Peddireddy, Kuppam Municipality Results – చంద్రబాబుకు పెద్దిరెడ్డి చురకలు.. పుంగనూరులో పోటీ చేయాలని ఆహ్వానం

‘కుప్పంలో సర్పంచ్‌.. మండల పరిషత్‌.. మున్సిపల్‌ ఎన్నికల్లో మిమ్మల్ని, మీ పార్టీని ప్రజలు తిరస్కరించారు. వరుసగా మూడు ఎన్నికల్లో మీరు ఓటమి చెందారు. ప్రజలు మిమ్మల్ని, మీ కుమారుడుని కుప్పం రావద్దని తేల్చిచెప్పారు చంద్రబాబు. టీడీపీ పార్టీ నీది కాదు. నీ మామకు వెన్నుపోటి పొడిచి ఆ పార్టీని సొంతం చేసుకున్నావు. రాష్ట్రంలో పార్టీని జీరో చేశావు. ఇకనైనా ఆ పార్టీని ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు అప్పగించి నీవు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది. నీకు కూడా 70 ఏళ్లు దాటాయి. హైదరాబాద్‌లో ఇంటికి పరిమితమైతే నీకు ఆరోగ్యంగా కూడా మంచిది’ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు.

కుప్పం ఎన్నికల ఫలితాలు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నైజాన్ని, ఆయన కుమారుడు లోకేష్‌ నోటి దురుసుతనాన్ని సున్నితమైన మాటలతో పెదిరెడ్డి చీల్చిచెండాడారు. ‘కుప్పం తీర్పుతో ప్రజలు మీ రెండు చెంపలూ వాయించారు. మిమ్మల్ని, మీ కుమారుడుని కుప్పం రావద్దంటున్నారు. దీనిని మీరు గుర్తించాలి’ అని కోరారు. ఎన్టీఆర్‌ పార్టీ పెడితే ఆయన మీద పోటీ చేస్తానని బాబూ చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆనక ఆయన పార్టీలో చేరి పదవీచ్యుతుడిని  చేసి, పార్టీని గుంజుకుని, ఆయన మరణానికి కారణమయ్యాడని విమర్శించారు.

‘నీ నియోజకవర్గంలోనే నీ పార్టీకి మూలాలు లేకుండా చేశావు. ఇంకా పార్టీకి అధ్యక్షునిగా ఉండడం న్యాయం కాదు. ఇప్పటికైనా తప్పుకో.. ప్రజలు సంతోషిస్తారు. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌ మోహన్‌ రెడ్డి తండ్రి బాటలో నడిచి ముఖ్యమంత్రి అయ్యారు. తండ్రి కన్నా గొప్ప పేరు తెచ్చుకుంటున్నారు. కాని మీ కుమారుడు లోకేష్‌ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మంగళగిరిలో మీ ఇద్దరికీ ఓట్లున్నా ఓడిపోయామనే బాధలో ఉన్నారు. ఇకనైనా రాజకీయాల్లో తప్పుకుని హైదరాబాద్‌కు పరిమితమవ్వండి. ఇంత జరిగినా నాకు సిగ్గూ, ఎగ్గూ లేదు. రాజకీయాల్లో కొనసాగుతానంటే మీ ఇష్టం’ అని పెద్దిరెడ్డి అన్నారు.

‘నేను ముందే చెప్పాను 17న మాట్లాడతానని. ఆయన కుమారుడు లోకేషన్‌ ‘నన్ను పెదిరెడ్డి గాడు’ అని సంబోధించాడు. నేను మా నాన్నలా సాఫ్ట్‌ కాదు… నేను చాలా పెద్ద రౌడీని అని లోకేష్ మాట్లాడిన విషయాలు మీడియాలో వచ్చాయి. మీరు ఎలాంటివారో నాకు అనవసరం. నన్ను, సీఎం జగన్‌ను ఎంత దుర్భాషలు ఆడింది ప్రజలు చూశారు. మేము సంస్కారవంతులం కాబట్టి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. కాని ఇక నుంచి నా గురించి కాని, నా కుటుంబం గురించి కాని నీవు కాని, నీ కొడుకు కాని, నీ అనుచరులు గాని అనరాని మాటలు మాట్లాడితే ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాను’ అని పెదిరెడ్డి హెచ్చరించారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ఒక జిల్లా, ఒక మున్సిపాలిటీకి పరిమితం కాకుండా కులం, మతం అనే తేడా లేకుండా అన్నివర్గాల ఆదరాభిమానాలు సంపాదించేలా ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి తీర్చిదిద్దారు. ఈ కారణంగానే కుప్పం మున్సిపాలిటీలో మేము ఘన విజయం సాధించామని పెద్దిరెడ్డి చెప్పారు. జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, గ్రామ వ్యవస్థలోకి తీసుకువచ్చిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లీనిక్‌లు వంటి కార్యక్రమాలు చేపట్టారు. మౌళిక సదుపాయాల కల్పనకు పెద్ద పీఠ వేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్లుగా భావించడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా పనిచేయడం వల్ల గెలిచాము.

చంద్రబాబు సర్పంచ్‌ ఎన్నికలు జరిగినప్పుడు ఏమీ మాట్లాడలేదు. అయిపోయిన తరువాత అంతా మోసం అన్నారు. దొంగ వోట్లు వేశారన్నారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల సమయంలో టీడీపీ వాళ్లు ఎన్ని దౌర్జన్యాలు చేశారో ప్రజలు చూశారు. విజయవాణి హైస్కూల్ ని ధ్వంసం చేశారు. మహిళలపై దాడులు చేశారు. గతంలో ఇలా చేసే గెలిచేవారు. ఈసారి అడ్డుకున్నాం కాబట్టే 89 మంది సర్పంచ్‌లలో 75 గెలిచాం. మండల పరిషత్‌, జెడ్పీటీసీలు గెలిచాం అని పెదిరెడ్డి వివరించారు. బాబు స్వయంగా హైకోర్టుకు వెళ్లి స్పెషల్‌ ఆఫీసర్‌ అనుమతి కావాలని కోరారు. కౌంటింగ్‌ రికార్డు చేయాలని అనుమతి తెచ్చుకున్నారు. మాకు కూడా సంతోషమేసింది. ఫలితాల మీద ఇక ఆయన మాట్లాడానికి ఆయనకు ఏమీ లేదని చెప్పారు.

‘అభివృద్ధి చేశాం.. డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. ఓడినవారు ఏదో ఒకటి చెబుతారు. మేము పట్టించుకోదలుచుకోలేదు’ అని పెదిరెడ్డి స్పష్టం చేశారు. ‘వచ్చే ఎన్నికల్లో బాబు కుప్పంలో పోటీ చేస్తాడని నేను అనుకోవడం లేదని జోష్యం చెప్పారు. పుంగనూరులో నా మీద పోటి చేయమని చంద్రబాబును ఎప్పుడూ అహ్వానిస్తూనే ఉంటానన్నారు. కాలేజీ నుంచి మేము వేరువేరు గ్రూపులకు నాయకులం. ఆ రోజుల్లో నేను స్టూడెంట్‌ యూనియన్‌ నాయకునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అప్పుడు నా మీద ఎందుకు పోటీ పెట్టలేదో మీరు వెళ్లి అడగండి అని విలేఖరులను కోరారు.

Show comments