iDreamPost
iDreamPost
సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి స్వయానా మామయ్య అయిన శతృచర్ల చంద్రశేఖరరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. చినమేరంగి జమీందార్, సీనియర్ నేత,మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు సోదరుడిగా రాజకీయం రంగప్రవేశం చేసిన చంద్రశేఖర్ రాజు 1989 నుంచి ఐదేళ్లపాటు అప్పటి నాగూరు నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.1989 జమిలి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విజయరామరాజు పార్వతీపురం లోక్ సభకు పోటీచేసి గెలిచారు, అన్న లోక్ సభకు పోటీ చేయటంతో తమ్ముడికి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం దక్కింది.
శత్రుచర్ల సోదరులకు మన్యంలో మంచి పట్టు ఉంది. చంద్రశేఖరరాజుకు మన్యంలోని నాలుగైదు మండలాల్లో మంచి పట్టుంది. మాస్ నాయకుడిగా అప్పటి తరానికి బాగా దగ్గరయ్యారు. కురుపాం,గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, గరుగుబిల్లి, పార్వతీపురం, జియమ్మ వలస మండలాల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
Also Read:ఎన్నికలకు ముందు నంబర్ గేమ్.. రసకందాయంలో పుదుచ్చేరి రాజకీయం
1999 అసెంబ్లీ ఎన్నికల్లో విజయరామరాజు మీద ఓడిపోయినా టీడీపీ అభ్యర్థి నిమ్మక జయరాం కోర్టుకు వెళ్లారు. ఆ కేసును విచారించిన హైకోర్టు శత్రుచర్ల విజయరామరాజు ఎస్టీ కాదని తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్టీ నియోజకవర్గమైన పూర్వ నాగూర్, ప్రస్తుత కురుపాం నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు వీరు అర్హతను కోల్పోయారు. కాంగ్రెస్ తరుపున 2004లో పార్వతీపురం నుంచి,2009లో పాతపట్నం నుంచి గెలిచిన శత్రుచర్ల విజయరామ రాజు 2019 ఎన్నికల్లో మాత్రం పాతపట్నం నుంచి పోటీచేసి ఓడిపోయారు.
2014 ఎన్నికల సమయంలో సోదరులు పార్టీల పరంగా విడిపోయారు. విజయరామరాజు టీడీపీలో ఉండగా చంద్రశేఖర్ రాజు కుటుంబం వైసీపీలో చేరారు. సొంత నియోజకవర్గం నుంచి పోటీచేయాలన్న తలంపుతో చంద్రశేఖర్ రాజు రంపచోడవరం మండలానికి చెందిన గిరిజన అమ్మాయి పుష్ప శ్రీవాణీకి తన కుమారుడైన పరీక్షిత్ రాజు (అరకు లోక్ సభ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి) తో పెళ్లి చేసి, తమ ఇంటికి కోడలిగా చేసుకున్నారు.
2014 ఎన్నికల్లో శత్రుచర్ల సోదరుల మేనల్లుడు, విజయరామరాజు రాజకీయ వారసుడు జనార్ధన్ థాట్రాజ్ టీడీపీ తరుపున,చంద్రశేఖర్ రాజు కోడలు పుష్పశ్రీవాణి వైసీపీ తరుపున పోటీచేశారు. ఆ ఎన్నికల్లో చంద్రశేఖర్ రాజు గట్టిగా పనిచేయటం, మరోవైపు విజయరామ రాజు పాతపట్నం నుంచి పోటీలో ఉండటంతో పూర్తిస్థాయిలో కురుపాం మీద దృష్టి పెట్టలేకపోవటం,మన్యం ప్రాంతంలో వైసీపీ గాలి వీయటం తదితర కారణాలతో పుష్ప శ్రీవాణి గెలిచారు.
పెరిగిన దూరం !
కోడలు పుష్పశ్రీవాణి ఎమ్మెల్యే అయిన తరువాత నుంచి చంద్రశేఖరరాజుకు తన కొడుకు, కోడలితో సరిగ్గా సఖ్యత కుదిరేది కాదు. తన మాట చెల్లాలని, తన అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వాలనేది అయన తీరు. పుష్పశ్రీవాణి ప్రజలతో మమేకం కావటం, స్వయంగా గ్రామాలూ తిరుగుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయటంతో ఆవిడకు ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చింది.
