ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన Wall.e – Nostalgia

  • Published - 08:46 AM, Wed - 18 December 19
ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన Wall.e – Nostalgia

తెలుగులో కార్టూన్ సినిమాలను అంతగా ఆదరించరు కానీ హాలీవుడ్ లో మాత్రం కార్టూన్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తాయి. హాలీవుడ్ లో Frozen, Finding nemo, Incredibles, The lion king, Toy story, Minions,Up,Coco  లాంటి సినిమాలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఆనిమేషన్ సినిమాలలో ప్రధానంగా ప్రతి పాత్ర మధ్య ఉన్నఎమోషనల్ బాండింగ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశిస్తుంది. సినిమాలో మాటలు అత్యంత తక్కువగా ఉండి, మనిషి చేస్తున్న తప్పులను అంతర్లీనంగా ఎత్తిచూపుతూ ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల హృదయాల్లో నిలిచిపోయిన కార్టూన్ మూవీ ఒకటి ఉంది. అదే WALL.E

కథ విషయానికి వస్తే 29వ శతాబ్దంలో మనుషుల అతి వినియోగం వల్ల భూమి మొత్తం వ్యర్ధాలతో నిండిపోయి ఎడారిగా మారుతుంది. ఆ వ్యర్ధాలను పోగు చేసి ఒక చోట పేర్చడానికి రోబోటిక్ ట్రాష్ కంపాక్టర్లను మనుషులు తయారు చేస్తారు. వ్యర్దాలను పోగు చేసి వాటిని బ్లాక్స్ గా క్రష్ చేస్తూ ఒకచోట పేర్చడం వాటి పని. అలా భూమి మొత్తం మీద మిగిలిన ఏకైక రోబోటిక్ ట్రాష్ కంపాక్టరే Wall.e. కాగా భూమిపై మొక్కలు బ్రతకడానికి అవకాశం ఉందో లేదో పరిశోధించడానికి Axiom అనే అంతరిక్ష నౌక నుండి Eve అనే మరో రోబోట్ వస్తుంది. మొక్కను వెతికే క్రమంలో Wall.e కి Eve కి మధ్య పరిచయం కలుగుతుంది.

కాగా Wall.e వ్యర్ధాలను క్రష్ చేసే క్రమంలో ఒక మొక్కను కనిపెడుతుంది. దాన్ని తను ఉండే చోటులో దాచిపెడుతుంది. Wall.e మరియు eve ల మధ్య పరిచయం పెరిగిన తరువాత eve కి wall.e మొక్కను బహుమతిగా ఇస్తుంది. వెంటనే మొక్కను గుర్తించిన eve మొక్కను తనలో దాచుకుని అంతరిక్ష నౌకకు సందేశం పంపిస్తుంది. తిరిగి అంతరిక్ష నౌకకు eve వెళ్లిపోతుండగా దాన్ని అనుసరిస్తూ wall.e కూడా అంతరిక్ష నౌకకు చేరుకుంటుంది. అంతరిక్షనౌకలో మనుషులు ఉంటారు. కానీ వాళ్ళు అత్యంత సోమరిపోతులుగా తమ పని తాము చేసుకోలేక యంత్రాలపై ఆధారపడుతూ ఉంటారు.

wall.e అంతరిక్ష నౌకకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది, మనుషులు తిరిగి భూమికి చేరుకున్నారా? wall.e మరియు eve ల మధ్య ఉన్న ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది మిగిలిన కథ. నిజానికి ఈ సినిమాలో మాటలు చాలా తక్కువ ఉంటాయి. కానీ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ wall.e మరియు eve ల ప్రేమలో పడిపోవడం ఖాయం. ఎందుకంటే ఇది భావోద్వేగ ప్రధాన చిత్రం. రోబోటిక్ సౌండ్స్, wall.e తన ప్రేమను వ్యక్తపరచడానికి eve దగ్గర పడే పాట్లు మనసును గిలిగింతలు పెడతాయి. ముఖ్యంగా సినిమా చివరలో wall.e చేసే త్యాగం wall.e ని కాపాడుకోవడానికి eve పడే తపన చూస్తే మనసులో కన్నీటి పొర రావడం ఖాయం.

మనిషిలో ఉన్న బలహీనతలను, వస్తువులను అతిగా వినియోగించడం వల్ల వచ్చే సమస్యలు, కార్పొరేట్ కంపెనీల్లో ఉండే లొసుగులను, మనుషుల మధ్య ఉండాల్సిన బంధాలను, సోమరితనం వల్ల వచ్చే పరిణామాలను, భవిష్యత్తులో భూమిపై వచ్చే మార్పులను మన కళ్ళకు కడుతుంది. ముఖ్యంగా ఇందులో రోబోటిక్ సౌండ్స్ ఆశ్చర్యం కలిగిస్తాయి. మాటలు తక్కువగా ఉండే ఈ సినిమా మనసుకు గిలిగింతలు పెడుతూనే భవిష్యత్తులో భూమిపై ఏర్పడే పరిణామాలను చూపిస్తుంది.

ఆండ్రు స్టాన్టన్ దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ & పిక్సర్ ఆనిమేషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ Wall.e మూవీ టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో ప్రథమ స్థానం దక్కించుకోగా, 21 వ శతాబ్దంలో రూపొందిన 100 గొప్ప చిత్రాల్లో 29వ స్థానం దక్కించుకుంది. ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్,హ్యూగో,సాటర్న్,నెబ్యులా అవార్డులతో పాటుగా ప్రేక్షకుల రివార్డులను కూడా కొల్లగొట్టింది Wall.e.. చరిత్రలో ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను స్పృశిస్తూ గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి. అలాంటి సినిమాలలో Wall.e కూడా ఒకటి. ఎవరైనా ఇంకా wall.e చూడకపోతే ఓ సారి చూసెయ్యండి. మళ్ళీ మళ్ళీ మీరే చూస్తారు.

Show comments