ్ళ భరణి, సుభలేఖ సుధాకర్, బ్రహ్మానందం లాంటి సీనియర్ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ దీన్ని ఇంకో స్థాయిలో నిలబెట్టాయి. విదేశీ నిపుణుల సహకారం లేకుండా సెట్లు, కెమెరా ట్రిక్కులతోనే సింగీతం వారు చేసిన ఈ ఆదిత్య మాయాజాలం ఎప్పటికీ చిరస్థానాన్ని కలిగి ఉంటుంది.