షోలే, ఒక మ‌రిచిపోలేని జ్ఞాప‌కం – Nostalgia

మిత్రుడు ర‌వీంద్ర శ్రీరాజ్ షోలే సినిమా మీద ఒక పోస్ట్ పెడితే ఇది రాయాల‌నిపించింది. షోలే అంటే ఒక భూతం. న‌న్ను అవ‌హించి 46 ఏళ్ల‌య్యింది.

స్క్రిజిఫినియా , పారానొయా ఇవి మాన‌సిక జ‌బ్బులు. వీటితో పాటు షోలేమానియా అనే జ‌బ్బు కూడా ఉంది. ప్ర‌పంచ‌మంతా ఈ వ్యాధిగ్ర‌స్తులున్నారు. వాళ్ల‌లో నేనూ ఒక‌న్ని.

అతిశ‌యోక్తిగా ఉంటుంది కానీ, దీన్ని క‌నీసం వెయ్యి సార్లు చూసి వుంటాను. థియేట‌ర్ల‌లో , వీడియో క్యాసెట్ల‌లో సీడీలు, డీవీడీలు , యూట్యూబ్‌. కొన్నేళ్ల పాటు ప్ర‌తి రోజూ ఎంతోకొంత చూశాను. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే యూట్యూబ్‌లో టైటిల్ మ్యూజిక్ వింటాను. కొంచెం గ్యాప్ వ‌చ్చింది కానీ, ఒక‌ప్పుడైతే సీన్ చెబితే అక్క‌డ వ‌చ్చే మ్యూజిక్ , ఇన్‌స్ట్ర్‌మెంట్స్ పేర్లు కూడా చెప్పేవాన్ని. హేమ‌మాలిని గుర్ర‌బ్బండి ఛేజ్‌లో వాడిన త‌బ‌లాలు ఇప్పుడూ కూడా చెవుల్లో వినిపిస్తున్నాయి. బీభ‌త్సానికి త‌బ‌లాలు వాడ‌డం అంత‌కు ముందు తెలియ‌దు. R.D.బ‌ర్మ‌న్ పిచ్చోడు క‌దా, ఏది ప‌డితే అది వాడి సినిమాకి ప్రాణం పోసాడు.

లోకంలో ఉన్న పిచ్చోళ్లంతా క‌లిసి ఈ సినిమాకి ప‌ని చేశారు. Perfectionistలు లోకం దృష్టిలో పిచ్చోళ్లే. అంజ‌ద్‌ఖాన్ గొంతు కీచుగా ఉంది, అత‌న్ని మార్చ‌మ‌ని ఎంద‌రు చెప్పినా విన‌ని డైరెక్ట‌ర్ ర‌మేశ్ సిప్పీ ఒక పిచ్చోడు. కొడుకుని న‌మ్మి 1975లో 3 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు పెట్టిన జీపీ.సిప్పీ ఇంకో పిచ్చోడు (క్లాస్ టికెట్ రూ.2 ఉన్న కాలం). గ‌బ్బ‌ర్ సింగ్ క్యారెక్ట‌ర్‌ని త‌న‌కు ఇవ్వ‌మ‌ని అడిగిన సంజీవ్‌కుమార్ వెర్రోడు. ఫ్రేమ్ స‌రిగా రాక‌పోతే కెమెరా వ‌దిలేసి అలిగి వెళ్లిపోయే కెమెరామ‌న్ ద్వార‌క్ దివేచా వెర్రిబాగులోడు.

