Venkateswarlu
Venkateswarlu
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నేటినుంచే రైతు రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. దాదాపు నెలన్నర పాటు రుణ మాఫీ ప్రక్రియ కొనసాగనుంది. అధికారులు విడతల వారీగా రైతులకు రుణ మాఫీ చెక్కులను అందజేయనున్నారు. తొలి విడతలో మిగిలిన 19 వేల కోట్ల రూపాయల రుణాలను కేసీఆర్ సర్కార్ మాఫీ చేయనుంది. దీంతో 29.61 లక్షల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. నిన్న రుణ మాఫీ అమలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రుణమాఫీ అమలుకు సంబంధించి నిన్ననే కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. కరోనా కారణంగా రుణమాఫీ అమల్లో కొంత జాప్యం జరిగిందని చెప్పారు. రైతు బంధు, రైతు భీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగిస్తూనే ఉందని అన్నారు. రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి తీసుకు వచ్చే వరకు విశ్రమించమన్నారు.
రైతు రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ కరోనా కారణంగా సంభవించిన నష్టంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం రైతు రుణమాఫీకి పూనుకుంది. రుణమాఫీపై ముఖ్యమంత్రి పూర్తి నమ్మకం ఉంచారు. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు’’ అని అన్నారు.
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘‘ కేసీఆర్ రైతు బాంధవుడు. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 19 వేల కోట్ల భారాన్ని భరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం గ్రేట్. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సాటి లేదు’’ అని అన్నారు.