అవును నిజమే.. ‘అరిషడ్వర్గాలు’ అంటే ఇవే..!

కాస్తంత ఖాళీ దొరికిందని వాట్సాప్, ఫేస్బుక్, వెబ్‌సైట్‌లలో మునిగా. టచ్‌ స్క్రీన్‌మీద వేగంగా వేలు కదులుతూ ఉంటే.. అప్పుడెప్పుడో పాత మిత్రుడొకరు పెట్టిన మెస్సేజ్‌ దగ్గర వేళ్ళూ, కళ్ళూ ఆగిపోయాయి. అరిషడ్వర్గాలు అంటే ఏంటి, వాటి కారణంగా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది? వాటికి లోనైతే ఫలితాలు ఏంటి? అన్నది సదరు మెస్సేజ్‌ సారాంశం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను అరిషడ్వర్గాలంటారు.

1) కామం.. అంటే అవసరాలకు మించి కోరికలు కలిగి ఉండడం. అంటే ఎన్నికలకు ముందు ఆంధ్రరాష్ట్రంలోనే అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ, అక్కడెక్కడో చక్రం తిప్పుతానంటూ తిరగడం, సొంత మీడియాతో మీకంటే తోపెవరూ లేరు, మీరే ఇక అన్నీ అంటూ ప్రచారం చేసుకోవడం.

2) క్రోధం: అంటే కోపం.. తాను గెలవకపోవడానికి పార్టీ కార్యకర్తలు, ప్రజలే కారణం అంటూ రగలిపోవడం. తానెంతో చేసినా ప్రజలు పట్టించుకోలేదని నిట్టూర్చడం. రోడ్లేసా.. పెన్షన్లిచ్ఛా, రుణమాఫీ చేసా.. నన్ను గెలిపించకపోతే మీకే నష్టం అంటే ప్రజలకే బాధ్యలు అప్పగించడం.

3) లోభం:తాను పొందినది తనకే సొంతమని భావించడం. ఏదో కొత్తరాష్ట్రం, వయస్సు ఉందికదా అని ప్రజలు ఇచ్చిన పదవి తనకే శాశ్వతమని, అది తనశక్తేనని నమ్మడం. అన్ని వర్గాలను పట్టించుకోకుండా తానే అన్నీ అంటూ విర్రవీగడం. తన బాధలు చెప్పుకోవడానికి వచ్చిన వారిని నిందలాడడం.

4) మోహం: తాను కోరుకున్నది తనకే రావాలి అనుకోవడం.. తాను సీయం అవుదామనుకుంటే ఇంకెవరో ఆ కుర్చీలోకి రావడం తట్టుకోలేకపోవడం. తనకాక్కకుండా వేరొకరికి ఆ అవకాశాన్ని ప్రజలు ఇవ్వడాన్ని భరించలేకపోవడం.

5) మదం అంటే అహం.. తాను అధికారంలోకి రావడం తన గొప్పదనేమని. ఇతర వర్గాల ప్రభావం ఏమీ లేదని, వారిని చిన్నచూపు చూడడం. ఎస్సీలుగా ఎవరు పుడదామనుకుంటారు, బీసీలు జడ్జీలుగా పనికిరారు, ఓడిపోయే సీటు మాత్రమే వెనుకబడిన వర్గాలకు ఇవ్వడం, ఇచ్చిన మాట నెరవేర్చండి అడిగిన వారిని ఇంట్లోని ఆడవాళ్ళతో సహా దౌర్జన్యం చేయండం లాంటివి.

6) మాత్సరం అంటే తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదనుకోవడం.. ప్రజలే తనను ఏకపక్షంగా పక్కనెట్టేసారు. నలభయ్యారేళ్ళ కుర్రాడ్ని నెత్తినెట్టేసుకుంటున్నారు. డైరెక్టుగా ఏం చేద్దామన్నా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. పెంపుడు మీడియాతో బురదజల్లే ప్రయత్నాలు చేయడం. వాళ్ళేమో మోకాలికి, బోడిగుండికి ముడెట్టి వార్తలు వండివార్చడం. గతంలో తాము చేసింది సంసారమని ఇప్పుడే తేడా జరిగిపోతోందని నెత్తీనోరు కొట్టుకోవడం.

అమ్మ బాబోయ్‌.. (నేనెవర్నీ ప్రస్తావించడం లేదండోయ్‌!) ఇవన్నీ ప్రజల కళ్ళముందు జరిగినవే కదా. వాళ్ళంతా చూసిందే కదా.

ఉపసంహారం.. : 
అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకుంటేనే మనిషి అనుకున్న స్థాయికి చేరతాడు. (అంత వయస్సు ఉన్నట్టు లేదు). లేకపోతే పతనం తప్పదు. ఒక్కసారి ఊపిరి గుండెల నిండా పీల్చుకుని మెస్సేజ్‌పెట్టిన మిత్రుడ్ని గుర్తు చేసుకున్నాను. మీ కెవరైనా గుర్తుకొస్తే మాత్రం మాది బాధ్యత కాదండోయ్‌!

Show comments