1975లో నేను నైన్త్ క్లాస్‌. ర‌ఫీ అని SI కొడుకు డ‌బ్బులుండేవాడు. బ‌ళ్లారికి వెళ్లి ఈ సినిమా చూసేశాడు. పూన‌కం ప‌ట్టిన‌ట్టు అంద‌రికీ క‌థ చెప్పేవాడు. బ్యాడ్ నెరేష‌న్‌. క‌థ ఎలా చెప్ప కూడ‌దో వీడి ద‌గ్గ‌రే నేర్చుకున్నా. షోలే చూడాలి. బ‌ళ్లారికి వెళ్లే డ‌బ్బుల్లేవు. క‌ల‌వ‌రించి ప‌ల‌వ‌రించినా 1977 ఆగ‌స్టు వ‌ర‌కూ చూడ‌లేక‌పోయాను. అనంత‌పురం త్రివేణి టాకీస్‌లో రూ.1.50 పైస‌ల క్లాస్‌లో కూచున్నా. మొద‌టి రైలు దోపిడీ సీన్‌తో మైండ్ పోయింది. హిందీ రాదు. నా బుద్ధికి కాదు, మ‌న‌సుకి సినిమా అర్థ‌మైంది. త‌ర్వాత ఏ ఊళ్లో షోలే ఉంటే అక్క‌డికెళ్లి చూశాను. బెంగ‌ళూరు సంతోష్‌లో 70mm ప్రింట్ చూడ‌డం ఒక రికార్డు అయితే, బ‌ళ్లారి న‌ట‌రాజ్‌లో థ‌ర్డ్ ర‌న్ రూ.20ల బ్లాక్‌లో కూడా టికెట్ దొర‌క్క‌పోవ‌డం ఇంకో రికార్డు.

షోలేలో ఏముందో నాకు తెలియ‌దు. ఏం లేదో ఇప్ప‌టికీ తెలుసుకోలేక పోయాను. బెంగ‌ళూరులో షోలే స‌ర్కిల్ ఉంది. ఒక హోట‌ల్‌లో షోలే దోసె అమ్ముతారు. ఈ మ‌ధ్య మైసూరు వెళుతూ రాంన‌గ‌ర్‌లో ఆగితే ఒక అపార్ట్‌మెంట్ పేరు రాంఘ‌డ్‌. షోలే పిచ్చోళ్లు అంత‌టా ఉన్నారు.

చూస్తూ ఉండ‌గానే 46 ఏళ్లు గ‌డిచిపోయాయి. హేమ‌మాలిని, జ‌య‌బాదురి చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్నారు. ధ‌ర్మేంద్ర‌, అమితాబ్ రాజ‌కీయాలు వ‌దిలేశారు. అంజ‌ద్ మ‌రీ తొంద‌ర‌గా పోయాడు. సంజీవ్‌కుమార్ ఏదో దుక్కాన్ని మోయ‌లేక తాగితాగి పోయాడు. ర‌మేశ్ సిప్పీ జీవిత కాలంలో మ‌ళ్లీ షోలేని రిపీట్ చేయ‌లేక‌పోయాడు. స‌లీం జావెద్ విడిపోయారు.

గ‌బ్బ‌ర్ కాల్చే ముగ్గురిలో ఒక‌రు కాలియా (విజుకొటే) ఈ మ‌ధ్య‌నే పోయాడు. ఒక రోజు విజు బొంబాయిలో న‌డుస్తుంటే జ‌నం కాలియా అని వెంట‌ప‌డ్డారు. ఆ ఒక్క క్యారెక్ట‌ర్ అత‌న్ని జీవితాంతం పోషించింది.

రామ్‌లాల్‌గా చేసిన స‌త్యెన్‌క‌పూ 2007లో చ‌నిపోయాడు. వికాస్ ఆనంద్ సినిమాల్లో చేసిన షోలే జైల‌ర్‌గానే గుర్తు. ఇంకో జైల‌ర్‌గా వేసిన ఆస్రాని కొంత కాలం హీరోగా చేసి హాస్య‌న‌టుడిగా ఫిక్స్ అయ్యాడు. సాంబాగా వేసిన మెక్‌మోహ‌న్ 2010లో చ‌నిపోయాడు. ప్ర‌తి చిన్న క్యారెక్ట‌ర్ కూడా గుర్తే.

ఈ సినిమా బ్లాక్ టికెట్ అమ్మిన వాళ్లు కూడా ఇల్లు క‌ట్టుకున్నారంటే అది నిజం. క్యాంటీన్‌లు పెట్టుకున్నోళ్లు కూడా షాపుకార్ల‌యి పోయారు.

షోలేకి ప‌నిచేసిన వాళ్లు చాలా మంది చ‌నిపోయారు. షోలే ఎప్ప‌టికీ బ‌తికి ఉంటుంది. ఎందుకంటే అంద‌రూ ప్రాణం పెట్టి ప‌నిచేశారు కాబ‌ట్టి.

Show comments