విశాఖ ఉక్కు – పట్టు బిగించిన ఆంధ్ర రాజకీయ పక్షాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో స‌త్తా చాటాల‌ని తాప‌త్ర‌యం ప‌డుతున్న రాష్ట్ర బీజేపీ నేత‌ల ఆశ‌లకు కొత్త చిక్కొచ్చింది. ఇప్ప‌టికే రాజ‌ధానుల అంశంపై ఎటూ నిల‌బ‌డ‌లేక‌.. ఊగిస‌లాడుతున్న పార్టీకి తాజా కేంద్ర ప్ర‌క‌ట‌న మ‌రింత ముప్పు తెచ్చేలా ఉంది. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అన్న నినాదం మ‌రోసారి మార్మోగుతోంది. కేంద్ర పాలకుల నిర్ణయం పట్ల విశాఖ భగ్గుమంటోంది. విశాఖలో ఉక్కు మంట పెద్ద ఎత్తున రాజుకుంటోంది. విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్ని పార్టీలు ముక్తకంఠంతో నినదించాయి. కామ్రెడ్స్ అయితే కదం తొక్కి మరీ కేంద్రంతో అమీ తుమీ తేల్చుకుంటామని హెచ్చరించారు. అధికార పార్టీతో పాటు ప్ర‌తిప‌క్షం కూడా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. వైసీపీ అయితే ఎటువంటి త్యాగాల‌కైనా సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించింది. బీజేపీ మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఎటొచ్చి రాష్ట్ర బీజేపీయే ఇర‌కాటంలో ప‌డింది. దీనికి తోడు ప్రైవేటీక‌ర‌ణ‌కు వెన‌క్కి త‌గ్గేది లేదంటూ.. రాష్ట్రానికే చెందిన బీజేపీ ఎంపీల వ్యాఖ్య‌లు మ‌రింత క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌‌పై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌‌‌‌ను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన సమర్థించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు పెంచేందుకే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‌ను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు తెలిపారు. షేర్‌ హోల్డర్లకు లాభాలు తెచ్చేందుకే ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై ప్రభుత్వం వ్యాపారం చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకొచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ విశాఖలోనే ఉంటుందని, వేరే దేశానికి తీసుకెళ్లేది కాదు క‌దా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. టీడీపీ, వైసీపీ ఆందోళన చేసినంత మాత్రాన ప్రైవేటీకరణ మాత్రం ఆగదని సుజనాచౌదరి స్పష్టం చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పైగా.. స్థానిక ప్ర‌జ‌లు, ఉద్యోగుల మ‌నోభ‌వాలు ఆయ‌న మాట్లాడ‌డంపై నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది.

లోక్ సభలో విశాఖ ఉక్కు ప్రైవేట్ చేయడంపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని, ప్రజల పక్షాన నిలబడతామని, అక్కడే అన్నీ తేల్చుకుంటామని వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇతర వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో వైసీపీ గళం విప్పుతామని గట్టిగానే గర్జిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరితో కలిసి పోరాటం చేస్తామని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తే బీజేపీ పతనం ప్రారంభమైనట్టేనని ఎమ్మెల్యే అన్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు చరిత్రలో నిలిచిపోయేలా ఉద్యమం చేస్తామన్నారు. ఆనాడు 32 మంది బలిదానంతో విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చిందన్నారు. ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే పోరాట పటిమతోనే సాధించుకున్నామన్నారు. వేలాది కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పును సరిదిద్దుకొని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే తిప్పాల నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

బీజేపీతో పొత్తు ఉన్న జనసేన కూడా ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. దీనిపై పూర్తి స్థాయిలో స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. విశాఖపట్నంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణను గ‌తంలో పవన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ సమయంలో ఉద్యోగులు, స్థానికులు చేపట్టిన ఆందోళనకు ప్రత్యక్షంగా వెళ్లి మద్దతిచ్చారు. ఇప్పుడు కూడా పవన్ అదే స్టాండ్ తీసుకొని కేంద్రంపై పోరాడాలని స్థానికులు, ఉద్యోగులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జనసేన పార్టీ వ్యతిరేకమంటూ ప్ర‌క‌టించిన ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ త్వరలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారని తెలిపారు. రాష్ట్ర బీజేపీ మాత్రం కేంద్ర ప్ర‌క‌ట‌న‌ను వ్య‌తిరేకించ‌లేక‌.. ప్రైవేటీక‌ర‌ణ‌పై పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌ను స‌మ‌ర్థించ‌లేక స‌త‌మ‌తం అవుతోంది.

Show comments