iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నదీ జలాల వినియోగంపై సీఎం ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులను స్వయంగా ఆయన పరిశీలిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చి లక్ష్యాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. గత వారం వెలిగొండ ప్రాజెక్ట్ ని సందర్శించిన సీఎం వచ్చే జూలై నాటికి నీరందించాలనే ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్ట్ పనుల వేగవంతానికి సూచనలు చేశారు.
తాజాగా పోలవరం విషయంలోనూ జగన్ ఆశాజనకంగా కార్యాచరణకు పూనుకుంటున్నారు. తన తండ్రి వైఎస్సార్ కలల ప్రాజెక్ట్ పోలవరం తన హయంలో పూర్తిచేయాలనే సంకల్పంతో సీఎం ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా రివర్స్ టెండరింగ్ ద్వారా మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. తద్వారా సుమారు 700 కోట్ల రూపాయలు ఆదా చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ప్రస్తుతం స్పిల్ వే నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలి గోదావరి వరదల కారణంగా స్పిల్ ఛానెల్ లో నిల్వ ఉండిపోయిన నదీ జలాలను ఖాళీ చేశారు. స్పిల్ వే వేగంగా పూర్తి చేసి, స్పిల్ ఛానెల్ కూడా సిద్ధమయితే వచ్చే జూన్ నాటికి కాఫర్ డ్యామ్ పూర్తి చేయవచ్చనే ఆలోచనతో అధికారులు ఉన్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో కాఫర్ డ్యామ్ నిర్మాణం కొంత వరకూ జరిగినప్పటికీ స్పిల్ వే సిద్ధం కాకపోవడంతో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులకు ఆటంకం ఏర్పడింది. ఇక రాబోయే ఐదారు నెలల్లో ప్రత్యేకంగా పోలవరం పనులను వేగవంతం చేయడం ద్వారా వచ్చే వరదల సీజన్ లో ఈసీఆర్ఎఫ్ పనులకు ఆటంకం రాకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో మిషన్ 2021 ద్వారా వచ్చే ఏడాదికి పోలవరం జలాలను తరలించాలనే సంకల్పంతో కనిపిస్తోంది. స్పిల్ వే నిర్మాణ పూర్తయితే గ్రావిటీ ద్వారా జలాలను తరలించడం కష్టం కాబోదన్నది ఇరిగేషన్ అధికారుల అంచనా. గత ప్రభుత్వం కూడా పెద్ద స్థాయిలో ప్రచారం చేసి అలాంటి ప్రయత్నం చేసినప్పటికీ దానికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు లేకపోవడం, అదే సమయంలో కాంట్రాక్ట్ సంస్థల విషయంలో ఉదాశీనత కారణంగా పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం జరగడంతో పోలవరం పనులు ముందుకు సాగలేదనే అభిప్రాయం ఉంది.
ఇప్పటికే పోలవరం పనుల్లో అవినీతి అంశాన్ని జగన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దానికి తగ్గట్టుగానే రివర్స టెండరింగ్ ద్వారా ప్రజాధానం కాపాడుతున్నట్టు చెబుతోంది. అదే సమయంలో జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సీఎం పలుమార్లు పోలవరం అంశాన్ని నేరుగా కేంద్రంలోని పెద్దల దృష్టికి తీసుకురావడం, పెరిగిన అంచనాలకు ఆర్థిక శాఖ ఆమోదం కోసం ప్రయత్నాలు చేస్తుండగా మరో వైపు పార్లమెంట్ లో కూడా వైసీపీ ఎంపీలు ఈ విషయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. దాంతో నిధుల కేటాయింపు విషయంలో కేంద్రం నుంచి సానుకూలత వస్తే పోలవరం వీలయినంత త్వరగా పూర్తి చేయవచ్చనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా వడివడిగా అడుగులు వేసేందుకు సన్నద్ధం అవుతోంది.
పోలవరం పనులకు సంబంధించి తాజా అంచనాల ప్రకారం 75 శాతం పనులు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. కీలకమయిన భాగం మిగిలి ఉన్న దశలో దానిని పూర్తి చేసేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే సీజన్ లో పోలవరం కాలువల ద్వారా నీటిని తరలించేందుకు ఆటంకాలు ఉండవని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడో సారి ముఖ్యమంత్రి హోదాలో పోలవరంలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అంశాలపై ప్రభుత్వ వైఖరిని అధికారులకు వెల్లడించారు. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదే సమయంలో పునరావాసం పెద్ద సమస్యగా ఉన్న తరుణంలో దానికి నిధుల కేటాయింపు విషయంలో వెనుకాడబోమని ప్రకటించారు. గత ప్రభుత్వం నిర్వాసితులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మొన్నటి వరదల్లో అపార నష్టం వచ్చిందని తెలిపారు. వచ్చే సీజన్ లో అలాంటి సమస్య రాకుండా తొలుత 100 నిర్వాసిత గ్రామాల్లో ప్రజలను తరలించేందుకు తగ్గట్టుగా దృష్టి పెట్టాలని ఆదేశించారు. దాంతో ప్రభుత్వం చూపుతున్న చొరవ కారణంగా పోలవరం ప్రాజెక్ట్ వేగంగా ముందుకు సాగే అవకాశాలున్నట్టు అంతా భావిస్తున్నారు.