బీఎన్ రెడ్డి అయిష్టంగా తీసిన రాజ‌మ‌కుటం – Nostalgia

మ‌ల్లీశ్వ‌రి లాంటి క‌ళాఖండం తీసిన బీఎన్ రెడ్డి, రాజ‌మ‌కుటం లాంటి బోర్ సినిమా కూడా తీశాడు. అస‌లు ఆయ‌న‌కి ఈ సినిమా తీయ‌డ‌మే ఇష్టం లేదు. కేవీ రెడ్డిలాగా (మాయాబ‌జార్ ద‌ర్శ‌కుడు) జాన‌ప‌ద సినిమాలు తాను తీయ‌లేన‌ని బీఎన్ న‌మ్మ‌కం. అయితే కొన్ని ఒత్తిళ్ల వ‌ల్ల తీయాల్సి వ‌చ్చింది. అద్భుత‌మైన పాట‌లున్న ఈ సినిమాలో క‌థ ముందుకు సాగ‌దు.

పులివెందుల స‌మీపంలోని ఎద్ద‌ల‌య్య‌గారికొత్త‌ప‌ల్లెలో జ‌న్మించిన బీఎన్ కొంత కాలం ప్రొద్దుటూరులో చ‌దువుకుని త‌ర్వాత మ‌ద్రాస్ వెళ్లాడు. నాట‌క రంగంలో కొంత కృషి చేసిన త‌ర్వాత ద‌ర్శ‌కుడు అయ్యాడు. బీ నాగిరెడ్డి (విజ‌యా అధినేత‌) ఈయ‌న సోద‌రుడే. ఇంకో సోద‌రుడు బీఎన్ కొండారెడ్డి గొప్ప కెమెరామెన్‌. రాజ‌మ‌కుటం సినిమాలో ఈయ‌న ప్ర‌తిభ క‌నిపిస్తుంది.

రాజ‌మ‌కుటంలో తొలిసీన్‌లోనే రాజుని ఆయ‌న త‌మ్ముడు ప్ర‌చండుడు (గుమ్మ‌డి) హ‌త్య చేయిస్తాడు. గురుకులంలో ఉన్న రాజ‌కుమారుడు ప్ర‌తాప్‌పైన (ఎన్టీఆర్‌) కూడా హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఇక్క‌డే క‌థ స్ప‌ష్ట‌మైపోయింది. హీరో త‌న చిన్నాన్న మీద ప‌గ తీర్చుకుంటాడ‌ని అయితే ఆ ప‌ని చేయ‌కుండా కొన్ని రీళ్లు పిచ్చివాడుగానూ , మ‌రికొన్ని రీళ్లు తిరుగుబాటు దారునిగానూ క‌నిపిస్తాడు. చేతికి చిక్కిన గుమ్మ‌డిని చంపేయ‌కుండా వ‌దిలేస్తుంటాడు. ఒక‌వేళ హీరోకి ఆవేశం వ‌చ్చినా త‌ల్లి (క‌న్నాంబ‌) చ‌ల్లారుస్తూ ఉంటుంది.

1960లో విడుద‌లైన ఈ సినిమాని త‌మిళంలో కూడా బీఎన్ తీశాడు. రెండుచోట్లా ఆడ‌లేదు. ఈ సినిమాకి రికార్డింగ్ – రీరికార్డింగ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్ చేశాడు. ఆయ‌న తండ్రి కాశీనాధుని సుబ్ర‌మ‌ణ్యం. వాహిని సంస్థ‌లో విజ‌య‌వాడ మేనేజ‌ర్‌గా ప‌నిచేసేవాడు.

ఆయ‌న‌తో క‌లిసి బీఎన్ ఏలూరులో ఈ సినిమా చూశారు. ప్రేక్ష‌కుల్లో ఒక‌డు “బీఎన్‌కి ఏం పోయే కాలం వ‌చ్చింది. ఇలాంటి సినిమా తీసాడు” అని అన్నాడ‌ట‌. బీఎన్ నొచ్చుకుని లేచి వ‌చ్చేశాడ‌ట‌. నేను సంపాదించుకున్న పేరు అంతా పోయింద‌ని బాధ‌ప‌డ్డాడ‌ట బీఎన్‌.

మాస్టార్ వేణు (న‌టుడు భానుచంద‌ర్ తండ్రి) సంగీతం ఈ సినిమాలో ఉంత బాగుంటుందంటే “స‌డిసేయ‌కో గాలి” పాట ఆల్‌టైం హిట్‌. దేవుల‌ప‌ల్లి కృష్ణ‌శాస్ర్తి రాసారు. కొస‌రాజు జాన‌ప‌ద గీతాలు “ఏటి ఒడ్డున మా ఊరు” , “చూడ‌చ‌క్క‌ని చుక్క‌ల‌రేడు” విన‌సొంపుగా ఉంటాయి.

బాలంత్ర‌పు ర‌జ‌నీకాంత‌రావు 3 పాట‌లు నాగ‌రాజు పేరుతో రాశారు. “జింగ‌న‌టింగ‌న ఢీల్లా” పాట వినండి. చాలా స‌ర‌దాగా ఉంటుంది.

Show comments