iDreamPost
iDreamPost
2006లో భారత పర్యటనకు వచ్చిన నాటి అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ని ఆంధ్ర ప్రదేశ్ రాష్టం నుండి ఎవరు రమ్మని ఆహ్వానించకపొయినా స్వీయ ఆసక్తితో నాటి ప్రధాని చేత ఫోన్ చేయించి మరీ హైదరాబాద్ లో బుష్ వాలిపోవడానికి కారణం ఏమిటి? అలాగే దేశంలో ఏ రాజకీయ నేతకు దక్కని అవకాశం అమెరికా అధ్యక్షుడుతో కలిసి ఒకే హెలికాఫ్టర్ లో ప్రయాణించే వెసులుబాటు వై.యస్ కు మాత్రమే ఎందుకు దక్కింది? అలాగే వై.యస్ అడగకపోయినా సహాయం చేయటానికి సిద్దంగా ఉన్నాం అని అగ్రరాజ్యం వై.యస్ కు ఎందుకు హామీలు కురిపించింది. నాడు వీటి వెనుక ఉన్న ఒకే ముఖ్య కారణం మోనోశాంటో కంపెనీ , BT పత్తి విత్తనాలు తయారు చేసే ఈ కంపెనీ రాష్ట్రంలో వందల కోట్ల రూపాయాల వ్యాపారం చేస్తుంది. నాడు BT పత్తి మీద ఎంత వ్యతిరేకత ఉన్న చంద్రబాబు నాయుడు వారికి అనుమతి ఇప్పించి సహకరించారు. జన్యు పరిజ్ఞానంతో తయారు చేసిన తమ పత్తి విత్తనాలు వాడితే పత్తి పంటకు ఎటువంటి తెగుళ్ళు రావని దిగుబడి మాత్రం రెట్టింపు అవుతుందని హామీ ఇచ్చి మరీ రాష్ట్రంలో ఆ కంపెనీ తమ విత్తనాలు రైతులకు అమ్మింది.
అయితే రెండేళ్ళు ఆ కంపెనీ విత్తానాలు వాడిన రైతులు నిలువునా మునిగిపొయారు. అప్పటి వరకు ఉన్న మామూలు పత్తి విత్తనాలు వాడితే పంటకు ఎలాంటి తెగుళ్ళు జబ్బులు వచ్చేవో అవన్నీ ఈ కంపెనీ విత్తనాలు వాడినా వచ్చాయి. దీంతో పాటు పంటకు మామూలుగా వచ్చే దిగుబడి కన్నా తగ్గిపోవటంతో రాష్ట్రంలో అనేకమంది పత్తి రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో పత్తి పంట వేసిన గ్రామాల్లో విషాదం తాండవించింది. పత్తి రైతుల పరిస్థితి చూసి చలించిపోయిన వై.యస్ రాజశేఖర రెడ్డి అమెరికా కంపెనీ అయిన మోనొశాంటో మీద తిరగబడ్డారు.
మోనోశాంటో కంపెనీ చెప్పిన ప్రకారం పంట దిగుబడి రాకపోగా, చెప్పిన దానికి విరుద్దంగా పత్తి పంటకు తెగుళ్ళు వచ్చి రైతులు పూర్తిగా పంట నష్టపోయారు కాబట్టి వారికి కంపెని నష్ట పరికారం ఇవ్వాల్సిందే అని కంపెనీపై ఒత్తిడి పెంచారు. ఈ నష్ట పరిహారాన్ని మొత్తం నాటి రాష్ట్ర ప్రభుత్వం 1250 కోట్లకు లెక్క కట్టింది. అలాగే BT విత్తనాలను కేవలం మోనోశాంటో కంపెనీ దగ్గర మాత్రమే కొనాలన్న పేటెంట్ హక్కులను ప్రశ్నిస్తూ నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్సార్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం Monopoly restrictive trade practices సంస్థలో కేసు దాఖలు చేసింది. మరో పక్క అధిక ధరలకు కంపెనీ విత్తనాలను అమ్మటానికి అభ్యంతరం చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా మోనోశాంటో కంపెనీ నిర్దేశించిన ధరలను సేకరించి భారత దేశంలో తప్ప మరే దేశంలో కూడా అధిక ధరలకు ఈ కంపెనీ విత్తనాలను అమ్మటంలేదని నిరూపించారు. అమెరికాలో కిలో 650, దక్షిణ ఆఫ్రికాలో 1800 కు అమ్మిన మొనోశాంటో కంపెనీ మన వద్ద మాత్రం కిలో 4500కు అమ్మి రైతులని దండుకుంటుందని ఇది అన్యాయం అని, ధర అమెరికా రైతులకు ఎంత నిర్దేశిస్తే అంతే ఇక్కడ కూడా ఉండాలని కంపెనీకి షరతు పెట్టారు.
