అడ్డుకున్న భారం మోయాల్సింది వారేనా!

పేదలకు ఇంటిస్థలం, ఇల్లు సమకూర్చుకోవడం జీవితాశయంగా ఉంటుందనడంలో ఎటువంటి మారుమాటకు అవకాశం లేదు. జీవిత కాలం కష్టపడి సెంటు భూమినైనా సంపాదించుకునేందుకు శక్తివంచన లేకుండా కుటుంబం మొత్తం కృషి చేస్తారు. అయితే వారి కష్టాన్ని గౌరవిస్తూ ప్రభుత్వమే వారికి ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేస్తే వారి ఆనందానికి అవధులుండవు. అలా స్థలం, ఇల్లు మంజూరు చేసిన వాళ్ళ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతను వారు చూపిస్తూనే ఉంటారు.

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ పేదల ఆ ఆకాంక్షలను తీర్చడం తన బాధ్యతగా భావించి ఇంటి స్థలం, ఇల్లు ఇస్తానని హామీగా ఇచ్చారు. అధికారంలోకొచ్చిందే తడవుగా పేదలకు వాటిని అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేసారు. దాదాపు ఇరవైవేల కోట్ల రూపాయల విలువైన ఆస్థిని మహిళల పేరిట పట్టాలుగా అందజేసేందుకు సర్వం సిద్ధం చేసారు.

అయితే ప్రతిపక్ష పార్టీలకు ఇక్కడే కన్నుకుట్టింది. దీన్ని అడ్డుకోక పోతే భవిష్యత్తు ఉండదన్న ఉలిక్కిపాటుకు గురయ్యారు. దీంతో కోర్టు గడప తొక్కారు. అక్కడ స్టే తెచ్చుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన ఇళ్ళ పట్టాల పంపిణీ నిలిచిపోయింది. అయితే ఇక్కడ పట్టా ఇస్తానన్న జగన్‌ను ప్రజలు గుర్తు పెట్టుకున్నట్టే, దీనిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలను కూడా ప్రజలు గుర్తు పెట్టుకుంటున్నారు.

ఏళ్ళ తరబడి ఇంటి అద్దెలు కట్టుకుంటూ బ్రతుకీడుస్తున్న వారిలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇల్లంటూ ఉంటే కలోగంజో తాగి అందులో ఉండొచ్చన్న చిన్నపాటి తమ కోరికను కూడా అడ్డంగా అడ్డుకుంటున్న ప్రతిపక్ష నాయకులపై తమ కడుపుమంటను వెళ్ళగక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే ఇంటి ముందు పేదల ఆందోళనకు ఈ తరహా పరిస్థితే కారణం.

నిజానికి ప్రభుత్వం అమలు చేసే పథకాల్లో ఏమైనా లోటు పాట్లు ఉంటే వాటి ద్వారా వచ్చే వ్యతిరేకత ప్రభుత్వం మీదే నేరుగా పడుతుంది. గతంలో నారా చంద్రబాబు నాయుడి హాయంలో పథకాల అమలులో జన్మభూమి కమిటీల ఇష్టారాజ్యం కారణంగానే ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. వారి ఆగ్రహం ఓట్ల రూపంలో చూపిండంతోనే టీడీపీ చరిత్రలో ఎప్పుడలేని పతన స్థాయిని చూడాల్సి వచ్చింది. అంటే ప్రజలు తమకు నచ్చనిదానిని స్వయంగానే వారే చెబుతారు. వారి తరపున భుజానేసుకునే బాధ్యతను ఇంకొకరు తీసుకునే అవకాశం ఇవ్వరు.

జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ విషయంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే ప్రజలే ఆ విషయాన్ని చూసుకునుండేవారు. ఒక వేళ అక్కడి లోటు పాట్లు కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను ప్రచారం చేయడం ద్వారా ప్రతిపక్షాలు కూడా ప్రయోజనం పొందేందుకు అవకాశం లభించేది. కానీ ఆదిలోనే అడ్డుకోవడం కారణంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొవాల్సిన పరిస్థితిని ప్రతిపక్షాలే తమకుతాము సృష్టించుకున్నాయన్నది పరిశీలకుల మాటగా విన్పిస్తోంది. ఒక వేళ ఇదే కరెక్ట్‌ అయితే తాము ఏ ప్రయోజనం ఆశించి ఇళ్ళ పట్టాలను అడ్డుకున్నప్పటికీ, దానికి విరుద్ధమైన ఫలితాలను మాత్రం ప్రజల నుంచి ప్రతిపక్షాలు పొందక తప్పదు. ఇందుకు అనపర్తి ఘటననే ఒక ఉదాహరణగా కూడా చెప్పొచ్చు.

Show comments