అదృష్టం అంటే వీరిదే.. పోయిన డబ్బులు, బంగారం దొరికాయి

గజిబిజీ, గందగోళం పరిస్థితుల మధ్య ప్రయాణాలు కూడా హడావుడిగా సాగిపోతుంటాయి. బస్సు, రైళ్లల్లో ప్రయాణం చేసేటప్పుడు కంగారుగా ఎక్కడం, దిగడం చేస్తుంటారు. అదే సమయంలో కొన్ని సార్లు లగేజీలు, బ్యాగులు మర్చిపోతుంటారు. అందులో విలువైన వస్తువులు, ఆభరణాలు, డాక్యుమెంట్లు, సర్టిఫికేట్లు ఉండిపోతుంటాయి. ఇక ఒకసారి పోయాయా అవి దొరకడం కష్టం. అవి నిజంగా దొరికితే వారంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. అందులోనూ రైళ్లలో పోయినవి దొరికితే ఈ ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అనుకోవచ్చు. అలా అయితే ఈ కోవకే వస్తుంది ఈ కుటుంబం. ఇంతకు ఏం జరిగిందంటే..?

ఈ నెల 18న ఓ కుటుంబం.. ఎల్‌టీటీ-విశాఖ పట్నం రైలులో ప్రయాణిస్తూ.. భీమవరం స్టేషన్‌ రాగానే హడావుడిగా దిగిపోయింది. ఆ కంగారులో ట్రైన్ లో హ్యాండ్ బ్యాగు మర్చిపోయారు. విజయవాడ డివిజన్‌కు చెందిన టీటీఐ లక్ష్మయ్య అదే రైలులో ఎస్-1, బీ-4,5,6 కోచ్‌లలో విధులు నిర్వర్తిస్తున్నారు. రైలు భీమవరం దాటాక బీ 6కోచ్ బెర్త్ లు తనిఖీలు చేస్తుండగా.. బెర్త్ నంబర్ 26 పక్కన డైనింగ్ టేబుల్ పై మహిళ హ్యాండ్ బ్యాగు ఉండటాన్ని గమనించి.. బెర్త్‌లో ఉన్న తోటి ప్రయాణీకులను అడిగితే.. భీమవరంలో దిగిపోయిన వారిది అని చెప్పారు. ఈ విషయాన్ని విజయవాడ కమర్షియల్ కంట్రోలర్‌కు సమాచారం అందించారు.

అంతలో బ్యాగులోని ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసి మాట్లాడగా.. తాము ట్రైనులో బ్యాగు మర్చిపోయినట్లు బాధితురాలు తెలిపింది. అందులో ఏమీ ఉన్నాయో చెప్పాలని సూచించగా.. తోటి ప్రయాణీకుల సమక్షంలో వాటిని నిర్ధారించారు. అందులో రూ. 40 వేలు డబ్బు, రూ. 6.50 లక్షల విలువైన 120 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు చెప్పారు. వాళ్లు చెప్పినట్లు అన్ని ఉండటంతో ఆ బ్యాగ్ వారిదే అని నిర్దారించుకున్నారు. రాజమండ్రిలో తన సోదరుడికి అప్పగించాలని లక్ష్మయ్యను కోరారు. దీంతో రాజమండ్రి కమర్షియల్ కంట్రోలర్‌కు, స్టేషన్ అధికారి, జీఆర్‌పీ పోలీసులకు సమాచారం అందించారు. రాజమండ్రిలో రైలు ఆగిన తర్వాత ఆమె సోదరుడి వివరాలు సేకరించి బ్యాగును అందజేశారు. విధుల్లో నిజాయితీని ప్రదర్శించిన లక్ష్మయ్యను రైల్వేశాఖ అధికారులు అభినందించారు.

Show comments