Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు మహర్దశ పట్టనుంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అనే కంటే పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లలకు మహర్దశ అనడం సబబుగా ఉంటుందేమో. ఎందుకంటే సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఈ రోజు తీసుకున్న నిర్ణయం అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలనే మార్చబోతోంది. నాడు– నేడు కార్యక్రమంతో ప్రజలకు అత్యంత అవసరమైన వైద్యం, విద్యను ఉచితంగా నాణ్యతతో అందించే లక్ష్యంతో ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలను సకల సౌకర్యాలతో మార్చబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాడు – నేడు కార్యక్రమం అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వర్తింపజేయాలని సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ రోజు గురువారం మహిళా, శిశు సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో అంగన్‌వాడీ కేంద్రాలపై చర్చించిన సీఎం జగన్ వాటిని ప్రి స్కూళ్లుగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ప్రహరి, మరుగుదొడ్లు, ఫ్రిజ్, ఫర్నిచర్, బెంచీలు, బోర్డులు, ఫ్యాన్లు,.. తదితర అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. మొదటి దశలో 25 వేల అంగన్‌వాడీ కేంద్రాలను నాడు – నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేయాలని సంకల్పించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సొంత భవనాలు లేని చోట 35 వేల అంగన్‌వాడీ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఇచ్చే ఆహారం అత్యంత శుభ్రత, నాణ్యతతో ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తల్లి బిడ్డ సంరక్షణలో అంగన్‌వాడీలు కీలక ప్రాత పోషిస్తున్నాయని జగన్ కొనియాడారు. ప్రి స్కూల్ తరహాలో పిల్లలకు విద్యా, బుద్ధులు నేర్పించాలని, ప్రాథమిక పాఠశాలకు నేరుగా ఒకటో తరగతిలో వారు రాణించేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాథమిక విద్య నుంచి పీజీ వరకూ ప్రభుత్వ విద్యను సమూలంగా మార్చిన సీఎం జగన్ ఇప్పుడు కార్పొరేటర్ తరహాలో ఎల్‌కేజీ, యూకేజీలు.. కూడా అంగన్‌వాడీల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఫలితంగా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుంది.