రీమేకులు మ్రోగిస్తున్న వార్నింగ్ బెల్స్..

రీమేకులు మ్రోగిస్తున్న వార్నింగ్ బెల్స్..

  • Updated - 12:16 PM, Tue - 1 November 22
రీమేకులు మ్రోగిస్తున్న వార్నింగ్ బెల్స్..

ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లోనూ అదే ఫలితాన్ని దక్కించుకుంటుందన్న గ్యారెంటీ లేదు. గుడ్డిగా రీమేక్ రైట్స్ కొనేసి చకచకా తీసేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో ఇకపై దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకనేది చూద్దాం. ఇటీవలే రిలీజైన ఓరి దేవుడాలో వెంకటేష్ ప్రత్యేక క్యామియో చేసినప్పటికీ, ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్విన్ మరిముత్తుకే దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. దీనికన్నా డబ్బింగ్ మూవీ సర్దారే బెటర్ వసూళ్లు రాబట్టడం గమనించాల్సిన విషయం. విశ్వక్ సేన్ చేసిన విపరీత పబ్లిసిటీ ఓపెనింగ్స్ కి పనికొచ్చింది.

 

ఇక గాడ్ ఫాదర్ ది మరో స్టోరీ. మొదటి నాలుగు రోజులు బ్లాక్ బస్టరని ఎంత ఊదరగొట్టిన ఫైనల్ గా పదిహేను కోట్ల దాకా నష్టం తప్పలేదని ఇన్ సైడ్ టాక్. నిర్మాత ఓన్ రిలీజ్ అని చెప్పుకున్నా చిరంజీవి స్టామినాకు తగిన మార్క్ ని అందుకోలేదనేది లెక్కలను చూస్తే అర్థమవుతోంది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, వకీల్ సాబ్ లు సైతం తొంబై కోట్లను టచ్ చేయడానికే నానా ఇబ్బందులు పడ్డాయి. సమస్య ఎక్కడ వస్తోందంటే విచ్చిలవిడిగా రీమేక్ ల అసలు మాతృకలు ఓటిటిలో అందుబాటులో ఉండటమే. వాటిని సబ్ టైటిల్స్ తో ముందే చూసేసిన జనాలకు కథ పరంగా ఎలాంటి ఎగ్జైట్మెంట్ ఉండటం లేదు. పైగా మక్కికి మక్కి వస్తున్నాయి కాబట్టి..

ఒకప్పుడంటే వీడియో టెక్నాలజీ ఇంటర్ నెట్ లు లేవు కాబట్టి ఫలానా రీమేక్ జరుగుతోందని తెలిసినా కూడా చూసే అవకాశం ఉండేది కాదు. ఘరానా మొగుడు, చంటి, పెదరాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు తెలుగులో వచ్చేదాకా అసలు వాటి కథలు కూడా అప్పటి ఆడియన్స్ కి తెలియదు. కానీ ఇప్పుడు మలయాళమో తమిళమో ఫలానా డేట్ కి రిలీజ్ అని తెలియడం ఆలస్యం గూగుల్ లో దాని పేరుతో పాటు రివ్యూ అని టైపు చేస్తే మొత్తం జాతకం బయట పడుతోంది. ఇప్పుడు సెట్స్ మీద నిర్మాణంలోనూ చాలా రీమేక్స్ ఉన్నాయి. వీటి సంగతలా ఉంచితే రాబోయే రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇండస్ట్రీలో కథల షార్టేజ్ కన్నా రచయితలు చెప్పే కథలు వినే ఓపిక కొరత చాలా ఉంది.

Show comments