Idream media
Idream media
రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు గాను తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ నలుగురిలోనూ చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తి వైసీపీ గూటికి చేరారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కొంత కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎదురీదుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
జిల్లాలో 1011 పంచాయతీల్లో ఎన్నికలు జరగగా తెలుగుదేశం కేవలం 155 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. వైసీపీ ఏకంగా 817 స్థానల్లో విజయ దుందుభి మోగించింది. అత్యధిక స్థానాల్లో టీడీపీ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుస పరాజయాలు, వైఫల్యాలు టీడీపీ ముఖ్య నేతలను అంతర్మథనంలో పడేశాయి. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారింది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సాహసం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019 సార్వత్రిక ఎన్నికలు, ఇటీవల పంచాయితీ ఎన్నికల్లోనూ ఘోర ఓటమి తర్వాత భయాందోళనలో ఉన్న టీడీపీకి పురపాలక సంఘాల ఎన్నికలలో అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెట్టలేకపోవడంతో మూలిగే నక్కపై తాటికాయపడ్డ చందంగా మారింది.
అక్కడ అభ్యర్థులు కరువు
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్సీ పోతుల సునీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు మద్దతు తెలపడం, కరణం తనయుడు వెంకటేశ్, మాజీ మంత్రి పాలేటి రామారావు టీడీపీని వీడి వైఎస్సార్ సీపీలో చేరడంతో చీరాల టీడీపీ ఖాళీ అయింది. దీంతో అక్కడ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారు. చీరాల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా 13 వార్డుల్లో టీడీపీ తరఫున ఎవరూ బరిలోకి దిగలేదు. ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన వారు సైతం పోటీ నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి వంటి చోట్ల సైతం టీడీపీకి అభ్యర్థులు దొరకక అనామకులతో నామినేషన్ వేయించారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేనాటికి సగం మందికి పైగా పోటీ నుంచి తప్పుకుంటారనే విషయం టీడీపీ నేతలకు స్పష్టంగా తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నారు.
వారిని కాపాడుకోవడానికి తంటాలు
పంచాయతీ ఎన్నికల్లో తన మద్దతుదారులతో కనీస పోటీ ఇవ్వలేకపోయిన టీడీపీ.. మున్సి‘పోల్’ సమరానికి ముందే ఢీలా పడింది. పంచాయితీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా స్థానాల్లో సత్తా చాటిన వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయదుందుభి మోగించేందుకు దూకుడు పెంచింది. జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో వైఎస్సార్ సీపీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయగా టీడీపీ తరఫున పోటీ చేసే వారు కరువయ్యారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడం, గత ఏడాది ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మొదలుపెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఒంగోలు నగరపాలక సంస్థతోపాటు ఆరు పురపాలక సంఘాలకు ఈ నెల 10వ తేదీన ఎన్నికలు నిర్వహించి 14వ తేదీన ఓట్ల లెక్కించనున్నారు.
గత ఏడాది జరిగిన నామినేషన్ల ప్రక్రియలో అన్ని మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఆ సమయంలో అనామకులతో నామినేషన్లు వేయించి పరువు దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది. ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో ఇండిపెండెట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. టీడీపీ తరఫున మాత్రం పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. పరువు కాపాడుకునేందుకు అభ్యర్థులను బతిమాలి పురపాలక సంఘాల్లో నామినేషన్లు వేయించినా ఈ నెల 3వ తేదీ వరకు ఉపసంహరించుకోకుండా చూసేందుకు ఆ పార్టీ నేతలు నానాతంటాలు పడుతున్నారు.