విజయవాడ టీడీపీ – కేశినేని ఒక వైపు,మిగిలిన ముగ్గురు మరో వైపు

రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల నగారా మోగింది. గత ఏడాది మార్చి 15న నాడు వాయిదా పడిన ఎన్నికల పోలింగ్ ఈసారి మార్చి 10న పూర్తి చేసేందుకు ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంది. అయితే ఇప్పటికే పంచాయితీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టుగా మారిన తరుణంలో కనీసం అర్బన్ లోనయినా కొంత పరువు నిలుపుకోవాలని టీడీపీ ఆశిస్తోంది.

ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల మీద కేంద్రీకరించింది. అందులోనూ విజయవాడ నగర పాలకసంస్థను కైవసం చేసుకుంటామని ఆశిస్తోంది. గత సాధారణ ఎన్నికల్లో విజయవాడ నగర పరిధిలో తూర్పు ఎమ్మెల్యే స్థానంతో పాటుగా ఎంపీ సీటుని కూడా టీడీపీ నిలబెట్టుకుంది. సెంట్రల్ సీటులో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యింది. అంతేగాకుండా ఇటీవల పాలనా వికేంద్రీకరణ ఫలితంగా విజయవాడ వాసుల్లో కొంత వ్యతిరేకత ఉంటుందని టీడీపీ ఆశిస్తోంది. సామాజికంగానూ, రాజకీయంగానూ ఉన్న ఈ సానుకూలతను సొమ్ము చేసుకుని గట్టెక్కాలని స్కెచ్ వేస్తోంది.

Also Read:ఉధృతమవుతున్న ఉక్కు ఉద్యమం

టీడీపీ ఆశిస్తున్నట్టుగా అనుకూలత ఉందా లేదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం పార్టీలోనే అంతర్గత పోరు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అధికారం కోల్పోయిన నాటి నుంచి అధినేత పట్ల కాస్త కారాలు, మిరియాలు నూరుతున్నట్టు కనిపిస్తున్న కేశినేని నానికి సెగ పెట్టేందుకు నగరంలోని కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో నారా లోకేష్ సన్నిహితుడిగా ఉన్న బుద్ధా వెంకన్నది ప్రధాన పాత్ర కావడంతో ఈ పోరు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే చర్చ మొదలయ్యింది. కేశినేని నాని కుమార్తె శ్వేత మేయర్ పదవి రేసులో ఉన్న తరుణంలో ఈ వైరం టీడీపీ కొంప ముంచుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నగరంలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీకి కొత్త కష్టాలు అనివార్యంగా భావిస్తున్నారు.

టీడీపీ నగర కార్యదర్శి పదవి కోసం ఏర్పడిన అనిశ్ఛితి వివాదానికి దారితీస్తోంది. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన తన అనుచరుడి పేరుని కేశినేని నాని ప్రతిపాదించారు. దానిని అంగీకరించని పశ్చిమ నియోజకవర్గ నేత నాగుల్ మీరా తనకు పోటీగా మరో నేతలను ఎలా రంగంలోకి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో బుద్ధా వెంకన్న కూడా నాగుల్ మీరాకి అండగా నిలవడం విశేషం. చివరకు బొండా ఉమా కూడా ఆ గూటిలో చేరడంతో కేశినేనికి వ్యతిరేకంగా టీడీపీలో బలమైన వర్గం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు కనిపిస్తోంది. వాస్తవానికి నానికి సెగ పెట్టేందుకు అధిష్టానంలోని కొందరు నేతలే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. బుద్ధా, బొండా కూడా రంగంలో దిగి నానికి వ్యతిరేకంగా పావులు కదపడం వెనుక కారణాలు అన్వేషిస్తున్నారు. కేశినేని కూడా తనకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రయత్నాలపై కుతకుతలాడుతున్నారు. తన కుమార్తె విజయానికి అడ్డంకులు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ వివాదం పెంచుతున్నారని ఆయన సందేహిస్తున్నారు.

Also Read:పార్టీ నేత‌ల‌న్నా త‌ర‌లి వ‌స్తారా..?

టీడీపీ వర్గపోరు ముదురుతున్న సమయంలో ఆపార్టీ శ్రేణుల మధ్య కూడా సఖ్యత కనిపించడం లేదు. ఇప్పటికే నాని కార్యాలయంలో బొండా, బుద్ధా వెంకన్న ఫోటోలను తొలగించారు. దానికి పోటీగా నాని ఫోటోలను తొలగించేందుకు బుద్ధా వెంకన్న వర్గం సిద్ధమవుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ వ్యవహారం తలొదిక్కు అన్నట్టుగా తయారయ్యింది. గతంలో కేశినాని ఆఫీసు వ్యవహారాలు చూసిన పట్టాభి ప్రస్తుతం పోటీగా మరో ఆఫీసు కూడా తెరిచారు. దానికి కూడా నారా లోకేష్ ఆశీస్సులున్నట్టు నాని వర్గం భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇటీవల పట్టాభి మీద దాడి జరిగిన సందర్భంలో కనీసం పరామర్శకు కూడా కేశినేని నాని సిద్ధం కాలేదు. ఆయన కుమార్తె కూడా ససేమీరా అన్నారు. దాంతో విజయవాడ టీడీపీ వ్యవహారం మూడు వర్గాలు, ఆరు శిబిరాలుగా మారుతోందనే అభిప్రాయం బలపడుతోంది.

Also Read:-బాబు పీకలమీదకు మరో ఎన్నికలు!!

వీటన్నింటికీ నారా లోకేష్ కారణమని కేశినేని నాని భావిస్తున్నారు. ఇప్పటికే తాను ఎంపీగా స్వతంత్ర్యంగా గళం వినిపించడం ఇష్టం లేని లోకేష్, రేపు తన కుమార్తె కి మేయర్ పదవి దక్కితే మరింత రెచ్చిపోతాననే ఆందోళనతో ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ పరిణామాలతో కేశినేని వర్గీయులు మునిసిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బహిరంగంగానే పెద్ద రచ్చ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని సమాచారం. గెలిచినా, గెలవకున్నా నాని, టీడీపీ అధిష్టానం మధ్య సాగుతున్న గల్ఫ్ ముదిరిపాకాన పడడం అనివార్యంగా భావిస్తున్నారు.

Show comments