అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై కేసీఆర్ కౌంటర్ అటాక్

రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు పేరుంది. ఎక్క‌డ నెగ్గాలో.. ఎక్క‌డ త‌గ్గాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. కేంద్రం – కేసీఆర్ సంబంధాల‌పై ఇటీవ‌ల బాగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాల‌యం శంకుస్థాప‌న‌కు వెళ్లిన కేసీఆర్.. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది రోజులు అక్క‌డే మ‌కాం వేశారు. కేంద్ర పెద్ద‌ల‌ను అంద‌రినీ క‌లిశారు. తెలంగాణ గ‌ల్లీలో బీజేపీతో ఢీ కొడుతున్న టీఆర్ఎస్ అధినేత ఢిల్లీలో బీజేపీ ప్ర‌ముఖుల‌ను వ‌రుస‌గా క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. అదీ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ తెలంగాణ ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో… కేసీఆర్ బీజేపీ ప్ర‌ముఖులను క‌ల‌వ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. నెల కూడా తిర‌గ‌క ముందే మ‌రోసారు ఢిల్లీ వెళ్లారు. ఈ నేప‌థ్యంలో గ‌ల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ.. అంటూ బీజేపీ – కేసీఆర్ ను ఉద్దేశించి ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

సీన్ క‌ట్ చేస్తే.. అసెంబ్లీ స‌మావేశాల వేదిక‌గా కేంద్రంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో పర్యాటక అభివృద్ధి తో పాటు ప‌లు అంశాల్లో కేంద్రంచిన్నచూపు చూస్తోందంటూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక్క‌డ పద్మశ్రీ అవార్డులకు అర్హులు ఎవరూ లేరా అని ప్రశ్నించారు. చిన్న ఎయిర్‌పోర్టులను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేసి ఆరున్నరేళ్లయినా పట్టించుకోవడం లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక కమిటీ వేస్తామన్నారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ ప‌ట్ల కేంద్ర నిర్ల‌క్ష్య వైఖ‌రిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మండిప‌డ్డారు. తెలంగాణను కేంద్రం చిన్న‌చూపు చూస్తోంద‌ని సీఎం ధ్వ‌జ‌మెత్తారు.

టూరిజంతో పాటు ఇత‌ర విష‌యాల్లో కేంద్రం తెలంగాణ‌ను ప‌ట్టించుకోవ‌డం లేదన్నారు. తెలంగాణ చాలా ఉజ్వ‌ల‌మైన సంస్కృతి, చ‌రిత్ర, సంప్ర‌దాయాలు.. గొప్ప క‌ళ‌ల‌తో కూడుకున్న ప్రాంతం… 58 సంవ‌త్స‌రాలు స‌మైక్యాంధ్ర ప్ర‌దేశ్‌లో తెలంగాణ‌ను ప‌ట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అద్భుత‌మైన జ‌ల‌పాతాలు తెలంగాణ‌ ప్రాంతంలో ఉన్నాయి. ఖ‌మ్మంలో పాండ‌వుల గుట్ట‌ను ప‌ట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్.

వార‌స‌త్వంలో వ‌చ్చిన పురాత‌న కోట‌లు, దోమ‌కొండ కోట అప్ప‌గిస్తామ‌ని చెబుతున్నారు. చారిత్రాక ఉజ్వ‌ల‌మైన అవ‌శేషాలు ఉన్న తెలంగాణ ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్య వైఖ‌రితో ఉంది. తెలంగాణ‌లో క‌ళాకారులు, విశిష్ట‌మైన వ్య‌క్తులు ఉన్నారు.

ఢిల్లీలో కేంద్రానికి విన‌తులు స‌మ‌ర్పించి నెల కూడా తిర‌గ‌క ముందే.. కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ – బీజేపీ మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తున్న సంద‌ర్భంలో కేసీఆర్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అలాగే.. ఇటీవ‌ల బండి సంజ‌య్ తొలి విడ‌త పాద‌యాత్ర ముగింపు స‌భ‌లో బండితో పాటు.. స్మృతి ఇరానీ తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ కూడా కేంద్రంపై ఫైర్ అయ్యార‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

Show comments