iDreamPost
iDreamPost
కలియుగానికి ముందు యుగాల్లో పాపం చేస్తే పైలోకంలో శిక్షించేవారని చెబుతుంటారు. కానీ ఇది కలియుగం ఇక్కడ పాపం చేస్తే ఇక్కడే అనుభవించాల్సి ఉంటుందన్నది ఇప్పటి పలువురి అభిప్రాయం. అందుకు తగ్గట్టుగానే పలు సంఘటనలు జరుగుతుండడం కలియుగ ధర్మంగా చూపిస్తుంటారు. నువ్వు ఎదుటి వాళ్ళకు ఏం చేసావో అదే నీకు తప్పకుండా జరుగుతుందన్నది కూడా కొందరికి అనుభవపూర్వకంగా తెలిస్తుంది. అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ తరపున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 18 సీట్లు మాత్రమే గెలిచారు. పార్టీ నిర్మాణంలో లోపాలు, సీట్ల కేటాయింపులు, అప్పటి రాజకీయ పరిస్థితులు తదితర బలమైన కారణాలే ఇందుకు ఉన్నాయి. ఆ పార్టీకి మూలస్థంభాలుగా ఉన్నవాళ్ళే అనేక విమర్శలు చేస్తూ పార్టీని వీడిపోయారు. అయితే గెలిచిన ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఎటువంటి ప్రత్యక్ష విమర్శలు బైటకు రాలేదు.
కానీ పచ్చమీడియా మాత్రం జెండా పీకేద్దాం అంటూ పెద్దపెద్ద హెడ్డింగులతో అదరగొట్టేసింది. ఒక వేళ పార్టీ కోసం నిలబడదాం అన్న భావన ఉన్న ఆ 18 మంది ఎమ్మెల్యేల మానసిక స్థితిని కూడా హిప్నటైజ్ చేసి మార్చేయగలిగే స్థాయిలో సదరు కథనాలను అప్పట్లో జనం మీదికొదిలారు. తీరా ఇప్పుడు పచ్చమీడియాకి ప్రత్యక్షంగా వెన్నుదన్నుగా ఉండే తెలుగుదేశం పార్టీకి నికరం 17 సీట్లేనని మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిపోయింది. వంకదొరికిన వాళ్ళు ఓటింగ్‌కే రాలేదు. వచ్చినోళ్ళు కూడా ‘తగు’ సూచనలు చేస్తూ చెల్లని ఓట్లేసారు. దీంతో ఇప్పటికి ఖాయం 17 మాత్రమే అన్నది స్పష్టమైపోయింది. అదికూడా సీయం వైఎస్ జగన్ తనకు తానుగా విధించుకున్న ధర్మబద్ధమైన నిర్ణయం కారణంగానే ఆ 17 అంకెనైనా కనబడుతోందన్నది పలువురికి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కాదూ కూడదని కాస్తంత కనికరం చూపితే ప్రస్తుతం ఉన్న డబుల్ డిజిట్‌లో ఎన్ని మిగులుతాయన్నది అనుమానమేనని పలువురి సీనియర్ టీడీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా 18కంటే ఒకటి తక్కువగా సీట్లున్న నేపథ్యంలో టీడీపీ జెండా పీకేద్దాం అన్న హెడ్డింగ్ వీరికి క్కూడా వర్తిస్తుందా అన్నది సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం జోరుగా గ్రూపులు మారుతున్న మెస్సేజ్. కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే మీడియా దృష్టిలో చంద్రబాబుకోన్యాయం, చిరంజీవికోన్యాయమా? అన్న సందేహం కలక్కమానదు.