Also Read:ఆడలేక మద్దెల దరువు : కుప్పంలో ఓడింది టీడీపీ కాదట!
పుష్పశ్రీవాణి తీరు చంద్రశేఖర్ రాజుకు నచ్చేది కాదు, కోడలు ఇంటికే పరిమితం అవ్వాలని, తాను రాజకీయం చేయలని భావించేవారు. ఇప్పుడంతా జగన్ మోహన్ రెడ్డి సీజన్, మా విధానం, వేరు, మా క్యాడర్ వేరు అన్నది ఈ దంపతుల సమాధానం. మొత్తానికి ఈ విధంగా కొడుకు, కోడలివద్ద సర్దుకుని ఉండలేక ఆయన, ఆయన్ను భరించలేక శ్రీవాణి దంపతులు ఇబ్బందిపడ్డారు
2017లో టీడీపీలో చేరిక
కొడుకు కోడలితో విభేదించి చివరికి 2017 డిసెంబర్లో వైసీపీని వీడి చంద్రశేఖర్ రాజు టీడీపీలో చేరారు. టీడీపీలోనే ఉన్న సోదరుడు విజయరామరాజుతో కలిసి కోడలికి వ్యతిరేకంగా రాజకీయం నడిపారు. మేనల్లుడు, 2014 టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ కూడా ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వటంతో తన బంధువులకు టీడీపీ టికెట్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యి విజయరామరాజు సోదరికి టీడీపీ టికెట్ దక్కకటంతో టీడీపీని వీడి తిరిగి వైసీపీలో చేరారు.
2019 ఎన్నికల గెలుపు
2019 ఎన్నికల్లో పుష్పశ్రీవాణి విజయం నల్లేరు మీద నడకగా సాగింది . విజయనగరం జిల్లాలో టీడీపీ ఒక్క సీటు గెలవలేదు. జగన్ ప్రభుత్వంలో పుష్పశ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవితో మంచి గుర్తింపు దక్కింది.రెండవసారి ఎమ్మెల్యే అయినా పుష్పశ్రీవాణి మరింత స్వతంత్రంగా పనిచేయటంతో మరోసారి కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయి.
Also Read:శాసనమండలిలో ప్రభుత్వానికి ఇకపై ఇబ్బందులు ఉండవు …
గత ఏడెనిమిది నెలలుగా నిత్యం పుష్పశ్రీవాణి మీద విమర్శలు చేస్తున్న చంద్రశేఖర్ రాజు వైఖరికి నిరసనగా గత జూన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ తండ్రి వైఖరిని ఖండించారు. చంద్రశేఖర్ రాజు అప్పట్లోనే వైసీపీని వీడారని ప్రచారం కూడ జరిగింది.
ఇప్పటికి పలుమార్లు అయన కొడుకుతో విభేదాలు వచ్చి బయటకు వెళ్లడం. మళ్లీ సర్దుబాటు చేసుకుని రావడం అలవాటు గా మారింది. అయితే ఇప్పుడు మాత్రం వెళుతూ వెళుతూ కొన్ని రాజకీయ విమర్శలు చేశారు. అపరిమిత సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అథోగతి పాల్జేస్తాయని అన్నారు. సంక్షేమ పథకాలను తీసేస్తామని వాలంటీర్లతో భయపెట్టి ప్రజల చేత బలవంతంగా ఓట్లు వేయించుకుని పంచాయతీలు గెలుచుకున్నారని అన్నారు. తన భవిష్యత్ కార్యక్రమం త్వరలో ప్రకటిస్తానని అన్నారు.
మొత్తానికి అయన పార్టీని వీడడం వార్తే కానీ ఇలా పార్టీని వీడడం ఇది ఎన్నో సారి అన్నది ఈ జిల్లా ప్రజలు చెప్పలేకపోవడం గమనార్హం. జగన్ అంటే అభిమానం ఉన్న రాజు ఇప్పుడు కూడా పార్టీని వీడారు అనడం కన్నా మళ్లీ కొడుకు, కోడలితో గొడవపడ్డారని చెప్పడమే అర్థవంతంగా ఉంటుంది.
వైసీపీని శాశ్వతంగా వీడుతున్నానని ప్రకటించిన శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు రాజకీయంగా ఏమి చేస్తారో చూడాలి.