వై.యస్ పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేని మొనోశాంటో కంపెనీ అధిపతులు అదే సమయంలో తమ దేశ అధ్యక్షుడు జార్జ్ బుష్ భారత దేశ పర్యటలో ఉండటంతో వారి సమస్యను పరిష్కరించాలని బుష్ ని కోరడంతో అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ వ్యాపారస్తులకు ఇతరేతర దేశాలలో ఇబ్బంది వచ్చినప్పుడు అధ్యక్షుడితో సహా ఏ ప్రభుత్వ ప్రతినిధైనా తమ పలుకుబడి వాడవచ్చు అనే నిబంధన ఉండటం, ఈ కంపెనీ ఎన్నికలకు నిధులు సమకూర్చడం, అలాగే 1961 -71 వరకు 10ఏళ్ళ వియత్నం యుద్దంలో ఏజెంట్ ఆరెంజ్ అనే కెమికల్ ను తయారు చేసి అమెరికా మిలటరీకి ఇచ్చి వియత్నంపై అమెరికా రసాయనిక యుద్దం చేసేందుకు సహకరించడం లాంటి అనుబంధంతో కంపెనీ ఇబ్బందులను పరిష్కరించడంకోసం బుష్ ఆనాడు ప్రణాళికలో లేకపొయిన హైదరాబాద్ వచ్చి వై.యస్ ని కలిసే ప్రయత్నం చేశారు.
అయితే తనను కలిసేందుకు వచ్చిన బుష్ అంతరంగం గ్రహించిన వై.యస్ తాను రైతుల పట్ల ఎంత నిబద్దతో ఉంటారో చెప్పేందుకు తనతో బుష్ సమావేశాన్ని ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఏర్పాటు చేసుకున్నారు. యూనివర్సిటీలో విత్తనాలు ఎలా రైతులు పండిస్తున్నారో, వాటిని ఎలా పరిశోధన చేస్తున్నారో, మహిళలు పావలా వడ్డితో స్వయం సమృద్ది ఎలా సాధిస్తున్నరో దగ్గరుండి మరీ చూపించి తాను రైతులకు వారి ఎదుగుదలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూపించారు. దీంతో వై.యస్ అంతరంగం తెలుసుకున్న బుష్, వై.యస్ ని ఉద్దేశించి అన్న మాట ” రాజశేఖర రెడి గారు మీరు ఎంత పాపులర్ ముఖ్యమంత్రో నాకు తెలియదు కాని మీరు నిజంగా ఒక గొప్ప రైతు నాయకుడు అని చెప్పారు. దీనికి అసెంబ్లీ రికార్డ్స్ యే సాక్ష్యం. అలాగే బుష్ తిరుగు ప్రయాణం అయిన గంటకే మోనోశాంటో కంపెనీతో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ఒక్క మాట తో బుష్ తో వై.యస్ మధ్య జరిగిన చర్చ అంశాన్ని అర్ధం చేసుకోవచ్చు. రైతుల శ్రేయస్సు పట్ల అంత మొండిగా వై.యస్ వ్యవహరించారు కాబట్టే వై.యస్ రైతు నాయకుడిగా ప్రజల మనస్సులని గెలుచుకున్నారు.