జగన్ పది కాలాలు అధికారంలో ఉండాలన్న టిడిపి సీనియర్ నేత

అవును విచిత్రంగానే ఉంది వినటానికి, చదవటానికి కూడా. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకాదు, అనుభవం లేదు అంటూ ప్రతిరోజు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్న విషయం అందదరికీ తెలిసిందే. నిజానికి చంద్రబాబునాయుడు ఆలోచనలు ఎలాగున్నాయంటే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో మళ్ళీ మధ్యంతర ఎన్నికలు వస్తే బాగుణ్ణు అనేట్లుగా మాట్లాడుతున్నాడు. 

కానీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ జగన్ పదికాలాల పాటు అధికారంలో ఉండాలని కోరుకున్నాడు. ఇదే రాయపాటి బుధవారం “కమ్మవాళ్ళు అనుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని”,కమ్మవాళ్ళు ఏమి చేయలేరని అనుకోవద్దని మీడియా ముందు హెచ్చరిక ధోరణిలో మాట్లాడటం గమనార్హం.

రాయపాటి గురువారం మళ్ళీ మీడియా సమావేశం పెట్టి తాను జగన్ ను ఉద్దేశించి తానూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని వివరణ ఇచ్చుకున్నారు.జగన్ గురించి తాను అనని మాటలు అన్నట్లుగా మీడియాలో రావటంతో తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు కూడా చెప్పుకున్నారు. రాజకీయ నేతలు ఆవేశంలో ఏదో ఒకటి అనేయటం తర్వాత వివాదాస్పదమవ్వగానే తాను అలా అనలేదని మాట మార్చటం మామూలే. కానీ ఎలక్ట్రానిక్ మీడియా స్పీడయిపోయిన తర్వాత అలా తప్పించుకోవటం ఇపుడు సాధ్యం కాదు. రాయపాటి వ్యాఖ్యలను ఆంధ్రజ్యోతితో సహా అన్ని ఛానల్స్ ప్రసారం చేశాయి… రాయపాటి ప్లేట్ ఫిరాయించి తన వ్యాఖ్యలు మీడియా వక్రీకరించిందని ఎంత వాదించిన అది నిష్ప్రయోజనం.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ పది కాలాలపాటు అధికారంలో ఉంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలని మాత్రమే సలహా ఇచ్చినట్లు రాయపాటి చెప్పుకొచ్చారు. జగన్ ను ఎప్పుడెప్పుడు దింపేసి తాను అధికారంలోకి వచ్చేద్దామా అని చంద్రబాబు ఆతృత పడుతుంటే మరి సీరియన్ నేతేమో జగన్ పదికాలాల పాటు అధికారంలో ఉండాలని కోరుకోవటం ఏమిటో టిడిపి నేతలకు ఎవరికీ అర్ధం కావటం లేదు. పైగా రాయపాటి మాటలను ఎల్లోమీడియానే ప్రముఖంగా ప్రచురించటం గమనార్హం. మొదటిసారి మాట్లాడిందానికి వివరణగా రెండోసారి ప్రెస్ మీట్ పెట్టాడు. మరి రెండోసారి జగన్ పదికాలాల పాటు అధికారంలో ఉండాలన్న మాటకు వివరణగా మూడోసారి మళ్ళీ మీడియా సమావేశం పెడతాడో ఏమిటో ?

Show comments