గంటా టైమింగ్ “రాజ‌కీయం”

గంటా శ్రీనివాసరావు రాజ‌కీయంగా సుడి గ‌ల వ్య‌క్తి. ఈయన ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ నియోజకవర్గంలో ఉంటారో కూడా ఎవరికీ అర్థం కాక‌పోయినా.. వెళ్లే స‌మ‌యం.. వెళ్లే పార్టీ అన్నీ క‌లిసొచ్చేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటారు. ప్ర‌స్తుతం తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న ఆయ‌న పార్టీ మార‌తార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఆయ‌న ఇప్పుడు అధికార పార్టీలో ఉండాల్సిన వ్య‌క్తి. ఎప్పుడూ గెలిచే అవ‌కాశం ఉన్న పార్టీని, నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని పార్టీ మార్టీ మార‌డం ఆయ‌న తొలి నుంచి వ‌స్తున్న అల‌వాటుగా గంటా రాజ‌కీయ జీవితాన్ని ప‌రిశీలిస్తే తెలిసిపోతుంది. తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆయ‌న 1999లో అనకాపల్లి ఎంపీగా, 2004లో చోడవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో, మంత్రిగా పనిచేశారు. మళ్ళీ 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి, భీమిలి ఎమ్మెల్యేగా గెలిచి, చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 2019 ఎన్నికల్లో అదే టీడీపీ నుంచి విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే ఇక్కడ నుంచే గంటా రాజకీయం మారిపోయింది.

తాను ఎమ్మెల్యే గెలిచిన టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో, గంటా పార్టీ మారిపోవడానికి చూస్తున్నారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అధికారం లేకుండా ఎక్కువకాలం ఏ పార్టీలోనూ ఉండ‌లేర‌ని ఆయ‌న‌కు ఇప్ప‌టికే పేరుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచిన‌ప్ప‌టికీ రాజకీయంగా ఇబ్బందులు ఎదురుకుంటూనే ఉన్నారు. వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే అక్కడా సమస్యలే.. పోనీ, బీజేపీ వైపు దూకేద్దామా.? అంటే అక్కడా సమస్యలే. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వ్యవహారంలో గంటా ‘గోడ దూకేయాలని’ ప్లాన్ చేశారుగానీ, వర్కవుట్ కాలేదు. ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్యేగానే వున్నారు.. కానీ, రాజకీయంగా పూర్తి స్తబ్దత పాటిస్తున్నారు. అనూహ్యంగా ఆయనకిప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం కలిసొచ్చింది. ఇటు పార్టీ మారాల‌నే ఆలోచ‌న‌ను, ఇటు స్థానికంగా సింప‌తీ కొట్టే ప్ర‌య‌త్నం రెండూ ఫ‌లించేలా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు కూడా. గంటా రాజీనామా ఆమోదం పొందినా, పొందకపోయినా.. ఆయన రాజీనామా ఇంపాక్ట్ మాత్రం ఉండ‌బోతుంది. అది ఆయ‌న‌కు క‌లిసొచ్చేలా మార్చుకునే వ్యూహాల్లో గంటా త‌ల‌మున‌క‌లై ఉన్న‌ట్లు ఆయ‌న అనుచ‌రుల ద్వారా తెలుస్తోంది. దీనిలో భాగంగా జేఏసీ ఏర్పాటును తెర‌పైకి తెస్తున్నారు.

కొంత కాలంగా చ‌ప్ప‌గా సాగుతున్న త‌న రాజ‌కీయ జీవితాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ్య‌తిరేక ఉద్య‌మం ద్వారా మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజీనామా చేస్తున్నట్టు ప్ర‌క‌టించ‌డం, తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంప‌డం బిగ్ బ్రేకింగ్ గా ప‌లు మీడియాల్లో క‌థ‌నాలు రావ‌డం ద్వారా ఆయ‌న కొంత స‌క్సెస్ సాధించార‌నే చెప్పొచ్చు. . స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. ఉక్కు కర్మాగారం కోసం ఎందరో ప్రాణత్యాగం చేశారని, ఇప్పుడు నా పదవిని త్యాగం చేయడం చాలా చిన్న విషయమని అన్నారు. ప్రయివేటీకరణను అందరూ వ్యతిరేకించాలని గంటా పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా విశాఖ నేతలంగా రాజీనామా చేయాలని గంటా సూచించారు. నా వంతు బాధ్యతగా రాజీనామాతో ప్రారంభించి రాజకీయేతర జేఏసీ ఏర్పాటుచేసి పోరాటం సాగిస్తామని చెప్పి స్థానికంగా రాజ‌కీయ వేడి పుట్టించారు. జేఏసీ ద్వారా ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించి పేరు పొంద‌డం ద్వారా ఇత‌ర పార్టీల దృష్టిని ఆక‌ర్షిస్తారేమో వేచి చూడాలి.

Show comments