కేశినేని కాకుంటే మరెవరు?

ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా తాను పోటీ చేసేది లేదని తన కుమార్తె కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన కుమార్తె టాటా ట్రస్ట్ కు వెళ్లిపోయారని చేసిన ప్రకటన సంచలనం అయింది. వచ్చే ఎన్నికల్లో టిడిపి వేరే అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంది అని ఆయన పార్టీ అధిష్టానానికి సూచిస్తూ తాను పార్టీలో కొనసాగుతానని కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసేది లేదని స్పష్టత ఇచ్చారు.

కేశినేని నాని ఆ విధంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. విజయవాడలో 2014 కు ముందు పార్టీ ఎన్నో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్థికంగా అలాగే నాయకత్వ పరంగా పార్టీకి కేశినేని నాని అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అభివృద్ధి కోసం కేశినేని నాని పలువురు కేంద్ర మంత్రులను కలవడమే కాకుండా విజయవాడకు కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకురావటంలో కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు. అయితే రాష్ట్రంలో మాత్రం ఆయనకు తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందలేదు.

కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పరిచయాలు పెంచుకోవడానికి కేశినేని నాని ప్రయత్నాలు చేయడం చంద్రబాబు నాయుడుకి రుచించలేదు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అలాగే కొంతమంది చిన్న చిన్న నాయకులకు విజయవాడలో ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. దీనితో కేశినేని నాని పార్టీ అధిష్టానం తీరుపై బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. మాజీ మంత్రి దేవినేని ఉమా విజయవాడ అప్పటి మేయర్ కోనేరు శ్రీధర్ తో కలిసి తనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినట్లుగా కొంతమంది వద్ద కేశినేని నాని వ్యాఖ్యలు కూడా చేసినట్లుగా ప్రచారం జరిగింది.

Also Read : రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?

ఇక టీడీపీ కీలక నాయకులు కూడా కేశినేని నాని ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. పార్టీ అధిష్టానం విజయవాడ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఉన్నాసరే పట్టించుకునే ప్రయత్నం చేయకపోవడం కేశినేని నాని నిర్ణయానికి మరో కారణం అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావనకు వస్తుంది. పార్టీలో తనకు ఎలాగో ప్రాధాన్యత లేదు కాబట్టి వ్యాపారాలు మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా అంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు మీద ఉన్న గౌరవంతో కేసినేని ట్రావెల్స్ ను కేశినేని నాని మూసివేశారు. అయినా సరే పార్టీ ఆయనను పక్కన పడడంతో మళ్లీ వ్యాపారాలు మీద ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో ఒక హోటల్ కూడా ఆయన ఓపెన్ చేశారని, ప్రస్తుతం ఈ హోటల్ పనులు ఇంకా జరుగుతున్నాయని రాబోయే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో హోటల్ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అలాగే హైదరాబాదులో కూడా కొన్ని వ్యాపారాలను కేశినేని నాని ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు కేశినేని నాని తప్పుకున్న తర్వాత విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎవరిని ఖరారు చేస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. విజయవాడ పార్లమెంటు పరిధిలో పార్టీ సీనియర్ నేతలు వారి వారి నియోజకవర్గాలకు పరిమితమయ్యారు. చాలామంది విజయవాడ పార్లమెంట్ కు పోటీ చేయాలి అంటే ఆర్థికంగా బలంగా ఉండాలి అనే అభిప్రాయంతో ఉన్నారు. కేశినేని నాని వ్యాపారవేత్త కావడం ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కూడా కావడంతో చంద్రబాబు నాయుడు 2014 నుంచి ఆయనకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు.

Also Read : లగడపాటి పొలిటికల్ రీ ఎంట్రీ …?

కానీ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పార్టీ కేశినేని నాని కి మధ్య దూరం పెరిగింది. అయితే ఇప్పుడు కేశినేని నాని తర్వాత విజయవాడ పార్లమెంట్ కు మరో వ్యాపారవేత్తను చంద్రబాబు నాయుడు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విజయవాడ పార్లమెంటు సీటుకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త పేరు టీడీపీ అధినేత పరిశీలనలో ఉందని, అయితే చివరి నిమిషంలో ఆ పేరుని చంద్రబాబు నాయుడు ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు మీడియాలో ప్రచారం జరిగింది . కానీ గద్దె రామ్మోహన్ విషయంలో చంద్రబాబు నాయుడు అంత సానుకూలంగా లేరని, కచ్చితంగా విజయవాడ పార్లమెంటును ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడిని అలాగే సామాజిక వర్గాల లెక్కల ప్రకారం చూసుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి ఏంటి అనేది కాలమే చెబుతుంది.

అయితే విజయవాడలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీనపడుతోంది. దేవినేని అవినాష్ దూరమైన తర్వాత అలాగే చోటా మోటా నాయకులు లీడర్లు గా చలామణి కావడం… పార్టీకి పెద్ద దెబ్బ గా మారింది.. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమ, తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ ఉన్నా సరే నియోజక వర్గానికి పరిమితం కావడం అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇతర నాయకుల పెత్తనం ఎక్కువగా ఉండటం తెలుగుదేశం పార్టీ ని బాగా ఇబ్బంది పెడుతుంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కార్యకర్తలు కూడా విజయవాడలో పెద్దగా తిరగడం లేదు. మరి అధిష్టానం ప్రణాళిక ఎలా ఉందో చూడాలి.

Also Read : చేతులు కలిపిన నాని- రాధా , టీడీపీ గుండె జారి గల్లంతయ్యిందే

Show comments