iDreamPost
iDreamPost
ఓటిటిలో ఈ నెల 5న విడుదలైన వి ఫలితం నానికి గట్టి పాఠమే నేర్పినట్టుంది. ప్రయోగమంటే ఎప్పుడూ చేయని పాత్రను ఒప్పుకోవడం కాదు అసలు కథలో విషయం ఉందా లేదా అని చెక్ చేసుకోవడమని అర్థమయ్యింది. అమెజాన్ ప్రైమ్ తో డీల్ కాబట్టి దిల్ రాజు లాభాలు కళ్లజూశారు కానీ నేరుగా థియేటర్లలో వచ్చి ఉంటే గ్యాంగ్ లీడర్ కన్నా దారుణమైన ఫలితం వచ్చేదని విశ్లేషకులు ఓపెన్ గానే అంటున్నారు. ఇందులో నిజం లేకపోలేదు. ఒక మాములు రివెంజ్ డ్రామాకు స్టైలిష్ మేకింగ్ ని జోడించినంత మాత్రాన ప్రేక్షకులు థ్రిల్ అయిపోరనే విషయం తేటతెల్లమయ్యింది.
యూనిట్ ప్రమోషన్లు నాన్ స్టాప్ గా చేస్తూనే ఉంది కానీ ఆడియన్స్ అప్పుడే దీన్ని వదిలేసి కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక నాని విషయానికి వస్తే 2017లో ఎంసిఏ కమర్షియల్ గా భారీ సక్సెస్ అందుకున్నాక దాన్ని మించే బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయాడు. కృష్ణార్జున యుద్ధం బోల్తా కొట్టగా నాగార్జునతో కోరిమరీ చేసిన దేవదాస్ కూడా అదే ఫలితాన్ని అందుకుంది. జెర్సీ విమర్శకుల మెప్పు, ఆడియన్స్ తో క్లాప్ కొట్టించుకున్నా ఫైనల్ గా బయ్యర్లు మరీ కనక వర్షంలో తడిసిపోయేంత సీన్ కనిపించలేదు. ఇక గ్యాంగ్ లీడర్ కథ సరేసరి. ఇప్పుడు వి వంతు వచ్చింది. తాను ఒకటి తలిస్తే చూసేవాళ్ళు ఇంకేదో కోరుతున్నారని గుర్తించిన నాని ఇప్పుడు పెండింగ్ లో ఉన్న టక్ జగదీశ్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారట.
ఎలాగూ ఖాళీ టైం దొరికింది కాబట్టి దర్శకుడు శివ నిర్వాణతో కొన్ని కీలకమైన మార్పులు ఇప్పటికే ఫైనల్ చేసినట్టు సమాచారం. మాములుగా నాని మేకింగ్ లో, స్క్రిప్ట్ లో తలదూర్చడని పేరుంది. అయితే ఇప్పుడు తప్పడం లేదు. మరీ గుడ్డిగా దర్శకులను నమ్మడం కూడా దెబ్బ కొడుతోంది. అందుకే టక్ జగదీశ్ లో ఎమోషనల్ డ్రామా కొంచెం ఎక్కువయ్యిందని భావించి దాన్ని ట్రిమ్ చేసి ఆ స్థానంలో తన క్యారెక్టర్ కు ఫన్ జోడించమని చెప్పినట్టు తెలిసింది. అన్నదమ్ముల మధ్య భావోగ్వేగాలను కథాంశంగా తీసుకున్న శివ నిర్వాణ నిన్ను కోరి, మజిలీ తరహాలోనే దీన్ని కూడా ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతున్నారట. మొత్తానికి వి దెబ్బకు జగదీష్ తన ఇన్ షర్ట్ ని సర్దుకోవాల్సి వచ్చేలా ఉంది. ఇది పూర్తయ్యాక శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ మొదలవుతుంది. రెండూ వచ్చే ఏడాదే విడుదలవుతాయా లేదా అనేది వేచి చూడాలి.